రాష్ట్రీయం

జీవితాంతం నిజాయితీగా ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 28: భవిష్యత్‌లో కూడా ఏ ఒక్కరూ వేలెత్తి చూపనంతగా తన జీవితాంతం నీతి నిజాయితీతో ఉంటానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తనలో ఏ మాత్రం స్వార్థం లేదని, బలహీనతలు అంతకంటే లేవని, అయితే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే తన బలహీనత అని ఆయన చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ మినహా ఏ ఒక్కరూ మిగలరన్నారు. రెవెన్యూ శాఖలో నయాపైసా అవినీతి లేకుండా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు నడుం కట్టామన్నారు. విజయవాడ నగర శివారులోని వేర్వేరు ప్రదేశాల్లోని ఫంక్షన్ హాళ్లలో ఎంతో ఆడంబరంగా జరిగిన కార్యక్రమాల్లో కర్నూలు జిల్లా శ్రీశైలం వైకాపా శాసనసభ్యుడు, ఆ పార్టీ జిల్లా కన్వీనర్ బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుయాయులు, అలాగే విశాఖపట్టణం జిల్లా అరకు వైకాపా శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు, గండి బాబ్జీ, వారి అనుయాయులు పెద్ద సంఖ్యలో చంద్రబాబుచే పచ్చ కండువాలు కప్పించుకున్నారు. వీరిరువురి వలసలతో తెలుగుదేశంలో చేరిన వైకాపా ఎమ్మెల్యేల సంఖ్య 16కు చేరింది. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు ముందెన్నడూ లేనివిధంగా జగన్‌పై నిప్పులు చెరిగారు. జగన్ ప్రవర్తన సక్రమంగా లేకనే ఆ పార్టీ శాసనసభ్యులు ఒకరి వెంట మరొకరిగా వెలుపలకు వస్తున్నారన్నారు. ఎంతో పారదర్శకతతో 33 వేల 500 ఎకరాల భూమిని సమీకరించామని, తనపై నమ్మకం, విశ్వాసంతో రైతులు తమంతట తాముగా ఇచ్చారని తెలిపారు. ఇప్పటివరకు ఒక్క ఎకరం అమ్మలేదని, పైగా అభివృద్ధి చేసిన భూమిలో 25 శాతం రైతులకే ఇస్తున్నామని, రైతులకు పదేళ్లపాటు కౌలు ఇస్తూ ఏటా పది శాతం పెంచుతున్నామన్నారు. ఇక అవినీతి జరిగేందుకు ఆస్కారం ఎక్కడని ప్రశ్నించారు. పైగా రూ.లక్ష కోట్ల అవనీతి జరిగిందంటున్నారంటూ ఆయన అవినీతిలో కూరుకుపోయి తమపై బురద జల్లుతున్నారని పరోక్షంగా జగన్‌పై విరుచుకుపడ్డారు. తలసరి ఆదాయంలో చివరి స్థానంలో ఉన్నప్పటికీ దేశంలో అభివృద్ధిపరంగా మొదటి స్థానంలో ముందుకు పోతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత రూ.16 వేల కోట్ల లోటు ఉన్నప్పటికీ సమస్యలను అధిగమించి రాష్ట్భ్రావృద్ధి కోసం శ్రమిస్తున్నానన్నారు. సంక్షేమ పథకాల అమల్లో ముందున్నామన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రహదారి కూడా గుం తలు లేకుండా చూడాలన్నది తన అభిమతంగా చెప్పారు. వైద్యరంగంలో పెనుమార్పులు తీసుకువస్తూ, పైసా ఖర్చు లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రి వరకు ఉచిత వైద్య పరీక్షలు, చికిత్స జరిగేలా చూస్తున్నామన్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్యం కోసం ఏ ఒక్కరూ అప్పులబారిన పడకుండా, ఆస్తి అమ్ముకోకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలతో ప్రమేయం లేకుండా ఎవరి భూమి ఎక్కడ ఉందో తెలిసేలా చేస్తున్నామన్నారు. తనకు ఒక్క మనుమడు ఉన్నాడని, అప్పుడప్పుడు చూడాలని ఉన్నా వెళ్లలేకపోతున్నానని చెప్పినపుడు నవ్వులు వెల్లివిరిశాయి. ఈ సమావేశాల్లో మంత్రులు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, ఎంపి జెసి దివాకర రెడ్డి, కర్నూలు విశాఖ జిల్లాల ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్యులు పాల్గొన్నారు.

చిత్రం
టిడిపిలో చేరుతున్న శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖరరెడ్డి