ఆంధ్రప్రదేశ్‌

ఖాళీలు బోలెడు.. భర్తీ మూరెడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: రాష్ట్రం విడిపోతే సాగరతీర సంపదవల్ల ప్రాజెక్టులు కుప్పలు తెప్పలుగా వచ్చిపడి ఉద్యోగాలొస్తాయన్న భ్రమలు క్రమంగా కరిగిపోతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ కలగానే మిగిలింది. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి హామీలను ప్రభుత్వం జమ్మిచెట్టు ఎక్కించింది. కొత్తగా ఉద్యోగాలివ్వకపోగా, ఉన్న కాంట్రాక్టు ఉద్యోగాలను ఊడబెరికింది. ఫలితంగా ఉద్యోగాలకోసం కళ్లలో వత్తులు వేసుకుని చూస్తున్న నిరుద్యోగులకు అశనిపాతంలా మారి, ఆ వ్యథ ఆత్మహత్యల వైపు అడుగులు వేసేలా చేస్తోంది. ఇవన్నీ రాష్ట్రంలో విపక్షాలకు అధికారపక్షంపై అస్త్రాలుగా మారుతున్నాయి. నవ్యాంధ్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడి వచ్చే నెలకు రెండేళ్లవుతుంది. కానీ, ఇప్పటివరకూ ఒక్క కొత్త ప్రభుత్వ ఉద్యోగం కూడా దక్కని దయనీయ పరిస్థితి నిరుద్యోగుకు నిరాశ కలిగిస్తోంది. ‘బాబొస్తే జాబొస్తుంది’ అని, ఉద్యోగం వచ్చేవరకూ నెలకు 2వేల రూపాయలు ఇంటికి పంపిస్తామన్న ఎన్నికల హామీ, నిజమే కామోసనుకున్న నిరుద్యోగుల కల ఈ రెండేళ్లలో నెరవేరకపోవడం, దుర్భర ఆర్థిక పరిస్థితి కలసి వెరసి ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో కమలనాథన్ ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రంలోగ్రూప్ 1, గెజిటెడ్, ఎన్జీఓ, లాస్ట్‌గ్రేడ్, ఎయిడెడ్ ఉద్యోగాలు 1,42,825 ఖాళీగా ఉన్నాయి. స్టేట్ క్యాడర్, మల్టీజోనల్, జోనల్, జిల్లా స్థాయిలో చూస్తేగ్రూప్ 1 పోస్టులు 247, గెజిటెడ్ 15,748, ఎన్జీఓ 95,325, లాస్ట్‌గ్రేడ్ 22,548, ఎయిడెడ్ 8,957 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కమలనాధన్ నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ వివరాలను బహిరంగంగానే ప్రకటించారు. అయితే, విభజనకు ముందు అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 16 వేల పోస్టులు భర్తీ చేయాలని, ఆ మేరకు నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. అయితే సమైక్య, ప్రత్యేక ఉద్యమాల కారణంగా ఆ నిర్ణయం అమలు కాకుండా నిలిచిపోయింది.
నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత చాలా ఆలస్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు చైర్మన్‌ను నియమించారు. అప్పటినుంచీ ఉద్యోగాల భర్తీకోసం కాగితాలపై కసరత్తు జరిగిందే తప్ప, కార్యరూపం దాల్చలేదు. దానితో ప్రతిపక్షాలు, ప్రధానంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. నిరుద్యోగులను బాబు ప్రభుత్వం మోసం చేసిందని, బాబుకు ఉద్యోగం వచ్చింది గానీ, నిరుద్యోగులకు రాలేదని, నిరుద్యోగ భృతి హామీ ఏమయిందని వెళ్లిన ప్రతిచోటా బాబు సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దానితో అప్రమత్తమయిన బాబు ప్రభుత్వం, 20 వేల ప్రభుత్వ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. అయితే, 1,42,825 ఖాళీల్లో 20వేల పోస్టులు భర్తీ అంటే, ఇస్తున్న ఉద్యోగాలు కేవలం 16 శాతమేనని స్పష్టమవుతోంది. మరోవైపు గత రెండేళ్లలో హౌసింగ్ వంటి ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న దాదాపు 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు.
ఈ పరిణామాలతో భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్న నిరుద్యోగులు చివరకు బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకూ ఏపిలో దాదాపు 4వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడగా, అందులో కర్నూలు, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలవారే ఎక్కవగా ఉండటం గమనార్హం. పట్టణ ప్రాంతాల్లో 29 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 65 శాతం మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే, వీరి చావులకు నిరుద్యోగం ఒక్కటే కారణం కాకపోయినా, దానివల్ల ఏర్పడిన ఆర్థిక సమస్యలే ఎక్కువని, అందులో అనారోగ్యంతో బాధపడేవారి సంఖ్య కూడా కొంత ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.