తెలంగాణ

కళ్లముందు కరవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణలో కరవు పరిస్థితులను పరిశీలించేందుకు మంగళవారంనాడు పలు జిల్లాల్లో కేంద్రబృందం పర్యటించింది. రంగారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో కరవు పరిస్థితులను క్షేత్రస్థాయిలో ఈ బృందం పరిశీలించింది. ఆయా జిల్లాల్లో కరవు పరిస్థితులపై త్వరలో కేంద్రప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఆ బృందం కన్వీనర్ మహారాజ్‌కుమార్, సభ్యులు ఉత్పల్‌కుమార్‌సింగ్ వెల్లడించారు. అన్ని ప్రాంతాల్లో కరవు పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు. రాష్ట్రప్రభుత్వం కరవు నివారణకోసం అడిగిన రూ.2431 కోట్లు ఏమూలకూ సరిపోవనికూడా వారు వ్యాఖ్యానించడం గమనార్హం. మూడు జిల్లాల్లో పర్యటించిన బృందాలు కరువుతీవ్రంగా ఉందని స్పష్టం చేశాయి.
రంగారెడ్డి జిల్లాలో...
కరవు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు జిల్లాలోని ఇబ్రహీంపట్నం, గండిపేట, చేవెళ్ళ, పరిగి, వికారాబాద్ ప్రాంతాల్లో కేంద్ర కరవు బృందం అధికారులు పర్యటించారు. డాక్టర్ పొన్ను స్వామితో పాటు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ప్రియదర్శినిసహా అధికారుల బృందం ముందుఇబ్రహీంపట్నం పెద్ద చెరువు పరిశీలించింది. అనంతరం రైతులతో వారు మాట్లాడారు. తీవ్ర వర్షాభావంతో పంటలు దెబ్బతిన్నందున ఖరీఫ్ ప్రత్యామ్నాయ ప్రణాళికను అమలు చేస్తున్నారా, త్రాగునీటి ఇబ్బందులు అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జంట నగరాలకు త్రాగునీరందించే గండిపేట జలాశయాన్ని పరిశీలించి చేవెళ్ళ మండలంలోని కేసారం, పరిగి మండలంలోని రంగాపూర్ గ్రామ శివారులో పంటలు పరిశీలించారు. గిరిజన మహిళా రైతులతో మాట్లాడారు. అప్పులు, వడ్డీలతో ఎలా ఇబ్బంది పడుతున్నదీ వారికి బాధితులు వివరించారు. చివరగా వికారాబాద్ శివారులోని శివసాగర్ చెరువును పరిశీలించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ జిల్లాలోని కరువు పరిస్థితులను కేంద్ర బృందానికి వివరించారు. ఈ ఖరీఫ్‌లో 1.20 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, భూగర్భ జలాలు అడుగంటి పోయాయని చెప్పారు. పంట నష్టపోయామని, ఎకరానికి 40వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని రైతులు కోరారు.
మెదక్ జిల్లాలో...
సంగారెడ్డి: జిల్లాలోని సర్దార్‌నగర్ తండా, బోర్గి, కంగ్టి, గూడూరు, మంజీర రిజర్వాయర్ ప్రాంతాలను కరవుబృందం కన్వీనర్ మహారాజ్‌కుమార్, సభ్యులు ఓందత్ శర్మ, ఓం కిషోర్‌లు పరిశీలించారు. జిల్లాలో కరవు పరిస్థితులను కలెక్టర్ రొనాల్డ్‌రాస్ వారికి వివరించారు. కాగా రైతులు తమ కష్టాలను, కరవు పరిస్థితులను వారికి స్వయంగా చెప్పారు. వర్షాభావ పరిస్థితులతో ఎండిన పంటలను చూశామని, మున్ముందు నీటిఎద్దడి ఎదురౌతుందని వారు అభిప్రాయపడ్డారు. ఇప్పటినుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. కరవు నివారణకు రాష్ట్రప్రభుత్వం అడిగిన మొత్తం రెండుజిల్లాలకూ సరిపోదని, అందువల్ల వాస్తవ పరిస్థితులను వివరించి, తెలంగాణలోని కరవు జిల్లాలకు సరిపడా నిధులు మంజూరు చేయాలని సిఫార్సు చేస్తామని కరవుబృందం ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌తో సమీక్ష అనంతరం నివేదికను కేంద్రానికి అందజేస్తామన్నారు.
కరీంనగర్ జిల్లాలో..
కరీంనగర్: కరవుముంచుకొచ్చిందని, పూర్తిగా నష్టపోయామని పలువురు రైతులు కరవు బృందానికి విన్నవించారు. బ్రిజేష్ శ్రీవాత్సవ నేతృత్వంలో, సభ్యులు శ్రీనివాస్, వెంకటేశ్వర్లతో కూడిన బృందం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించింది. భీమదేవరపల్లి మండలం, చాపగాని తండాలో పత్తిపంటను పరిశీలించి బాధిత రైతులు గగులోతు రాజు, ఇ.సమ్మయ్యలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కట్కూర్‌లో ఎండిన చెరువును పరిశీలించారు. హుస్నాబాద్ మండలంలోని కుందనవానిపల్లె, గండిపల్లి, బెజ్జంకి మండలం గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్, వడ్లూర్ బేగంపేట ప్రాంతాల్లో పంటలను, బోర్లను పరిశీలించారు. సిరిసిల్లలో కరవుపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను బృందం పరిశీలించింది. వర్షాభావంతోను, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతోనూ పూర్తిగా పంటలు ఎండిపోయాయని, అప్పుల ఊబిలో కూరుకుపోయామని, తమను ఆదుకోవాలని రైతులు వారిని కోరారు. కాగా జిల్లాలో కరవు భయానకంగా ఉందని బ్రిజేష్ శ్రీవాత్సవ అభిప్రాయపడ్డారు. మూడు జిల్లాల్లో కరవు బృందాన్ని ఆయా ప్రాంతాల రాజకీయ పార్టీల నేతలు కలసి పరిస్థితులను వివరించి రైతులను ఆదుకోవాలని కోరారు.

కరీంనగర్ జిల్లాలో పంటలను పరిశీలిస్తున్న కేంద్ర కరవు బృందం సభ్యులు.. సంగారెడ్డి కలెక్టరేట్‌లో విలేఖరులతో మాట్లాడుతున్న కరవు బృందం కన్వీనర్ మహారాజ్‌కుమార్