రాష్ట్రీయం

బలహీనపడుతున్న తీవ్రవాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: దేశ వ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదం బలహీనపడుతోంది. పీపుల్స్ వార్ గ్రూప్ (పీడబ్ల్యూజీ) పరిస్థితి కూడా దాదాపు అదే విధంగా ఉంది. అప్పుడప్పుడు తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు దండకారణ్యం ప్రాంతంలో మెరుపు దాడులకు పాల్పడడం మినహా చెప్పుకోదగిన కార్యకలాపాలు ఏవీ సాగడం లేదనే చెప్పాలి. ఇటీవల కాలంలో పీపుల్స్ వార్ గ్రూప్ నాయకత్వంలో నెలకొన్న సమన్వయ లేమి, సీనియర్లను వెంటాడుతున్న అనారోగ్య సమస్యల కారణంగా యువ కేడర్ మావోయిస్టు పార్టీకి దూరమవుతోంది. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం మావోయిస్టు పార్టీకి గతంలో మాదిరిగా విరాళాలు, ఆయుధాలు అందడం లేదు. దీనివల్ల కేడర్‌కు మనుగడ సంక్లిష్టమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్లక్రితమే మావోయిస్టులు బలహీనపడ్డారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఇక్కడ కార్యకలాపాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. యాంటీ నక్సలైట్ల విభాగంలో పనిచేసిన ఒక సీనియర్ అధికారి అంచనా ప్రకారం గత రెండేళ్లలో దేశ వ్యాప్తంగా ఆరు వేలకు పైగా ఉన్న కేడర్ సగానికి సగం పడిపోయింది. దేశంలో 106 జిల్లాల్లో మావోయిస్టు పార్టీకి కేడర్, ఆయుధాలు ఉండేవి. ఈ రోజు 90 జిల్లాలకే పరిమితమయ్యారు. పశ్చిమబెంగాల్, బిహార్, చత్తీస్‌గడ్‌లో కూడా మావోయిస్టుల ఏరివేతకు పెద్ద ఎత్తున కేంద్ర పారామిలిటరీ బలగాలను నియమించారు. నిన్న మొన్నటి వరకు దండకారణ్యంలో సుక్మా, బీజాపూర్, భూపాలపట్నం తదితర ప్రాంతాలు మావోయిస్టులకు కోటలుగా ఉండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. మావోయిస్టులకు ఆయుధాలు అందే మార్గాలను కూడా పోలీసులు కట్ చేశారు.
డిజిటలైజేషన్, ఉదారవాద ఆర్థిక విధానాలు, మారుమూల ప్రాంతాల్లోకి కూడా మొబైల్ ఫోన్ సేవలు అందుబాటులోకి రావడం, గ్రామీణ ప్రాంతాల్లో యువత పట్టణాలకు వలస వెళ్లడం తదితర కారణాల వల్ల మావోయిస్టు పార్టీ తన పట్టును కోల్పోయిందని సీనియర్ పోలీసు అధికారులు చెప్పారు. నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన పీపుల్స్ మ్యాగజైన్‌లో ఆ పార్టీ పూర్వ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రచురితమైంది. ‘దండకారణ్యంలో 5.5 లక్షల మంది పారామిలిటరీ బలగాలను దింపారు. దీంతో ప్రజా ఉద్యమాలు
బలహీనపడ్డాయి. ఉద్యమాలను మైదాన ప్రాంతాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు విస్తరించలేకపోయాం. వ్యవస్థాపరంగా కూడా కొన్ని తప్పులు, బలహీనతల వల్ల తాత్కాలికంగా బలహీనపడ్డాం. బూటకపు ఎన్‌కౌంటర్లలో పటిష్టమైన నాయకత్వాన్ని కోల్పోయాం. కొత్త ఎత్తుగడలు, కార్యక్రమాలను రూపొందించుకోలేకపోయాం’ అని ఆయన పేర్కొన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో 22 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. నంబాళ్ల కేశవరావు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయనకు 65 సంవత్సరాల వయస్సు ఉంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో 59 ఏళ్లకు తక్కువ వయస్సు ఉన్న వారు లేరు. యువకులు పూర్తిగా పార్టీకి దూరమయ్యారు. పార్టీలో యువరక్తాన్ని చొప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని 40 ఏళ్ల లోపు ఉన్న మావోయిస్టులు పార్టీపై వత్తిడి తెస్తున్నారు. కాని పార్టీ అగ్రానాయకత్వానికి, పార్టీ కేడర్‌కు మధ్య పోలీసు నిర్బంధం వల్ల సమాచార వ్యవస్థలేకుండా పోయింది. పశ్చిమబెంగాల్ కుచెందిన కిషన్‌కు 73 ఏళ్లు ఉన్నాయి. పార్టీమాజీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావుకు 72 ఏళ్లు. 22 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో 11 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు. షీలా మారండి అలియాస్ హేమ అనే ఒక మహిళ కేంద్ర కమిటీ సభ్యురాలుగా ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత హైదరాబాద్‌ను, ఏపీలో విశాఖను కేవలం షెల్టర్ జోన్‌గా మావోయిస్టులు ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారు కారు. ఇటీవల కాలంలో తెలంగాణలో మళ్లీ బలపడేందుకు మావోయిస్టు పార్టీ పావులు కదుపుతోంది. ఈ దిశగా అనేక ప్రజా సంఘాలు, కార్మిక, విద్యార్థి సంఘాలకు చెందిన ప్రతినిధులను ఆకట్టుకునేందుకు మావోయిస్టు పార్టీ ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.