రాష్ట్రీయం

వాన ముంచెత్తింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 10: పాలమూరు పట్టణాన్ని జడివాన ముంచేసింది. మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం పట్టణాన్ని అతలాకుతలం చేసింది. ఉరుములు, మెరుపులు, వడగళ్లతో ఏకధాటిగా ఐదు గంటలపాటు 12సె.మీ వర్షం కురిసింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పలు కాలనీలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రహదారులను వరద నీరు ముంచెత్తింది. పెద్ద చెరువులో వరద పోటెత్తింది. పలు వంతెనల వద్ద ఐదారు అడుగుల ఎత్తులో నీళ్లు ప్రవహించాయి. 38 ఏళ్ల తరువాత వరద బీభత్సం మళ్లీ ఇప్పుడే చూస్తున్నామని, అలుగు పారిందని వృద్ధులు చెప్పుకొచ్చారు. అయితే పారుతున్న అలుగు నీరంతా రామయ్యబౌలి కాలనీకి వచ్చిచేరింది. అలుగుకు సంబంధించిన కాల్వలన్నీ కూరుకుపోయాయి. ప్రస్తుతం పాలమూరు పెద్దచెరువు పొంగి పొర్లడంతో రామయ్యబౌలి జల దిగ్భంధంలో చిక్కుకుంది. ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల పైకప్పులు, ఇంటిలోపల సజ్జలపై తలదాచుకున్నారు. పెద్ద చెరువుకు వచ్చే కాల్వలన్నీ పొంగిపొర్లడంతో కాలువకు సమీపంలోని వేపురుగేరి, పాతతోట, న్యూటౌన్, రాజేంద్రనగర్, మార్కెట్ యార్డు, పాతబస్టాండ్, కొత్తబస్టాండ్, బయ్యమ్మతోట కాలనీలోకి వరద నీరు చేరింది. ఎర్రకుంట చెరువుకూ వరద పోటు తగలడంతో కుంటకు సంబంధించిన పాటు కాల్వకు గండిపడింది. దీంతో బ్రహ్మణవాడి, కురువశెట్టి కాలనీ, పాత పాలమూరు, బండ్లగేరి, వీరన్నపేట ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఏ వీధి చూసినా మోకాలి లోతు వరద నీటితో కనిపిస్తున్నాయి. వర్షం సమయంలో భారీగా గాలులు వీయడంతో రహదారులపై పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ తీగలపై చెట్లు కూలడంతో మహబూబ్‌నగర్ పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజామున 4 గంటలకు నిలిచిపోయిన విద్యుత్ సాయంత్రం వరకూ సరఫరా కాలేదు. రోడ్లపై పడిన చెట్లు తొలగించేందుకు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ రంగంలోకి దిగి మున్సిపల్ అధికారులతో కలసి చెట్లను తొలగించారు. అదేవిధంగా రోడ్లపై నిలిచిన నీటిని మళ్లించే ప్రక్రియ చేపట్టారు. వర్షం నీరు వచ్చి చేరిన కాలనీలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. హైదరాబాద్ -మహబూబ్‌నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై డ్రైనేజీలు పొంగి పొర్లడంతో గిండ్రిగడ్డ, వన్‌టౌన్ చౌరస్తా, రాంమందిర్ చౌరస్తా, కలెక్టరేట్ చౌరస్తా, న్యూటౌన్, శ్రీనివాసకాలనీ, పద్మావతి కాలనీలలో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. కలెక్టరేట్ కార్యాలయ ఆవరణ వర్షపు నీటితో నిండిపోయింది. వరద తాకిడికి కలెక్టరేట్ ప్రహారీ కుప్పకూలింది. జిల్లాలో కొయిలకొండ మండలంలో 6 సెం.మీ, నవాబ్‌పేటలో 2, షాద్‌నగర్‌లో 4, బూత్పూర్, ధన్వాడ, నారాయణపేట మండలాల్లో మూడు సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.

చిత్రం కాల్వను తలపిస్తున్న పాలమూరు రహదారి