ఆంధ్రప్రదేశ్‌

ముమ్మాటికీ అక్రమ ప్రాజెక్టులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 17 : కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు ముమ్మాటికీ అక్రమ ప్రాజెక్టులేనని ఏపి ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. మంగళవారం కర్నూలులో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రాజెక్టులు అక్రమమైనవని తేల్చేందుకు తమ వద్ద కీలక ఆధారాలు ఉన్నాయని, అవసరమైన సమయంలో వాటిని కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు. కెసిఆర్ సర్కారు చేపట్టిన ప్రాజెక్టులపై కేంద్రం కూడా వ్యతిరేకంగానే ఉందని తెలిపారు. ఎవరి అనుమతులు లేకుండా చేపట్టిన ఆ ప్రాజెక్టులపై ప్రస్తుతం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి దృష్టి సారించారని తెలిపారు. ఆమె తెలంగాణ ప్రభుత్వంతో చర్చించే అవకాశం ఉందని, అవసరమైతే రెండు రాష్ట్రాల జల వనరుల శాఖ మంత్రులు, అధికారులతో సమావేశమై సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో మార్పు రాని పక్షంలో కోర్టులో న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు. జగన్ జలదీక్ష చేయాలని భావిస్తే హైదరాబాద్‌లో చేస్తే బాగుండేదని కర్నూలులో ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని కెఇ పేర్కొన్నారు. మహారాష్టల్రోని బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అక్కడే ఆందోళన చేసిన చంద్రబాబు అక్కడి పోలీసుల చేతిలో దెబ్బలు కూడా తిన్నారని గుర్తుచేశారు.

ముత్తూట్ ఎండికి హైకోర్టు నోటీసులు

చిత్తూరు, మే 17 : ముత్తూట్ ఫైనాన్స్ ఎండికి రాష్ట్ర హైకోర్టు నోటీసులను జారీ చేసింది. చిత్తూరు నగరంలో ఇటీవల పావని అనే మహిళ కొందరివద్ద బంగారు నగలను తాకట్టు పెట్టుకొని వడ్డీ వ్యాపారం నిర్వహించేది. తాకట్టు పెట్టుకున్న బంగారు నగలను ఆమె చిత్తూరు నగరంలోని ముత్తుట్ ఫైనాన్స్‌లో కుదవ పెట్టి నగదుతో పారిపోయింది. దీంతో పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే నగరంలోని ముత్తుట్ ఫైనాన్స్ సిబ్బంది ఈకేసు విషయంగా పోలీసులకు సహకరంచక పోవడంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈకేసు విచారణలో భాగంగా ముత్తుట్ ఫైనాన్స్ ఎండి పోలీసులకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఈనోటీసులను పోలీసులు కేరళలోని ముత్తుట్ ఫైనాన్స్ ప్రతినిధులకు అందజేసినట్లు తెలిసింది.

