రాష్ట్రీయం

అందరివాడు ఎన్టీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలుగువారి ఖ్యాతిని దశదిశలా చాటిన నటుడు, నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. ఎన్టీఆర్ అన్నా, ఆయన కుటుంబమన్నా తనకెంతో అభిమానమన్నారు. ఆ మహానటుడు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఉంటాడని కెసిఆర్ నివాళి ప్రకటించారు. నగరంలోని ఎన్టీఆర్ గార్డెన్ మార్చనున్నట్టు అబద్ధపు ప్రచారం జరుగుతుందని, మహానటుడి గుర్తుగా అది ఎప్పటికీ చిరస్థాయగా అలాగే ఉంటుందని, చెక్కుచెదరదని హర్షద్వానాల మధ్య స్పష్టం చేశారు. అంబేద్కర్ విగ్రహం నిర్మాణం నేపథ్యంలో ఎన్టీఆర్ గార్డెన్‌ను తరలిస్తారని కొందరు పనిగట్టుకుని వివాదం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటి ప్రచారాలు సరికాదన్నారు. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ నటించే వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కెసిఆర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగువారికి ఆరాధ్యుడని కీర్తించారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కెసిఆర్ క్లాప్ కొట్టగా, ప్రముఖ నటుడు చిరంజీవి కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ బాలకృష్ణ వందో సినిమాకు శాతకర్ణి కథాంశం ఎన్నుకోవడం గొప్ప నిర్ణయమని, దీన్ని సినిమా చేయడం చిన్నవిషయం కాదని అంటూ, ఒక శకానికి నాంది పలికిన తెలుగు చక్రవర్తి కథే శాతకర్ణి కథ అన్నారు. తెలుగు ప్రజలు చిరకాలం గుర్తుంచుకునే కథతో సినిమా చేయడం ఆనందంగా వుందని, ఈ సందర్భంగా బాలకృష్ణకు ఆశీస్సులు అందిస్తున్నానన్నారు. తప్పకుండా ఈ సినిమా 200 రోజులు ఆడుతుందని, తెలుగు ప్రజలందరూ సినిమా చూసి మన చరిత్రను తెలుసుకోవాలన్నారు. తెలుగు ప్రజలను మద్రాసీలు అని పిలిచే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఉందని తెలియజెప్పి తెలుగువారికి గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. శాతకర్ణి సినిమా పూర్తయిన తరువాత చిరంజీవి, వెంకటేష్ తదితర ప్రముఖులతో సకుటుంబంగా చూసే అవకాశం కల్పించాల్సిందిగా బాలకృష్ణను కోరుతున్నానన్నారు.
అనంతరం హీరో బాలకృష్ణ మాట్లాడుతూ తెలంగాణలోని కోటిలింగాలలో పుట్టి ఆంధ్రలోని అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేసి రాజ్యమేలిన తెలుగువాడైన గౌతమీపుత్ర శాతకర్ణి గురించి చాలామందికి తెలియదని, ఆయన గురించి అందరికీ చెప్పాలన్న లక్ష్యంతో, తన వందో సినిమా విభిన్నంగా ఉండాలన్న తపనలో చిత్రం చేస్తున్నానన్నారు. శాతకర్ణి గురించి కేవలం తెలుగవారే కాకుండా ప్రపంచమంతా తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తనకు అపజయాలు ఎదురైనా నిలదొక్కుకున్నానని, విజయాలు సాధించానన్నారు. కార్యక్రమంలో సినీ ప్రముఖులు చిరంజీవి, దాసరి నారాయణ రావు, వెంకటేష్, రాఘవేంద్రరావు, దర్శకుడు క్రిష్, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, హరీశ్‌రావ్, జగదీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

chitram బాలకృష్ణ వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ప్రారంభోత్సవ
పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కెసిఆర్