తెలంగాణ

రూ.50 లక్షల దారిదోపిడీ కేసులో డ్రైవరే సూత్రధారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, డిసెంబర్ 9: పత్తి వ్యాపారి తీసుకువస్తున్న నగదును దోపిడీ చేసిన కేసులో వ్యాపారి వాహనం డ్రైవర్ సూత్రధారికాగా అతని స్నేహితులు పాత్రధారులుగా వ్యవహరించారు. సంచలనం సృష్టించిన లూటీ కేసు మిస్టరీని మెదక్ జిల్లా పోలీసులు 24 గంటలు పూర్తికాకముందే ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేయగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ సుమతి వివరాలు వెల్లడించారు. మహారాష్టల్రోని కామ్‌ఖేడ్ గ్రామానికి చెందిన షేక్ ఇసాక్ సదాశివపేట ప్రాంతంలోని రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసి గుజరాత్‌లోని కడి అనే ప్రాంతంలోని మిల్లులకు తరలిస్తుంటాడు. పత్తి విక్రయానికి చెందిన డబ్బులను మిల్లు యజమాని ఏజెంటు ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీన ఇసాక్ స్నేహితులైన షేక్ నిసార్, షేక్ గఫార్‌లతో కలిసి స్కోడా కారులో డ్రైవర్ అస్వాక్‌తో కలిసి వెళ్లారు. అస్వాక్ దీపావళి పండుగ అనంతరం ఇసాక్ వద్ద డ్రైవర్‌గా విధుల్లో చేరాడు. రోజు విడచి రోజు హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకువస్తుండటంతో అస్వాక్‌లో దుర్బుద్ధి ప్రబలింది. ఈ నేపథ్యంలోనే తన స్నేహితులైన ఇమ్రాన్, జావెద్, ముస్తాప, అతిక్, రహమాన్‌లతో అస్వాక్ పథకాన్ని రూపొందించుకున్నారు. రహమాన్ అనే నిందితుడు డబ్బులు దొంగిలించే ప్రణాళికను రూపొందించారు. 7వ తేదీ సాయంత్రం రూ.50 లక్షల రూపాయల డబ్బులతో ఇసాక్ తిరుగు ప్రయాణం అవుతున్న సమాచారంతో పాటు స్కోడా కారు నంబరును తన స్నేహితులకు ఇవ్వడంతో పాటు ఏ ప్రాంతానికి చేరుకున్నామన్న విషయాలను ఎప్పటికప్పుడు డ్రైవర్ అస్వాక్ ముఠా సభ్యులకు అందజేసారు. నిందితులు నంబరు లేని ఫోర్డ్ ఐకాన్ కారును సమకూర్చుకుని కౌవలంపేట వద్ద మాటు వేసారు. స్కోడా కారు నంబరును గుర్తించి తమ వాహనాన్ని ముందుకు తీసుకువెళ్లి నిలిపారు. పథకంలో సూత్రదారి అయిన అస్వాక్ కూడా స్కోడా కారును నిలిపిన వెంటనే నిందితులు కళ్లలో కారం చల్లి రూ.50 లక్షలు గల బ్యాగును తీసుకుని ఉడాయించారు. దీంతో బాధితుడు ఇసాక్ సంగారెడ్డి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. జాతీయ రహదారిపై ఇలాంటి దోపిడీ జరగడానికి ఎంత మాత్రం అవకాశం లేదని, జాతీయ రహదారిపై ఉన్న సిసి ఫుటేజీలను పరిశీలించారు. సిసి కెమెరాల్లో నంబరు లేని ఫోర్డ్ ఐకాన్ కారు స్కోడా కారును వెంబడించినట్లు వెల్లడికాలేదు. దీంతో డ్రైవర్‌పై అనుమానం రావడంతో పోలీసులు ప్రశ్నించడంతో అసలు గుట్టు బట్టబయలైంది. ఇదిలావుండగా బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్-అకోలా జాతీయ రహదారిపై ఎంఎన్‌ఆర్ చౌరస్తా వద్ద వాహనాలను పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా నంబరు లేని కారులో ముగ్గురు వ్యక్తులు నిలుపకుండా పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని ఛేజ్ చేసి పట్టుకుని విచారించగా వారి పేర్లు ఇమ్రాన్, జావెద్, ముస్తాపలుగా గుర్తించారు. అతిక్, రహమాన్ అనే మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దొంగిలించిన రూ.50 లక్షల నుంచి రహమాన్, అస్వాక్‌లు రూ.20 లక్షలు వాటాగా తీసుకోగా మిగిలిన సొత్తును ఇమ్రాన్, జావెద్, ముస్తాప, అతిక్‌లు పంచుకున్నారు. నిందితుల నుంచి రెండు వాహనాలను, చోరీకి గురైన మొత్తం రూ.50 లక్షలను స్వాధీనపర్చుకున్న పోలీసులు నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ సుమతి వివరించారు. జాతీయ రహదారులపై సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటి నేరాలు మిస్టరీలుగా మారకుండా నిందితులను త్వరగా పట్టుకునే అవకాశం లభిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. విలేఖరుల సమావేశంలో ఎఎస్పీ వెంకన్న, డిఎస్పీ సురేందర్‌రెడ్డి సిఐలు శ్రీనివాస్‌నాయుడు, ఆంజనేయులు, కృష్ణయ్య, సంగారెడ్డి రూరల్-1 ఎస్‌ఐ శివలింగం పాల్గొన్నారు.

దోపిడీ దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న రూ.50 లక్షలు
దొంగల అరెస్టును ధ్రువీకరిస్తున్న ఎస్పీ సుమతి