ఆంధ్రప్రదేశ్‌

జీ ప్లస్ వన్‌తోనే సచివాలయం సరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 24: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయ భవనాలు జీ ప్లస్ వన్‌కే పరిమితం కానున్నాయి.. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొదటి అంతస్తును ఆరు లక్షల చదరపు అడుగుల స్థలంలో నిర్మిస్తున్నారు. ఈ భవనాలు జూన్ 15 నాటికి పూర్తికావాల్సి ఉంది. అయితే సచివాలయ విభాగాలన్నింటికీ ఈ భవనం సరిపోదనే భావనతో మరో రెండంతస్తులతో కలుపుకుని మొత్తం 12లక్షల చదరపు అడుగులలో నిర్మించాలని నిర్ణయించారు. మిగిలిన రెండంతస్తుల నిర్మాణాలకు సీఆర్డీయే అధికారులు టెండర్లను కూడా ఆహ్వానించారు. జూన్ 15కల్లా సచివాలయ మొదటి అంతస్తు వరకు పూర్తిచేసి 27 నుంచి కార్యాలయాలను తరలించటం.. మిగిలిన రెండంతస్తుల భవన నిర్మాణ పనులను రాత్రిళ్లు మాత్రమే నిర్వహించేలా కాంట్రాక్టు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. పగలు కార్యాలయాల్లో విధులు.. అయితే రాత్రిళ్లు భవన నిర్మాణ పనులు సాధ్యపడదని భావించి ముఖ్యమంత్రి చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అదనంగా చేపట్టిన రెండంతస్తుల భవన నిర్మాణాలను నిలిపివేయాల్సిందిగా అధికారులకు వౌఖిక ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హడ్కో రుణం సుమారు రూ. 700 కోట్లతో సచివాలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఉద్యోగుల తరలింపు.. నిర్మాణాలు ఏకకాలంలో జరగాలంటే కుదరదని అధికారులు ముఖ్యమంత్రికి తేల్చిచెప్పడంతో మిగిలిన రెండంతస్తుల భవనాల నిర్మాణానికి స్వస్తిచెప్పినట్లు సమాచారం. ముఖ్యమంత్రి, మంత్రుల చాంబర్లతో పాటు కీలకమైన శాఖల హెచ్‌ఓడిలకు సచివాలయంలో కార్యాలయాలు ఏర్పాటుకానున్నాయి. ఆర్థిక, రెవెన్యూ, సాధారణ పరిపాలన, హోంశాఖ, సివిల్ సప్లైస్, జలవనరులు, వ్యవసాయ తదితర విభాగాలను ముందుగా తరలించాలని ప్రయత్నిస్తున్నారు. మరికొన్ని శాఖల హెచ్‌ఒడిలతో పాటు కమిషనరేట్, డైరెక్టరేట్ల ఏర్పాటుకు విజయవాడ, గుంటూరు నగరాల్లో కార్యాలయాలు అనే్వషిస్తున్నారు. ఒకవైపు కార్యాలయాలు.. మరోవైపు నివాసాల కోసం ఉద్యోగులు.. ఉన్నతాధికారులు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.. నివాసాలకు రెయిన్ ట్రీ పార్కులో తగ్గింపు అద్దెలకు ప్రభుత్వం మంతనాలు జరుపుతోంది. కాగా విజయవాడ, గుంటూరు నగరాల్లో ఖాళీ అద్దె ఇళ్ల యజమానులతో కలెక్టర్లు సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అద్దెలు తగ్గించి ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా ఇళ్ల యజమానులకు సీఆర్డీయే అధికారులు నచ్చచెప్పే ప్రయత్నాలు ప్రారంభించారు.

