రాష్ట్రీయం

నివ్వెరపోయన కరవు బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, డిసెంబర్ 9: వరుస కరవు కాటకాలతో తల్లడిల్లుతున్న అనంతపురం జిల్లా పరిస్థితులను స్వయంగా పరిశీలించిన కేంద్ర కరవు బృందం నివ్వెరపోయింది. బుధవారం బెంగళూరు నుండి రోడ్డు మార్గాన అనంతపురం జిల్లా హిందూపురం చేరుకున్న కరవు బృందానికి ఆదిలోనే పరిస్థితులు కొట్టొచ్చినట్లు కనిపించాయి. కరవు బృందం లీడర్ షకీల్ అహ్మద్ ఆధ్వర్యంలో నరేంద్రకుమార్, సలీంహైదర్, కృష్ణారావు హిందూపురం పట్టణంలోని శ్రీకంఠాపురం చేరుకోగానే మహిళలు ఖాళీ బిందెలను చేతబట్టుకుని తాము గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నామని కరవుబృందంను చుట్టుముట్టారు. బోర్లలో నీరు అడుగంటి పోయాయని, మున్సిపాలిటీ ట్యాంకర్ల ద్వారా మూడు, నాలుగు రోజులకు ఒకసారి నీరు అందిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు వాపోయారు.
అదే విధంగా రైతు సంఘం, ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జిల్లా కరవు పరిస్థితులను అధ్యయన బృందానికి ఏకరవు పెట్టారు. విమానాల్లో వచ్చి ఏసి కార్లలో తిరుగుతూ తూతూమంత్రంగా కరవు పరిస్థితులు చూడటం కాదని, కనీసం 15 రోజులైనా జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రజల గోడు అవగతమవుతుందని నేతలు నిలదీశారు. రైతు సంఘం ప్రతినిధి ధనాపురం వెంకట్రామిరెడ్డి, ఓపిడిఆర్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు తదితరులు కరవు పరిస్థితులపై వినతిపత్రం అందచేశారు. ఇలా వచ్చి అలా వెళ్ళడం కాదని ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఉక్కిరిబిక్కిరైన కరవుబృందం వెంటనే వాహనాలు ఎక్కి ముందుగా నిర్ణయించిన ప్రాంతాలకు కూడా వెళ్ళకుండా నేరుగా పెనుకొండకు వెళ్ళిపోయారు. హిందూపురం పట్టణంలోని డిఆర్ కాలనీ, మోడల్ కాలనీ, రహమత్‌పురంలో పర్యటించాల్సిన ఆ బృందం పెనుకొండకు వెళుతూ ముందుగా నిర్ణయించిన సోమందేపల్లిలో కూడా ఆగకుండా పెనుకొండకు వెళ్ళిపోయింది. పెనుకొండ మండలంలోని తిమ్మాపురంలో పంటలను పరిశీలించగా రైతులు తమ కష్టనష్టాలను కన్నీటితో విన్నవించారు. గత ఆరేళ్లుగా వర్షాభావ పరిస్థితుల వల్ల పంట చేతికందక అప్పుల పాలై పొట్టకూటి కోసం బెంగళూరు వంటి నగరాలకు భార్యాపిల్లలతో వలసవెళ్ళి దుర్భర జీవనం సాగిస్తున్నామంటూ రైతులు జగన్నాథ్‌రెడ్డి, శివశంకర్, రఘునాథ్ విన్నవించారు. మహిళారైతు నాగలక్ష్మి మాట్లాడుతూ మూడెకరాల పొలం ఉన్నా అప్పులపాలయ్యామని కన్నీటి పర్యంతమైంది. వలసలు ఆపి రైతు కుటుంబాలను ఆదుకోవాలని, వ్యవసాయానికీ పరిశ్రమలకు ఇచ్చే తరహాలో సబ్సిడీలు, రుణాలు ఇవ్వాలని విన్నవించారు.

చిత్రం... హిందూపురంలో కేంద్ర కరవు బృందం ఎదుట ఖాళీ బిందెలతో మహిళల నిరసన