రాష్ట్రీయం

బయటపడిన బోటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 22: ఉభయ తెలుగు రాష్ట్రాలను పెను విషాదంలో ముంచి, 51మంది మరణానికి కారణమైన రాయల్ వశిష్ఠ పర్యాటక బోటు ఎట్టకేలకు 38 రోజుల అనంతరం బయటపడింది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరుమందం వద్ద గత నెల 15వ తేదీన గోదావరిలో మునిగిపోయిన ఈ బోటును మంగళవారం బయటకు తీసుకురాగలిగారు. దాదాపు శిథిలమై, ఎముకలగూడును తలపిస్తున్న బోటును కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం, విశాఖకు చెందిన ఓం శివశక్తి సంస్థ డైవర్ల బృందం విశేషంగా శ్రమించి, ఒడ్డుకు తీసుకురాగలిగాయి. జోరున కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఈ ఆపరేషన్ సాగించారు. బయటపడిన బోటులో ఎనిమిది మృతదేహాలు ఉన్నాయి.
మొత్తం 77 మందితో ప్రయాణిస్తున్న ఈ బోటు కచ్చులూరు మందం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద గోదావరిలో బోల్తాపడింది. ప్రమాదం నుంచి 26 మంది
సురక్షితంగా బయటపడ్డారు. 51 మంది గల్లంతయ్యారు. 39 మృతదేహాల ఆచూకీని గుర్తించగా, 12మంది ఆచూకీ తెలియరాలేదు. దీనితో బోటును వెలికితీస్తే వారి ఆచూకీ లభిస్తుందని బాధిత కుటుంబాలు ఆక్రోశించాయి. ప్రమాదం సంభవించిన తొలినాళ్లలో గోదావరిలో వరద ఉద్ధృతంగా ఉండటంతో సుమారు 300 అడుగుల దిగువన బోటు ఉన్నట్టు భావించారు. దీనితో బోటును బయటకు తీయడం సాధ్యమవుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. మొదట్లో ఉత్తరాఖండ్, జార్ఖండ్, కాకినాడ, విశాఖ పోర్టులకు చెందిన నిపుణులు, ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు అత్యాధునిక పరికరాల సాయంతో బోటు ఆచూకీ కోసం ప్రయత్నించాయి. సుమారు 300 అడుగుల లోతులో బోటు ఉండటం, క్షేత్రస్థాయిలో అననుకూల పరిస్థితుల దృష్ట్యా వెలికితీత ప్రయత్నాలు మొదలుకాలేదు.

ఆపరేషన్ సాగిందిలా....

ఎట్టకేలకు ఇలాంటి వెలికితీత పనుల్లో అనుభవం కలిగిన తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన ధర్మాడ సత్యం (బాలాజీ మెరైన్స్) బృందానికి ప్రభుత్వం బోటు తెలికితీత పనులు అప్పగించింది. 15 రోజుల క్రితం ప్రయత్నాలు ప్రారంభించిన ఈ బృందం నది ఉద్ధృతి అధికంగా ఉండటంతో అధికారుల సూచనల మేరకు వెలికితీత పనులను తాత్కాలికంగా విరమించుకుంది. గోదావరి నీటిమట్టం గణనీయంగా తగ్గడంతో గత వారం రోజులుగా కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్ ఆదినారాయణ పర్యవేక్షణలో ధర్మాడ సత్యం బృందం మళ్లీ బోటు వెలికితీత పనులు ప్రారంభించింది. లంగర్లు కట్టిన రోప్‌లు బోటు చుట్టూ వలయాకారంలో వేసినప్పటికీ చిక్కినట్టే చిక్కి జారిపోయేది. ఇసుక, మట్టిలో కూరుకుపోవడంతో బోటు బరువు సుమారు 40 టన్నుల వరకు ఉండవచ్చని అంచనావేశారు. నీట మునిగివున్న బోటును చేరుకుని, లంగర్లు, తాళ్లను కచ్చితంగా బిగిస్తే మినహా ఇంత బరువులు గల బోటును బయటకుతీయడం సాధ్యం కాదని నిర్ధారించుకున్న ధర్మాడ సత్యం విశాఖకు చెందిన ఓం శివశక్తి డీప్ వాటర్ సర్వీస్ సంస్థను సంప్రదించారు. ఆ సంస్థకు చెందిన పదిమంది డైవర్లు బోటు వెలికితీత పనులకు తరలివచ్చారు. గత మూడు రోజులుగా వీరిలో ఇద్దరు డైవర్లు ఆక్సిజన్ మాస్కుల సాయంతో నీట మునిగివున్న బోటును చేరుకుని, లంగర్లు, తాళ్లను బిగించే కార్యక్రమం చేపట్టారు. వాటిని ఒడ్డునుండి పొక్లయినర్ సాయంతో లాగడం ప్రారంభించారు. సోమవారం బోటు బయటకు వస్తుందని భావించినప్పటికీ, బోటు పైనవున్న టెంటు సహా కొన్ని శకలాలు మాత్రమే బయటకువచ్చాయి.
మంగళవారం ఉదయం నుంచి ఒక రోప్ బయటకు వచ్చేయగా, మరోసారి వేసి మొత్తం రెండు రోప్‌లను వలయాకారంలో బోటు వెనుక భాగంలోని ఇంజన్ ఫ్యాన్ (పొపెల్లర్) వద్ద లంగరు తగిలించి లాగడంతో బోటు ముందు భాగం పైకితేలింది. అనంతరం బోటును పొక్లయినర్‌కు ఇనుప రోప్‌లు కట్టి లాగడం ద్వారా ఎట్టకేలకు మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఒడ్డుకు చేర్చారు.

ఏసీ గదిలో మృతదేహాలు
ఈ ప్రమాదంలో సుమారు పదిమంది ఆచూకీ తెలియకపోవడంతో బోటులో ఉండే ఏసీ గదిలో చిక్కుకుని ఉండవచ్చని అప్పట్లో అనుమానించారు. మంగళవారం బోటును వెలికితీసిన సమయంలో ఏసీ గది నుంచి మృతదేహాలు బయటపడ్డాయి. మంగళవారం మొత్తం ఏడు మృతదేహాలు లభించాయి. వీటిని గుర్తించాల్సివుంది. ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటివరకు విశాఖ జిల్లాతో పాటు తెలంగాణకు చెందిన 12 మంది వరకు ఆచూకీ తెలియాల్సివుంది. ఏడు మృతదేహాలు లభించడంతో ఇంకా ఐదుగురి ఆచూకీ తెలియాల్సివుంది.

ఆనందం... విషాదం

గోదావరి గర్భంలో మునిగిపోయిన బోటును ఎట్టకేలకు వెలికితీయగలిగామని ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం, విశాఖకు చెందిన ఓం శివశక్తి సంస్థ డైవర్లు ఆనందం వ్యక్తంచేశారు. అయితే తమకు అప్పగించిన బాధ్యతను విజయవంతంగా నెరవేర్చగలిగామనే ఆనందం ఉన్నప్పటికీ, 50మందికి పైగా మృత్యువాత పడటం విషాదం కలిగిస్తోందన్నారు. అయినా గల్లంతైన వారి కుటుంబ సభ్యులకు ఏదో రూపంలో చివరి చూపు దక్కేలా చేయగలిగామనే సంతృప్తి మిగిలిందని ధర్మాడి సత్యం పేర్కొన్నారు. పోర్టు అధికారి ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, కాకినాడ పోర్టు అధికారి ఆదినారాయణ, విశాఖ నుండి వచ్చిన ఓం శివశక్తి సంస్థ బృందం, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సంయుక్త సహకారంతో బోటును వెలికితీయగలిగామన్నారు. ఈ ఆపరేషన్‌లో తమ సంస్థకు చెందిన 28మంది శ్రమించారన్నారు.
చాలా లోతైన ప్రాంతం:పోర్టు అధికారి ఆదినారాయణ
కచ్చులూరుమందం వద్ద బోటు మునిగిపోయిన ప్రాంతం చాలా లోతైన ప్రదేశమని ఆపరేషన్‌ను పర్యవేక్షించిన కాకినాడ పోర్టు అధికారి ఆదినారాయణ తెలిపారు. దానిని బయటకుతీయడానికి ముందుగా యాంకర్లనును ఉపయోగించి, కాస్తంత ముందుకు ఈడ్చుకు రాగలిగామన్నారు. అప్పటి నుంచి బోటు ఎక్కడుందో గుర్తుగా అలాగే ఉంచామన్నారు. నీటి మట్టం తగ్గిన తర్వాత డైవర్స్‌ను రంగంలోకి దించామని, జిల్లా అధికారులు, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎప్పటికపుడు చర్చిస్తూ సత్యం, ఎస్‌ఐ నాగరాజు తదితరుల సహకారంతో బోటును వెలికితీయగలిగామన్నారు. ఈ ప్రమాదం చాలా దురదృష్టకరమని, ఇటువంటి ఘటనలు జరగకూడదని కోరుకుంటున్నానన్నారు.
*చిత్రం... శిథిల స్థితిలో ఒడ్డుకు చేరిన బోటు.. అందులోనే చిక్కుకున్న మృతదేహాలు