శాశ్వత ప్రాతిపదికపై దుర్గా ఘాట్

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 24: భవిష్యత్తులో ‘ఇన్‌లాండ్ వాటర్ వే’ అంతర్గత జల రవాణా మార్గానికి వేదికగా రూపొందేలా శాశ్వత ప్రాతిపదికన దుర్గా ఘాట్ నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార్లను ఆదేశించారు. కృష్ణా పుష్కరాలకు సంబంధించి జరుగుతున్న ఘాట్ల నిర్మాణ పనుల్ని ముఖ్యమంత్రి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మోడల్ గెస్ట్‌హౌస్ సమీపంలోని దుర్గా ఘాట్ వద్ద జరుగుతున్న పనుల తీరుతెన్ను పరిశీలించి, పనుల నిర్వహిస్తున్న తీరును ఉన్నతాధికార్లను అడిగి తెలుసుకున్నారు. దుర్గా ఫ్లై ఓవర్ దిగువన వెళ్ళే నాలుగు వరసల రహదారికి, దుర్గా ఘాట్‌కి నడుమ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. దుర్గా ఘాట్ నుంచి బ్యారేజికి, అవలి గుంటూరు వైపు, భవానీద్వీపం వైపు మూడు, నాలుగు టూరిస్టు పాయింట్లు ఏర్పాటు చేయాలని అధికార్లను ఆదేశించారు. కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ పుష్కర యాత్రికులు అత్యధికంగా దుర్గా ఘాట్‌కు వస్తారని, దానిని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. పుష్కర స్నానాలు చేసిన యాత్రికులు రోడ్డు దాటి దుర్గ గుడికి చేరుకునేందుకు వీలుగా అండర్ పాస్ నిర్మాణం చేపట్టే ప్రతిపాదన ఉందన్నారు. అనంతరం కృష్ణవేణి ఘాట్‌ను ముఖ్యమంత్రి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని పూర్వపు ఘాట్లలన్నింటిని కలిపి 12 కి.మీ పొడవైన ఒకే ఘాట్‌గా నిర్మిస్తామని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఘాట్ వద్ద సుమారు 40 వేల మంది యాత్రికులు పుష్కర స్నానాలు చేసే వెసులుబాటు ఉంటుందన్నారు. దుర్గాఘాట్‌లో సుమారు లక్ష మంది యాత్రికులకు పుష్కర స్నానాలు చేసే సౌలభ్యం ఉంటుందన్నారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం వద్ద సర్కిల్‌ను అభివృద్ధిపరచాలని కార్పొరేషన్ కార్యాలయాన్ని కార్పొరేట్ తీరులో తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న బస్సు నుండే బందరు కాలువ, ఫ్లైఓవర్ నుండి పరిసరాలను పరిశీలించారు. ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంచి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు.

ఉద్యానవన హబ్‌గా ఎపి

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్యానవన హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉద్దేశమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. స్థానిక లయోలా కళాశాలలో ఈ నెల 23 నుండి మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఉద్యానవన ప్రదర్శన, మామిడి మేళాని రెండో రోజైన మంగళవారం రాష్ట్ర వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో 200 మంది ఎగ్జిబిటర్లు, మామిడితో కలుపుకుని ప్రదర్శించిన 10 వేల ఉద్యానవన ఉత్పత్తులను మంత్రులు తిలకించారు. 13 జిల్లాల నుండి వచ్చిన వివిధ రకాల మామిడి పండ్లను ఈ ప్రదర్శనలో తిలకించారు. వ్యవసాయానికి చెందిన యంత్ర సామాగ్రి, వివిధ కంపెనీలు ప్రదర్శించిన బైప్రోడక్ట్సును మంత్రులు పరిశీలించారు. అనంతరం మంత్రి పుల్లారావు పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ఉద్యానవన ప్రదర్శన 13 జిల్లాల రైతులకు ఉపయోగపడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. 13 జిల్లాల నుండి రైతులను ప్రభుత్వం ఇక్కడకు తీసుకువచ్చి ఉద్యానవన పంటలపై రైతుల్లో అవగాహన కల్పిస్తామన్నారు. ఉద్యానవన పంటలు పండించడంలో మెలకువలు, సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతుల్లో అవగాహన కల్పిస్తామని మంత్రి చెప్పారు. బొప్పాయి, మిరప, పామాయిల్, నిమ్మ పంటల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. మామిడి, డ్రిఫ్ట్ ఇరిగేషన్‌లో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16 లక్షల హెక్టర్లలో పండిస్తున్న ఉద్యానవన పంటల విస్తీర్ణాన్ని కనీసం 25 లక్షల హెక్టార్లకు పెంచేలా ముఖ్యమంత్రి రైతులను ప్రోత్సహిస్తున్నారని మంత్రి చెప్పారు. కొత్తగా ఉద్యానవన పంటలు పండించేందుకు ముందుకు వచ్చిన రైతులకు ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తుందన్నారు. ఉద్యానవన పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీలో ప్రభుత్వం రైతులకు సహకరిస్తుందన్నారు. ఉపాధి హామీ పథకం ఉద్యానవన పంటలకు అనుసంధానం చేశామన్నారు. ఎన్డీఆర్ జలసిరి కింద ఉద్యానవన పంటలు పండించే రైతులకు మూడేళ్లపాటు రైతులకు రాయితీలు ఇస్తామన్నారు. మంత్రుల వెంట పెడన శాసనసభ్యుడు కాగిత వెంకట్రావు, ఉద్యానవన కమిషనర్ చిరంజీవి చౌదరి, ఉద్యానవన శాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

