ఆంధ్రప్రదేశ్‌

కుండపోత.. గుండెకోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి/నెల్లూరు/ఒంగోలు, మే 18: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా చిత్తూరుతో పాటు కోస్తా జిల్లాలయిన నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు బుధవారం ఉదయంనుంచి ఇటు గుంటూరు మొదలుకొని అటు శ్రీకాకుళం జిల్లా దాకా కూడా పలు చోట్ల ఓ మోస్తరునుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రం చిరుజల్లులతో మొదలైన వర్షాలు దక్షిణ కోస్తా జిల్లాల్లో మంగళవారం సాయంత్రానికల్లా భారీ వర్షాలుగా మారాయి. మంగళవారం సాయంత్రం మొదలైన భారీ వర్షం బుధవారం సాయంత్రానికి కూడా తెరపి ఇవ్వలేదు. నెల్లూరు జిల్లాలోని తడలో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్‌లో సుడిగాలి బీభత్సానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇంటిముందు పార్క్ చేసిన కారుపై భారీ వృక్షం కూలడంతో కారు ధ్వంసమైంది. పలు లోతట్టుప్రాంతాలు జలమయమవడంతో పాటుగా రహదారులపై మోకాటి లోతు నీళ్లు నిలవడంతో జనజీవనం అస్తవ్యస్తమయింది. చిత్తూరు జిల్లాలోను గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరదయ్య పాళ్యంలో అత్యధికంగా 109.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పలు మండలాల్లో పెనుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా ఉద్యానవన పంటలకు కొంతమేర నష్టం వాటిల్లింది. ఈదురుగాలుల కారంగా పలు చోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటుగా చిత్తూరు ఆర్డీవో కార్యాలయం, మదనపల్లి, తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. కాగా, తిరుపతి నగరంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. ముఖ్యంగా ఎగువనుంచి వస్తున్న వరద నీటితో కపిలతీర్థం, మాల్వాడిగుండం ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. తిరుమలలోను మంగళవారం రాత్రినుంచి బుధవారం రాత్రి దాకా ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో శ్రీవారి ఆలయంలోకి వరద నీరు చేరింది. భక్తులు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఒంగోలు జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంళవారం సాయంత్రంనుంచి బుధవారం పొద్దుపోయే దాకా కూడా వర్షం కురుస్తూనే ఉంది. జిల్లాలో చినగంజాం మండలంలో అత్యధికంగా 85.2 మి.మీ, వేటపాలెంలో 72.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది, తీరప్రాంతాల్లోని మత్స్యకార గ్రామాలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో కంట్రోల్ రూమలను ఏర్పాటు చేశారు.
అధికారులు అప్రమత్తం
గుంటూరు/విజయవాడ:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి నెల్లూరు సమీపంలో కేంద్రీకృతమైందన్న వార్తలతో గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల అధికార యంత్రాంగాలు సైతం అప్రమత్తమైనాయి. తీరప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలపై గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులతో సమావేశం నిర్వహించారు. నిజాంపట్నం హార్బర్‌లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. బుధవారం ఈ జిల్లాలో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది.వాయుగుండం ప్రభావంతో కృష్ణా జిల్లాలోను బుధవారంనుంచి విస్తారంగా వర్షాలు కరుస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. మచిలీపట్నం ఓడరేవులో మూడో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు.
జనజీవనం అస్తవ్యస్తం
కాకినాడ/ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాల్లోను బుధవారం ఉదయంనుంచి వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజామున తేలికపాటి వర్షంతో మొదలై మధ్యాహ్నానికి భారీ వర్షంగా మారింది. దీంతో జన జీవనం అస్తవ్యస్తమయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉండడంతో అధికారులు, పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. కాకినాడలో బుధవారం ఉదయం విద్యుత్ షాక్‌తో తల్లీ కూతుళ్లు మృత్యువాత పడ్డారు. కాగా, మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఉభయ గోదావరి జిల్లాల అధికారులను ఆదేశించారు. కాకినాడ రేవులో మూడు నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. చేపలవేటకు వెళ్లొద్దని మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు.
ఉత్తరకోస్తా అప్రమత్తం
విశాఖ/శ్రీకాకుళం: చెన్నై సమీపంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం మరింత బలపడి ఒడిశా వైపుగా మళ్లడంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో మంగళవారం రాత్రినుంచి ఓ మోస్తరు వర్షాలు కరుస్తున్నాయి. విశాఖ జిల్లా చోడవరంలో ఇంటి అరుగుపై కూర్చుని ఉన్న గేదెల నర్సమ్మ అనే వృద్ధురాలిపై ఇంటిపైకప్పు ఒక్కసారిగా కూలడంతో మృతి చెందింది. వాయుగుండం ఒడిశా తీరం వైపు కదిలిందన్న వార్తలతో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టడం మొదలుపెట్టింది. కళింగపట్నం రేవులో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు.