రాష్ట్రీయం

శేషాచల అడవుల్లో టాస్క్ఫోర్స్ కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పీలేరు, ఏప్రిల్ 30: శేషాచల కొండల్లో మరోసారి ఎర్రచందనం కూలీలకు, టాస్క్ఫోర్సు సిబ్బందికి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కూలీల రాళ్ళదాడిలో ఓ కానిస్టేబుల్ గాయపడగా, కిందపడ్డ కూలీ సైతం గాయపడ్డారు. తిరుమల శేషాచల కొండల్లోని బోనుగుట్ట వద్ద శనివారం కూంబింగ్ చేస్తున్న టాస్క్ఫోర్సు సిబ్బందికి దాదాపు 30మంది కూలీలు తారసపడ్డారు. వీరిని గమనించిన టాస్క్ఫోర్సు సిబ్బంది వారివెంట పడగా ఓ చిన్నస్వామి వెంకటేష్ అనే కూలీ కిందపడటంతో ఆతని తలకు గాయమైంది. అతనిని అదుపులోకి తీసుకునే సమయంలో హఠాత్తుగా కూలీలు పోలీసులపై రాళ్ళదాడి చేయడంతో శ్రీకాంత్ అనే కానిస్టేబుల్ తలకు, చేతులకు గాయాలయ్యాయి. వెంటనే తేరుకున్న టాస్క్‌పోర్సు సిబ్బంది ఒక రౌండ్ గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో కూలీల అక్కడ నుంచి అడవిలోకి పారిపోయారు. ఈసందర్భంగా ఆప్రాంతంలోని 1234కేజీల బరువున్న 36 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 40లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా గాయపడ్డ కానిస్టేబుల్‌ను, ఎర్రచందనం కూలీని చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని టాస్క్ఫోర్సు డి ఐ జి కాంతారావు, డి ఎస్పీలు శ్రీ్ధర్,హరినాథ్‌లు పరిశీలించారు. పీలేరు రూలర్ సి ఐ మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా శేషాచల కొండల్లోని వివిధ ప్రాంతాల్లోని ఎర్ర చందనం వృక్షాలను నరికి వాటిని భద్రపరచివుండగా తిరుపతి అటవీశాఖ అధికారులు శనివారం వాటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దాదాపు కోటి 20లక్షల రూపాయలు విలువచేసే 100 దుంగలను స్వాధీనం చేసుకోవడంతోపాటు తమిళనాడు జువ్వాజికి చెందిన రమేష్ అనే కూలీని కూడా అదుపులోకి తీసుకున్నారు.
రూ. 3 కోట్ల ఎర్రచందనం పట్టివేత
రైల్వేకోడూరు: కడప జిల్లా రైల్వేకోడూరు మండలంలోని కుక్కలదొడ్డి సమీపంలో తుంబుర క్షేత్రానికి వెళ్లే అటవీ మార్గంలో శనివారం సుమారు రూ. 3 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసులు, అటవీ అధికారులు మూకుమ్మడిగా దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన స్మగ్లర్‌ను అరెస్టు చేయగా, మరో 20 మంది శేషాచలం అడవులలోకి పారిపోయారు. వారి కోసం కుక్కలదొడ్డి, బాలుపల్లె అటవీ ప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్ని చర్యలు చేపట్టినా ఎదో ఒక విధంగా స్మగ్లర్లు, ఎర్ర కూలీలు రావడం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్మార్ట్ పనులు స్పీడ్ అందుకోవాలి

కేంద్ర పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి రాజీవ్ గౌబా

విశాఖపట్నం, ఏప్రిల్ 30: స్మార్ట్‌సిటీలో ప్రజల జీవన స్థితిగతులు మరింత మెరుగుపడేలా వేగవంతమైన సేవలందించాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ గౌబా అన్నారు. స్మార్మ్‌సిటీల తొలిజాబితాలో ఉన్న విశాఖ, కాకినాడ నగరాల అభివృద్ధి ప్రణాళిక అమలుపై శనివారం ఆయన విశాఖపట్నంలో అధికారులతో సమీక్షించారు. స్మార్ట్‌సిటీగా విశాఖ ఎంపికయినందున అభివృద్ధి కార్యక్రమాలు వేగిరం చేయాలన్నారు. రానున్న 20 ఏళ్ళల్లో విశాఖకు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆర్ధిక ఆభివృద్ధి, ఇతరత్రా అంశాల్లో అంతర్జాతీయ నగరంగా మారుతుందన్నారు. అధికారులు అంకితభావంతో పనిచేసి స్వచ్ఛసిటీ, స్మార్ట్‌సిటీగా తయారు చేయాలన్నారు. రాష్ట్ర మునిసిపల్, పట్టణ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి కరికల్‌వల్వన్ మాట్లాడుతూ దేశంలోనే వంద శాతం ఎల్‌ఇడి దీపాలు వినియోగించిన ఏకైక నగరం విశాఖ అన్నారు. స్వచ్ఛసిటీగా 75 నగరాల్లో ఐదవ స్థానం పొందడం గర్వకారణమన్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికి స్మార్ట్‌సిటీ అభివృద్ధి ప్రతిపాదనలు పూర్తిచేసి జనవరి నుంచి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే బహిరంగ మలవిసర్జన రహిత నగరంగా విశాఖను తయారు చేయాలని, ఇందుకు మహిళా సంఘాలు, స్వచ్చందసంస్థలు, విశాఖ అంబాసిడర్లు మరింత కృషి చేయాలన్నారు. అక్టోబర్ 2 నాటికి ఓడిఎఫ్(ఓపెన్ డిఫినేషన్) సిటీగా విశాఖ రూపాంతరం చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండి మురళీధర్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వ స్మార్ట్‌సిటీల అదనపు కార్యదర్శి సమీర్‌శర్మ, సంయుక్త కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్, అర్బన్ డెవలెప్‌మెంట్ ఉప కార్యదర్శి ఎన్.సజేశ్‌కుమార్, జివిఎంసి కమీషనర్ ప్రవీణ్‌కుమార్,కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ వుడా వీసి బాబూరావునాయుడు, నగర పోలీసు కమీషనర్ అమిత్‌గార్గ్‌లు పాల్గొన్నారు.

రాజధానిలో ఘరానా మోసగాడు

హోంమంత్రి అల్లుడినంటూ దందా ఎంపి స్టిక్కర్లతో నకిలీ వాహనాలు

తాడికొండ, ఏప్రిల్ 30: రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తాను హోంమంత్రి అల్లుడినంటూ అటు అధికారులు, ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ యజమానులను బెదిరించి లక్షలు వసూలు చేస్తున్న ఓ ఘరానా మోసగాడ్ని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. తాను తిరిగే వాహనాలపై మెంబర్ ఆఫ్ పార్లమెంటు స్టిక్కర్లు ముద్రించి అధికారులను వంచించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. హోంమంత్రి బంధువునంటూ సిఆర్‌డిఎ అధికారులను సైతం బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి... గుంటూరు నగరం అరండల్‌పేటకు చెందిన బోరుగడ్డ అనిల్‌కుమార్ గత కొంతకాలంగా హోంమంత్రి అల్లుడి అవతారమెత్తి ప్రభుత్వ కార్యాలయాల్లో హల్‌చల్ చేస్తున్నాడు. అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి భూ దందాలతో ఇప్పటికే కోట్ల రూపాయలు కాజేసినట్లు సమాచారం. అనిల్‌కుమార్ దౌర్జన్యాలపై పోలీసులకు ఫిర్యాదులు అందడంతో హోంమంత్రి పేషి నుంచి సమాచారం సేకరించిన అనంతరం గాలింపు చేపట్టారు. ప్రకాశం జిల్లాకు చెందిన సురేష్‌బాబు అమరావతి మండలం ఉంగుటూరు గ్రామంలో 10.92 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన విషయాన్ని అనిల్‌కుమార్ తన అనుచరుడు గజవెల్లి అప్పారావు ద్వారా తెలుసుకున్నాడు. ఈనెల 24వ తేదీన సురేష్‌బాబుకు ఫోన్‌చేసి, తాడికొండ అడ్డరోడ్డు వద్దకు పిలిపించి వేటకొడవళ్లతో బెదిరించాడు. కోటి రూపాయలు తనకు ఇవ్వాలంటూ లేకుంటే అంతుచూస్తానంటూ బెదిరించాడు. బాధితుడి వద్దనుండి ముందుగా 35 వేల రూపాయల నగదును తీసుకుని మిగిలిన సొమ్ము తీసుకురావాల్సిందిగా హెచ్చరించాడు. గత్యంతరం లేక బాధితుడు సురేష్‌బాబు పోలీసులను ఆశ్రయించాడు. అనిల్‌కుమార్ ఫోన్‌కాల్ సమాచారం ఆధారంగా దర్యాప్తుచేపట్టిన తాడికొండ పోలీసులు రెండు రోజులు నిఘాపెట్టి శనివారం ఎట్టకేలకు గుంటూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అనిల్ గతంలో కూడా అనేక నేర కార్యకలాపాలకు పాల్పడినట్లు మంగళగిరి డిఎస్‌పి గోగినేని రామాంజనేయులు విలేఖర్లకు వివరించారు. నిందితుడిపై ఛీటింగ్ కేసుతో పాటు పలు క్రిమినల్ కేసులు నమోదుచేశారు. అనిల్‌కుమార్ వద్ద నుండి నకిలీ ఎంపి స్టిక్కర్లతో ఉన్న రెండు కార్లు, వేటకొడవళ్లు, ల్యాప్‌ట్యాప్‌లు, మొబైల్స్‌తో పాటు 29 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు.

నిందితుడు అనిల్‌కుమార్‌ను చూపిస్తున్న పోలీసులు