మున్సిపాలిటీల్లో
ప్రాధాన్యత క్రమంలో పనులు

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 24: రాష్ట్రంలో అమృత్ పథకం కింద ఎంపికైన మున్సిపాలిటీల్లో అర్బన్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్ఫర్మేషన్ (అమృత్) పథకం కింద ప్రాధాన్యతాక్రమంలో పనులు చేపట్టాలని మున్సిపల్ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. అమృత్ పథకంలో ఎంపికైన 33 మున్సిపాల్టీల అధికారులతో మంత్రి నారాయణ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 33 మున్సిపాలిటీలను అమృత్ నగరాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు తయారుచేస్తున్నామని అన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 800 కోట్లతో ప్రాధాన్యతా క్రమంలో 33 మున్సిపాలిటీల్లో పనులు చేపట్టనున్నామని నారాయణ వివరించారు. అమృత్ పథకం కింద రాష్ట్రానికి కేంద్రం నాలుగు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, మిగిలిన నాలుగు వందల కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం కొంత భాగాన్ని, మున్సిపాలిటీలు కొంత మొత్తాన్ని భరిస్తాయని ఆయన తెలియచేశారు. అమృత్ పథకం కింద 28 పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లను విధిగా అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు. ఇప్పటికే మన రాష్ట్రంలో 27 ఇండికేటర్లను అమలు చేస్తున్నామని అన్నారు. మిగిలిన ఒక్క ఇండికేటర్‌ను కూడా అమలు చేయగలిగితే, కేంద్రం నుంచి 10 శాతం నిధులు అదనంగా వస్తాయని అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రం చేయని వినూత్న కార్యక్రమాలు మనం చేపడుతున్నామని ఆయన తెలిపారు. త్వరలో అన్ని మున్సిపాలిటీల్లో ఎల్‌ఇడి వీధి దీపాలు అమర్చబోతున్నామని మంత్రి నారాయణ చెప్పారు. అన్ని మున్సిపాలిటీల్లో 5.5 లక్షల ఎల్‌ఇడి వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటికే 4.5 లక్షల దీపాలు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. భవన నిర్మాణాలకు ఆన్‌లైన్‌లో అమనుమతులు ఇచ్చే తొలి రాష్ట్రంగా ఎపి ఎంపికైందని, ఇది ఒక రికార్డు అని నారాయణ చెప్పారు. బిల్డింగ్ అనుమతుల కోసం 5893 మంది దరఖాస్తు చేసుకోగా, 3815 మందికి ఆన్‌లైన్ అనుమతులు రెండు నిమిషాల్లోనే మంజూరయ్యాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని మున్సిపల్ స్కూళ్ళలో 25 వేల మంది విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సులు ప్రారంభించామని ఆయన వివరించారు.

మున్సిపల్ కమిషనర్లను ఉద్దేశించి ప్రసంగిస్తున్న మంత్రి నారాయణ