రాష్ట్రీయం

తెలకపల్లి విశ్వనాథ శర్మ అస్తమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు శిరోమణి తెలకపల్లి విశ్వనాథ శర్మ (83) మంగళవారం అస్తమించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1963లో సంస్కృత విభాగంలో, ఎం.ఏ గోల్డ్‌మెడల్ పొందిన తొలి వ్యక్తిగా వినుతికెక్కిన విశ్వనాథ శర్మ, హైదరాబాద్ లోని ఆంధ్ర ప్రాచ్య కళాశాలలో సంస్కృత ఉపన్యాసకుడిగా పనిచేశారు. తర్వాత 1965లో మహబూబ్‌నగర్ జిల్లా పాలెం ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమితులయి, 1993లో పదవీ విరమణ చేశారు. ప్రాకృతం, తెలుగు, సంస్కృతం, గ్రీకు సహా ఇతర విదేశీ భాషలపై పట్టు ఉన్న విశ్వనాధ శర్మ సంస్కృతాంధ్ర కవితలు అముద్రితంగానే ఉన్నాయి. దూరదర్శన్‌లో కొనే్నళ్లపాటు విశ్వనాధ శర్మ భాషణలతోపాటు శివపురాణ కార్యక్రమం నిర్వహించారు. అవి బాగా ప్రాచుర్యం పొందాయి.
సంస్కృత గ్రంధాలను తెలుగులోకి అనువదించడంలో ఘనాపాఠీగా పేరున్న ఆయన రాసిన పరాశర మాధవీయం, కాళిదాస జ్యోతిష గ్రంధం బహుళ ప్రాచుర్యం పొందాయి. మైసూరులోని దత్తపీఠాథిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో విశ్వనాథశర్మ దాదాపు ఐదు సంవత్సరాలు సంస్కృతం బోధించారు. అనేక గ్రంథ, శాస్త్రాలను సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించాలన్న ఆయన తృష్ణను మాజీ డిజిపి అరవిందరావు నెరవేర్చారు. అరవిందరావు చేయూతతో అనేక సంస్కృత గ్రంథాలను, విశ్వనాథశర్మ తెలుగులోకి అనువదించారు. కాశీ కృష్ణాచార్యులు, జమ్మలమడక, ఖండవల్లి, దివాకర్ల, రాఘవాచారి వంటి పండితులు విశ్వనాథశర్మ ప్రతిభా పాండిత్యాన్ని ప్రశంసించారు. తెలుగు సాహితీలోకానికి మరపురాని గ్రంధాలు అందించిన విశ్వనాథ శర్మ అస్తమయం, సంస్కృతాంధ్ర సాహిత్యానికి తీరని లోటని ఆయన శిష్యులయిన కసిరెడ్డి వెంకటరెడ్డి, గిరిజామనోహర్ బాబు, వెల్దండ నిత్యానందరావు, జి.యాదగిరి, మాజీ డిజిపి కె.అరవిందరావు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
విశ్వనాధ శర్మ అంత్యక్రియలు, బుధవారం నగరంలోని కొత్తపేట అలకాపురి రోడ్‌నెంబర్ 14లో జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.