రాష్ట్రీయం

ప్రాజెక్టులపై కాంగ్రెస్ దొంగ దీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: ఆర్‌డిఎస్ వద్ద కాంగ్రెస్ దీక్ష దొంగ దీక్ష అని, స్వార్థ రాజకీయాల కోసమే దీక్ష చేస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఉదయం జరిగిన విలేఖరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని తలకాయలు, ఎన్ని నాలుకలు ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక మాట, రఘువీరారెడ్డి ఒక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికో సిద్ధాంతం, జిల్లాకో సిద్ధాంతంగా వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే ఆర్‌డిఎస్‌ను అడ్డుకోవద్దని ఎఐసిసితో ఏపీ నేతలకు ఆదేశాలు జారీ చేయించాలని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని హరీశ్‌రావు సవాల్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి నోరుమూయించాలని అన్నారు. అలాగే టిటిడిపి నేతలకు చీము నెత్తురు ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్‌రావులను ఒప్పించి ఆర్‌డిఎస్‌ను అడ్డుకోకుండా చూడాలని సవాల్ చేశారు. వరంగల్, నారాయణఖేడ్, హైదరాబాద్, ఖమ్మం అన్ని చోట్ల ఇప్పటికే ప్రజలు ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పారని అన్నారు. ఇప్పుడు ఖమ్మం జిల్లా పాలేరు నియోజక వర్గంలోనూ ఈ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ఆర్డీఎస్ ఆధునీకరణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు, జగన్ ఏకమయ్యారని, ఇద్దరూ కుమ్మక్కు అయి తెలంగాణపై వ్యతిరేకత చూపుతున్నారని విమర్శించారు. త్వరలోనే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంకు శంకుస్థాపన చేయనున్నట్టు హరీశ్‌రావు తెలిపారు.
పాలమూరు జిల్లాకు టిడిపి, కాంగ్రెస్ రెండూ తీరని ద్రోహం చేశాయని విమర్శించారు. పాలమూరును దత్తత తీసుకున్నాను అని ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రచారం చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంటే టిటిడిపి నాయకులు ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. పదేళ్లపాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కర్నాటకతో ఆర్‌డిఎస్‌తో పాటు ఇతర ప్రాజెక్టుల సమస్యలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఆర్‌డిఎస్‌లో న్యాయమైన వాటా కోసం టిఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని చెప్పారు. కాంగ్రెస్, టిడిపిలు ఎన్ని అడ్డంకులు కల్పించినా కోటి ఎకరాలకు సాగునీటిని అందించి తీరుతామని హరీశ్‌రావు తెలిపారు.