రాష్ట్రీయం

‘రోను’ వణికిస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం/విజయవాడ, మే 19: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రోను తుపాను గురువారం రాత్రికి విశాఖకు నైరుతి దిశలో 240 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా కదులుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు. ఇది కోస్తా, ఒడిశా తీరాన్ని ఆనుకుని ఈశాన్య దిశగా కదులుతూ తీవ్ర తుపానుగా మారనుంది. శనివారం రాత్రికి లేదా ఆదివారం ఉదయానికి దక్షిణ బంగ్లాదేశ్ తీరంలో ఖేపుపారా, కాక్స్ బజార్ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు. దీనిప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీవర్షం, ఒకటి, రెండుచోట్ల అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో కోస్తా తీరం నుంచి, తీరాన్ని ఆనుకుని గంటకు 90-100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని తెలిపారు. అన్ని ప్రధాన ఓడరేవుల్లో నాలుగవ నెంబరు ప్రమాద సూచికను ఎగురవేశారు.
రోను తుపాను తీవ్రత దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవడంతో ప్రభుత్వం నిమగ్నమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ ఎస్‌పి టక్కర్ జిల్లా కలెక్టర్లు, యంత్రాంగాలతో గురువారం కాన్ఫరెన్స్ నిర్వహించారు. నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) దళాలు రంగంలోకి దిగాయి.
తుపాను కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, నెల్లూరు తదితర జిల్లాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. జనజీవనం అతలాకుతలమైంది. మే నెల మొత్తంలో కురవాల్సిన వర్షం కేవలం ఒకే ఒక రోజులో కురవడంతో లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా గొల్లపోలు మండలం తాటిపర్తిలో మిద్దెకూలడంతో సుబ్రహ్మణ్యం (45) అనే వ్యక్తి మరణించాడు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం నాగన్నగూడెంలో బుధవారం అర్థరాత్రి విద్యుత్ వైర్లు తెగిపడటంతో భార్యాభర్తలు ఇద్దరూ మరణించారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామంలో గుడిసెపై పిడుగుపడటంతో భార్యాభర్తలు కదిరప్ప (65), లక్ష్మీదేవి (55) మరణించారు. అలాగే ఏజెన్సీ ప్రాంతమైన బుట్టాయిగూడెం పరిధిలో విద్యుత్ తీగలు తెగిపడడంతో 15 మేకలు చనిపోయాయి.
శ్రీకాకుళం జిల్లాలో తీరం వెంబడి అధికవేగంతో ఈదురుగాలులు వీచాయి. లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శ్రీకాకుళం జిల్లాలో 10.64 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లాలో ఒక మోస్తరు వర్షం కురిసింది. విశాఖపట్నం గిరిజన ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. విశాఖలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
తూర్పుగోదావరి జిల్లాలో గత రెండు రోజుల నుండి భారీ వర్షం కురుస్తోంది. 60-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. అమలాపురంలో 312.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మామిడి, అరటి తోటలకు నష్టం వాటిల్లింది. కాకినాడ పోర్టులో నాలుగోనెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం కురిసిన వర్షానికి రహదారులన్నీ జలమయం అయ్యాయి. అనేక ప్రాంతాల్లో మామిడి తోటలకు తీవ్రమైన నష్టం జరిగింది.
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చీరాల, కొత్తపట్నంలలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లో 17 వేల హెక్టార్లలో మామిడి పంటకు నష్టం జరిగింది. వివిధ మండలాల్లో ఉప్పు ఉత్పత్తి నిలిచిపోయింది. నెల్లూరు జిల్లాలో వర్షం కురిసిన ప్రాంతాల్లో మున్సిపల్ మంత్రి నారాయణ పర్యటించి, పరిస్థితిని పరిశీలించారు. వర్షం వల్ల నష్టపోయిన వారికి పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు.

chitram విజయనగరంలోని నీట మునిగిన గంట స్తంభం ప్రాంతం