మావోల కాల్పుల్లో సిఆర్‌పిఎఫ్ జవాన్ మృతి

చింతూరు, మే 17: చతీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు సిఆర్పీఎఫ్ క్యాంపుపై మంగళవారం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక జవాను మృతిచెందాడు. గంగులూరు పోలీసు స్టేషన్ పరిధిలోని రంగారెడ్డి సిఆర్పీఎఫ్ క్యాంపుపై మావోయిస్టులు మంగళవారం తెల్లవారుజామున కాల్పులకు దిగారు. అప్రమత్తమైన జవాన్లు మావోయిస్టులపై ఎదురుకాల్పులకు దిగారు. ఈ సమయంలో క్యాంపులో సెంట్రీ డ్యూటీ చేస్తున్న సతీష్‌గ్వార్ (28) అనే జవాను మృతిచెందాడు.
సిఆర్‌ఇడిఎ సిబ్బంది కిడ్నాప్, విడుదల
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో స్టేట్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజన్సీ (సిఆర్‌ఇడిఎ) సిబ్బందిని మావోయిస్టులు మంగళవారం కిడ్నాప్ చేశారు. కొంత సమయం తర్వాత వారిని విడుదల చేశారు. వివరాలిలా ఉన్నాయి. సిఆర్‌ఇడిఎ ద్వారా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో సుకుమా, బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల్లో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలలోని విద్యుత్ లేని 500 గ్రామాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా బీజాపూర్ జిల్లాలో గుజ్జాప్తి గ్రామంలో సిఆర్‌ఇడిఎ సిబ్బంది సోలార్ ప్లాంటు ఏర్పాటుకు వెళ్లారు. ఈ సమయంలో మావోయిస్టులు సిబ్బందిని కిడ్నాప్ చేశారు. మరోసారి గ్రామాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటుచేస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. సిబ్బంది వద్దనున్న నగదు, బైకును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని విడిచిపెట్టారు. ఈ విషయంపై సిఆర్‌ఇడిఎ సిఇఒ ఎస్‌కె శుక్లా కొత్వాలి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మావోయిస్టులు ఈ విధంగా సోలార్ ప్లాంట్లు ఏర్పాటుకు ఆటంకం కల్పిస్తే ఏ విధంగా తాము సోలార్ ప్లాంట్లు ఏర్పాటుచేయగలమని వాపోయారు. గతంలో కూడా సిఆర్‌ఇడిఎ సిబ్బందిని మావోయిస్టులు ఇబ్బంది పెట్టినట్లు సిఇఒ శుక్లా తెలిపారు.

రూ.1300 కోట్లతో మంచినీటి పథకాలు

విశాఖపట్నం, మే 17: వచ్చే మూడేళ్ల కాల వ్యవధిలో రాష్ట్రంలోని 13వేల గ్రామ పంచాయతీల్లో అంతర్గత సిమెంట్ రహదార్ల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. విశాఖలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. దీనికోసం రూ.8,000 కోట్లను ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.2000 కోట్ల వ్యయంతో 4,500 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు. 13,14 ఆర్థిక సంఘం నిధులతో పాటు ఎన్‌ఆర్‌ఇజిఎస్‌లను కలిపి పూర్తి చేశామని, ప్రస్తుత సంవత్సరంలో 90 శాతం ఎన్‌ఆర్‌ఇజిఎస్ నిధులతో పాటు 10 శాతం 14వ ఆర్థిక సంఘం నిధులతో రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు రహదారి సదుపాయం కల్పించేందుకు కేంద్రం నిర్ధేశించిన ఈ పథకంలో దేశ వ్యాప్తంగా 1,900 కిలోమీటర్ల రహదార్లను నిర్మించగలిగితే, మన రాష్ట్రంలో 5000 కిమీ రహదార్లను పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో రహదార్ల నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. తొలిసారిగా పశ్చిమ గోదావరి జిల్లాలో 45 గ్రామ పంచాయతీల్లో ఈ పనులు చేశామని, తాజాగా ప్రతి జిల్లా నుంచి 50 గ్రామాలను ఎంపిక చేసి మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు అయ్యన్న వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భవిష్యత్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రూ.800 కోట్ల నాబార్డ్ నిధులతో 13 జిల్లాల్లో మంచినీటి పథకాలను నిర్మించనున్నట్టు తెలిపారు.
కేంద్రం నిధులపై శే్వతపత్రం ఇవ్వండి
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిన నిధులపై శే్వతపత్రం విడుదల చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం, ఇతర పథకాలకు కేంద్రం రూ.1.45 లక్షల కోట్లు మంజూరు చేసిందంటూ రాష్ట్ర బిజెపి నాయకులు చేస్తున్న ప్రకటనలు ప్రజలను గందరగోళంలో పడేస్తున్నాయన్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు నిధులు మంజూరు చేస్తున్నారని, ప్రత్యేకంగా ఏమీ చేయట్లేదని ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో బిజెపి నాయకులు తలో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. సాక్షాత్తూ ప్రధాని మోదీ, ఇతర మంత్రులు పార్లమెంట్, రాజ్యసభ సాక్షిగా చేసిన ప్రకటనలకు విలువ లేదా అని ప్రశ్నించారు. ఢిల్లీ తరహా రాజధాని నిర్మిస్తామని ప్రధాని హోదాలో మోదీ హామీ ఇచ్చారని, బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రకటన మేరకు రూ.20వేల కోట్లతో అది సాధ్యమా అని ప్రశ్నించారు.

వైభవంగా అసిరితల్లి సిరిమాను సంబరం

శ్రీకాకుళం, మే 17: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి గ్రామదేవత అసిరితల్లి అమ్మవారి సిరిమాను సంబరం మంగళవారం సాయంత్రం అంగరంగవైభవంగా జరిగింది. తొమ్మిదేళ్ళకోసారి నెలరోజులపాటు జరిగే ఈ ప్రధాన గ్రామదేవత ఉత్సవాల్లో సిరిమాను సంబరం తిలకించేందుకు సుదూరప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. చింతచెట్టు సిరిమానుకు లాంఛనంగా స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పూజలుచేసి ప్రారంభించారు. పూజారి పిరియా అప్పారావు సిరిమాను అధిరోహించి భక్తులకు దారిపొడవునా ఆశీస్సులు అందజేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిఎస్పీ భార్గవరావునాయుడు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. దుర్గమ్మ మట్టి నుంచి ప్రారంభమైన సిరిమాను ఊరేగింపు అరసవల్లి పురవీధుల్లో కొనసాగి చివరిగా అసిరితల్లి ఆలయానికి చేరుకుంది.

విదేశీ సిగరెట్లు ధ్వంసం

విజయవాడ, మే 17: కస్టమ్స్ పన్ను చెల్లించని రూ. 54 లక్షల విలువైన విదేశీ బ్రాండ్ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు ధ్వంసం చేశారు. మంగళవారం ఆటోనగర్‌లోని కస్టమ్స్ రాష్ట్ర కార్యాలయం వద్ద గల ఒక ఖాళీ ప్రదేశంలో స్వాదీనం చేసుకున్న విదేశీ సిగరెట్లను కస్టమ్స్ కమిషనర్ రెహమాన్ సమక్షంలో కస్టమ్స్ సిబ్బంది పూర్తిగా నాశనం చేయటంతోపాటు పర్యావరణ పరిరక్షణగా వాటిని ఒక గొయ్యిలో వేసి పేడ, నీళ్ళు చల్లి మట్టితో పూడ్చిపెట్టారు. ఈ సిగరెట్లు విదేశాల్లో తయారైనా నాసిరకంతో కూడిన నకిలీ ఉత్పత్తులుగా వీటిని నిర్ధారించినట్లు ఎపి కస్టమ్స్ కమిషనర్ రెహమాన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సిగరెట్లు కస్టమ్స్ పన్ను చెల్లించకుండా పలు అక్రమ మార్గాల్లో మన దేశంలోకి చొరబడ్డాయన్నారు. కస్టమ్స్ దాడుల్లో 54 రకాలకు చెందిన 3750 కార్టన్‌ల విదేశీ సిగరెట్లను పట్టుకున్నామన్నారు.

ముగిసిన పద్మావతీ పరిణయోత్సవం

తిరుమల, మే 17: తిరుమల నారాయణగిరి ఉధ్యానవనంలో జరుగుతున్న పద్మావతి పరిణయోత్సవంలో ముగింపురోజైన మంగళవారం సాయంత్రం స్వామివారు గరుడవాహనంపైన, శ్రీదేవి, భూదేవి సమేతుడై దంత పల్లకిపై ఆలయం నుంచి బయలుదేరారు. ఆ సమయంలో వర్షం కురుస్తుండటంతో వాహనాలను పటాటోపం ఘటాటోపం ( వర్షానికి ఉత్సవ మూర్తులు తడవకుండా ఏర్పాటు చేసిన ఛత్రంలాంటిది ) కింద నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. అనంతరం ఉత్సవం ముగిసిన తరువాత కూడా ఘటాటోపం చాటున శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఈక్రమంలో మార్గ మధ్యంలో భక్తులు ఘటాటోపం కింద ఉన్న స్వామి, అమ్మవార్లను పరిపూర్ణంగా తిలకించలేకపోయారు.