రాష్ట్రీయం

దేశంలో కులకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్తి సుబ్రహ్మణ్యం
హైదరాబాద్, మే 23: నవ్యాంధ్రలో కులాల సమరం ముదురుపాకాన పడుతోంది. చంద్రబాబునాయుడు ప్రభుత్వం కాపులను అందలమెక్కిస్తూ తమను విస్మరిస్తున్న వైనంపై ఇప్పుడు బీసీలు ఆందోళనబాట పట్టనున్నారు. వీరందరికీ తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నాయకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ మేరకు విజయవాడ వేదికగా త్వరలోనే బీసీ ఉద్యమానికి బీజం వేయనున్నట్లు తెలుస్తోంది.
అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఏపిలోని టిడిపికి చెందిన బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గత వారం క్రితం బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు, ఎల్‌బినగర్ టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యను కలిశారు. ఆ సందర్భంగా ప్రభుత్వం బీసీలకు ఏమీ చేయకపోవడం వల్ల స్ధానికంగా తామెదుర్కొంటున్న ఇబ్బందులకు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కాపులకు రుణాలిస్తోన్న ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్లను నిర్వీర్యం చేసిన వైనాన్ని ఆయనకు వివరించారు. బాబు కాపుల వలలో చిక్కుకుని, బీసీలను విస్మరిస్తున్నారని, కాపుల కోసం వందల కోట్లు, సంక్షేమ భవన్లు నిర్మిస్తుంటే, తమ సంగతేమిటని బీసీలు తమను నిలదీస్తున్నారని వారంతా కృష్ణయ్యకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కాపువిద్యార్థుల విదేశీ చదువులకు సాయం చేస్తున్న తమ ప్రభుత్వం, బీదలయిన బీసీ పిల్లలకు ఎందుకు సాయం చేయదని నిలదీస్తుంటే, నిస్సహాయంగా ఉండిపోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీలకు సబ్‌ప్లాన్ ఇచ్చారని, 20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ప్రకటించి ఎవరికీ సాయం చేయడం లేదని, ఆ ఒత్తిడిని తాము భరించలేకపోతున్నామని కృష్ణయ్యకు చెప్పారు.
కాపుల కోసం ఆ సామాజికవర్గానికి చెందిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, చినరాజప్ప, నారాయణ తదితరులు గట్టిగా మాట్లాడుతూ, వారి వర్గ ప్రయోజనాలు సాధించుకుంటున్నారని కృష్ణయ్య దృష్టికి తీసుకువెళ్లారు. బీసీ మంత్రులయిన రవీంద్ర, యనమల రామకృష్ణుడు, కెఇ కృష్ణమూర్తి, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు మాత్రం బీసీ సమస్యల గురించి ప్రస్తావించడం లేదని, బాబుపై ఒత్తిడి తీసుకువచ్చే సాహసం చేయడం లేదన్నారు.
కొందరు బీసీ నేతలు, ప్రముఖులు బీసీల గురించి మాట్లాడుతున్నప్పటికీ అవి వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసమో, రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్ల కోసమో తప్ప, జాతి ప్రయోజనం కోసం కాదని స్పష్టం చేశారు. మత్స్యకారులకు, అత్యంత వెనుకబడిన కులాలకు రుణాల విషయంలోప్రభుత్వం బీసీలకు మొండి చేయి చూపిస్తున్నా, వౌనం వహించాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎప్పుడు ఎటువైపు ఉంటారో తెలియని కాపుల కోసం, బాబు బీసీలను నిర్లక్ష్యం చేస్తున్నారని బీసీ సంఘాలు తమపై ఒత్తిడి చేస్తుంటే, తాము ఈ విషయాన్ని బాబుకు చెప్పలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. తాము క్షేత్రస్థాయిలో బీసీల మనోభావాలు బాబుకు చెప్పలేని పరిస్థితిలో ఉన్నామని, ఒకవేళ తాము చెప్పినా ఆయన వినే పరిస్థితిలో లేనందువల్ల, మీరే ఉద్యమానికి నాయకత్వం వహించాలని, తాము వెనుక ఉండి మీకు మద్దతునిస్తామని చెప్పారు.కాపులను బీసీల్లో చేర్చే వ్యవహారంలో బీసీల నుంచి మీరొక్కరే గట్టిగా గళం విప్పుతున్నందున, ఏపి బీసీలకు న్యాయం చేసే బాధ్యత కూడా మీరే తీసుకోవాలని కోరగా, కృష్ణయ్య అందుకు అంగీకరించారు. దానికోసం విజయవాడ కేంద్రంగా ఒక ప్రధాన కార్యాలయం కూడా ఏర్పాటుచేస్తామని బీసీ ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు. అందుకు స్పందించిన కృష్ణయ్య తనకు పార్టీ కంటే బీసీ ప్రయోజనాలే ముఖ్యమని, వారికోసం ఏపిలో బీసీ ఉద్యమం నిర్మిస్తానని హామీ ఇచ్చారు.
..బీసీలు వద్దా:కృష్ణయ్య
కాగా ఏపికి చెందిన బీసీ ప్రజాప్రతినిధుల బృందం తనను కలిసిన మాట వాస్తవమేనని ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అంగీకరించారు. బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బాబు ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేస్తే కిందిస్థాయిలో బీసీల సమస్యలు తెలుస్తాయన్నారు. బాబు ఆ పని చేయకపోవడం వల్లే తాను చొరవ తీసుకోవలసి వచ్చిందన్నారు. బాబు ప్రభుత్వం కాపులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బీసీల్లో అసంతృప్తి పెరుగుతోందని, వారి పక్షాన తాను నిలబడేందుకు అంగీకరించానన్నారు. తనకు పార్టీకంటే బీసీలే ముఖ్యమని స్పష్టం చేశారు. ఆయన ఆంధ్రభూమితో మాట్లాడుతూ, ఏపిలో బాబు సర్కారు బీసీలను విస్మరించి, కాపులకు ప్రాధాన్యం ఇవ్వడంపై బీసీ జాతి అసంతృప్తి, ఆగ్రహంతో ఉందన్నారు. కాపులకు న్యాయం చేయవద్దని తాము చెప్పడం లేదని, కానీ వారి కంటే అత్యంత దుర్భురమైన జీవితం గడుపుతున్న బీసీలకు న్యాయం చేయాల్సిన బాధ్యత బాబుపై ఉందన్నారు. కాపులను బీసీల్లో చేర్పిస్తే సహించేది లేదని, దానికోసం వీధిపోరాటాలకైనా సిద్ధంగా ఉన్నానన్న తన ప్రకటనకు కట్టుబడి ఉన్నానన్నారు. 20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ప్రచారానికే తప్ప బీసీలకు పనికిరావడం లేదని, ఫిషర్‌మెన్లతోపాటు, అత్యంత వెనుకబడిన బీసీ కులాలకు రుణాల అంశంలో బాబు ప్రభుత్వం ఏమీ చేయడం లేదన్నారు. ఆర్ధికంగా బలంగా ఉన్న కాపులకు భవనాలు నిర్మిస్తున్న బాబు, ప్రతి జిల్లాల్లో బీసీ భవన్లు కట్టిస్తామని చెప్పి ఒక్క బిల్డింగు కట్టలేదన్నారు. వాటికోసం 300 కోట్లు కేటాయించి ఒక్క పైసా మంజూరు చేయలేదన్నారు. ఏపిలో బీసీల కోసం ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.