రాష్ట్రీయం

రామన్న పోయ.. చంద్రన్న వచ్చె!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: తెలుగునాట కూడా తమిళ సంస్కృతి మొదలయంది. ప్రభుత్వ పథకాలకు వ్యక్తుల పేర్లు పెట్టే సంప్రదాయం మొదలయంది. ‘అన్న’ పేరుతో జనహృదయాల్లో స్థిరపడాలన్న కోరిక కూడా నేతల్లో పెరిగింది. ఆ ఒరవడిలో అధినేతలు ‘అన్న’లవుతున్నారు.
తమిళనాడులో పురచ్చితలైవి జయలలితను ఆమె అభిమానులు అమ్మగా ఆరాధిస్తుంటారు. చివరకు ఆమెకు బతికి ఉండగానే విగ్రహాలు కట్టిస్తున్నారు. జయలలిత కూడా తన భ క్తులకు పథకాల పేరిట వరాలు ప్రసాదిస్తున్నారు. తాను సర్వవేళలా గుర్తుకు వచ్చేలా, ఆ పథకాల ముందు ‘అమ్మ’ పేరు చేరుస్తూ వస్తున్నారు. అలా అమ్మ క్యాంటిన్లు, అమ్మ గ్రైండర్లు, అమ్మ టివిలు, అమ్మ సైకిళ్లు అనే పేర్లు పెడుతున్నారు.
మాయావతి సీఎంగా ఉన్న సమయంలో ఉత్తరప్రదేశ్‌లో కూడా విపరీత పోకడ కనిపించింది. ప్రభుత్వ పార్కులలో మాయావతి విగ్రహాలు ఏర్పాటు చేశారు. అది కాస్తా వివాదం పాలయంది. అందులో వందల కోట్ల కుంభకోణం జరిగిందని విపక్షాలు ఆరోపణలు గుప్పించాయ. తర్వాత దానిపై విచారణ కూడా జరిగింది.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాగే వ్యక్తుల పేరుతో సొంత ప్రచారం మొదలయంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పేరుతో వరుసగా పథకాలు పుట్టుకొస్తున్నాయ. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా ఇస్తున్న వరాలకు చంద్రబాబు పేరు పెట్టే సంప్రదాయం మొదలయంది. చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న క్రిస్మస్ కానుక, చంద్రన్న సంచార ఆరోగ్య వాహనం, చంద్రన్నబాట, చంద్రన్న ఉద్యోగ మేళా, చంద్రన్న రుణమేళా, చంద్రన్న దళితబాట, చంద్రన్న గిరిజన బాట, చంద్రన్న వ్యవసాయ క్షేత్రం వంటి పథకాలు ఏపిలో విస్తృత ప్రచారంలో ఉన్నాయ.
ఇవన్నీ చంద్రబాబును జనక్షేత్రంలో ‘అన్న’గా మార్చే ప్రయత్నాలని స్పష్టమవుతోంది. ఇప్పటివరకూ సీనియర్లు, బాబు సమకాలికులు మాత్రమే ఆయనను ‘బాబన్న’గా పిలుస్తుంటారు. చంద్రబాబు మాత్రం ఒక్క మోహన్‌బాబును మాత్రమే అన్న అని పిలుస్తుంటారు. కానీ తెలుగునాట మెజారిటీ శాతం అన్నగా ఆరాధించి, పిలుచుకునేది మాత్రం ఒక్క ఎన్టీరామారావును మాత్రమే. ఆ తర్వాత వైఎస్ రాజన్నగా కొంతవరకూ ప్రచారం కాగలిగారు. చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గానే పిలిపించుకునేందుకు ఇష్టపడేవారు. హైటెక్ సీఎంగా ఆయన మీద ఇప్పటికీ ముద్ర ఉంది. అయతే, మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అన్న ఎన్టీఆర్ మాదిరిగా బాబు అందరిగుండెల్లో నిలిచిపోయేలా చేయాలన్న ఆలోచన టిడిపి మేధోబృందానికి వచ్చింది. సీఈఓ, హైటెక్ సీఎం వంటి ప్రచారంతో సామాన్య జనాలకు దూరమైన గత అనుభవమే దానికి కారణం కావచ్చని విశే్లషకుల అభిప్రాయం.
అందుకే హైటెక్ ముద్ర స్థానంలో ‘అన్న’ అనే ఆత్మీయముద్ర కోసం బాబు వ్యూహబృందం పరితపిస్తోంది. ఆయనను కూడా ఎన్టీఆర్ మాదిరిగా ‘అన్న’ను చేస్తే తప్ప, ఆ స్థాయ అనుభూతి రాదని మేధోబృందం నిర్ణయంచింది. బాబు తొమ్మిదేళ్ల పాలనలో కూడా ఎప్పుడూ ఆయన పేరుతో పథకాలు ప్రవేశపెట్టిన దాఖలాలు లేవని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.
ఆ ప్రకారంగా ఇప్పుడు చంద్రబాబును కూడా చంద్రన్నగా మార్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు సర్కారు పథకాలకు పెడుతున్న పేర్లు చూస్తే స్పష్టమవుతోంది. టిడిపి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ‘చంద్రన్న విజయాల’ పేరుతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. దానితో అన్న ఎన్టీఆర్ మాదిరిగానే చంద్రబాబు కూడా ‘చంద్రన్న’గా జనం మదిలో స్థిరపడిపోవాలన్నది టిడిపి మేధోబృందం అసలు లక్ష్యంగా కనిపిస్తోంది.
కాగా, టిడిపి వ్యవస్థాపకుడయన దివంగత ఎన్టీరామారావు పేరుతో, చంద్రబాబు ప్రభుత్వం ‘అన్న క్యాంటిన్’ పథకం ప్రకటించింది. కేవలం 5 రూపాయలకే భోజనం అందించే ఈ పథకంపై భారీ ప్రచారమే చేశారు. దానికి సంబంధించి తమిళనాడులో అమలవుతున్న విధానాన్ని పరిశీలించి, అధ్యయనం చేసేందుకు మంత్రి పరిటాల సునీత, పి.నారాయణ తమిళనాడు వెళ్లారు. కానీ ఇప్పటివరకూ ఆ పథకం మొదలుకాలేదు. గతంలో వైఎస్ ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరును మార్చి ఎన్టీఆర్ హెల్త్ ట్రస్టును చేశారు.
గతంలో అన్ని పథకాలకూ ఎన్టీఆర్ పేరు తప్పనిసరిగా పెట్టేవారు. ఇప్పుడు ఆ విధానం మారి, అన్నగారి స్థానం వర్థంతి-జయంతి నాడు నివాళులకు, సభల్లో ఆయన స్మరణకు మాత్రమే పరిమితమయంది. ఆ రకంగా తెలుగుదేశంలో ‘అన్న’ స్మరణ పూర్తిగా తగ్గించి, చంద్రన్నను అసలు అన్నను చేసే ప్రయత్నం విజయవంతమయనట్టుగానే కనిపిస్తోంది.