ఆంధ్రప్రదేశ్‌

శ్రీకాళహస్తీశ్వరాలయానికి కుంభాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, మే 24: రాహుకేతు క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఈ ఏడాదిలోనే కుంభాభిషేకం చేయాలని ధర్మకర్తల మండలి తీర్మానించింది. మంగళవారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గురవయ్య నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. 2012లో జరగాల్సిన కుంభాభిషేకం కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిందని గురవయ్యనాయుడు, ఈ ఓ భ్రమరాంబలు వెల్లడించారు.
దీనిని ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలని సమావేశం నిర్ణయించిందన్నారు. ఆలయ మరమ్మతులు, గోపురం పునర్‌నిర్మాణ పనులకు కూడా సమావేశం ఆమోదం తెలిపిందన్నారు. అనుబంధ ఆలయాల్లో కూడా మరమ్మతులు చేయాలని సమావేశం తీర్మానించింది. కంచి కామకోటి పీఠాధిపతి ఆధ్వర్యంలో కుంభాభిషేకం నిర్వహించాలని తీర్మానించింది. మహాశివరాత్రి సందర్భంగా పట్టణంలోని పెళ్ళి మండపం వద్ద స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం జరగే ప్రాంతంలోనే ప్రతినెలా కల్యాణోత్సవం జరపాలని నిర్ణయించారు. దీనివల్ల పట్టణానికి మంచి జరుగుతుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. రాహుకేతు పూజల ద్వారా వచ్చే వెండినాగపడిగలను ప్రస్తుతం హైదరాబాదులోని ప్రభుత్వ మింట్‌లో కరిగిస్తున్నామని దీనివల్ల సమయం వృథా కావడమే కాకుండా ఎక్కువ డబ్బు కూడా ఖర్చు అవుతోందని నాయుడు తెలిపారు. ఇందుకోసం చెన్నైలో వెండి కరిగించే యంత్రాన్ని కొనుగోలు చేసి దేవస్థానంలోనే వెండిని కరిగించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అమ్మవారి సన్నిధిని వెండి తాపడం చేయిస్తామని చెప్పారు. ప్రవేశ టికెట్లు, అభిషేకం టికెట్లు కౌంటర్లలో కంప్యూటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలియజేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న ద్రౌపదీ సమేత ధర్మరాజ స్వామి ఆలయానికి కొత్త ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయడానికి తీర్మానం చేశామన్నారు. మాస్టర్ ప్లాన్‌లో బాగంగా ఆలయానికి పక్కనే ఉన్న సన్నిధి వీధిలో ఒక లాడ్జీని స్వాధీనం చేసుకోవడానికి ధర్మకర్తల మండలి తీర్మానించినట్లు చెప్పారు. కైలాసగిరి ప్రాంతంలో ఉన్న దేవస్థానం ఆస్తులను కాపాడేందుకు ప్రహరీగోడను నిర్మించాలని తీర్మానించామన్నారు.

ఎపి రెసిడెన్షియల్
ఫలితాలు విడుదల
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 24: ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన పరీక్షా ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ఉదయం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫలితాల సిడిని ఆయన ఆవిష్కరించారు. రెసిడెన్షియల్ స్కూల్ ప్రవేశపరీక్షకు హాజరైన వారిలో 90.54 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, జూనియర్ కాలేజీల ప్రవేశపరీక్షలో 83.62 శాతం, డిగ్రీ కాలేజీల ప్రవేశపరీక్షలో 82.33 శాతం ఉత్తీర్ణులయ్యారు. మెరిట్ ఆధారంగా జూన్ 1 నుండి వీరికి సీట్లు కేటాయింపు జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో 10 జూనియర్, రెండు డిగ్రీ గురుకులాలు ఉన్నాయి. ఎపిఆర్‌ఎఈఐఎస్ ఆధ్వర్యంలో నడిచే రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ప్రవేశాలకు సంబంధించి పరీక్షను ఏప్రిల్ 24న నిర్వహించగా, జూనియర్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి పరీక్షను మే 12న నిర్వహించారు. రాష్టవ్య్రాప్తంగా 50 రెసిడెన్షియల్‌లో 4వేల సీట్లకు గానూ 24 వేల మంది ప్రవేశపరీక్ష రాశారు. 10 జూనియర్ రెసిడెన్షియల్ కాలేజీల్లో 1425 సీట్లకు 64వేల మంది, డిగ్రీ కాలేజీల్లో 432 సీట్లకు గానూ 7వేల మంది పరీక్ష రాశారు. ఫలితాల జాబితాలను వెబ్‌పోర్టల్‌లో అందుబాటులో ఉంచినట్టు మంత్రి చెప్పారు.

బాబు ఓఎస్‌డిగా తేలప్రోలు
హైదరాబాద్, మే 24: ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓఎస్‌డి (మీడియా వ్యవహారాలు)గా పాత్రికేయుడు తేలప్రోలు శ్రీనివాసరావును నియమించారు. ఈ మేరకు మంగళవారం ఎపి సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎల్ పాణిగ్రాహి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన రెం డు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. శ్రీనివాసరావుస్వస్థలం తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా. ఆయన ఢిల్లీలోని ఎపి భవన్ కేంద్రంగా పని చేస్తారు. ‘వస్తున్న మీ కోసం’ పేరుతో చంద్రబాబు పాదయాత్ర జరిపినప్పుడు శ్రీనివాసరావు కూడా ఆయనతో పాటుగా నడిచారు.

చట్ట ప్రకారం వ్యవహరిస్తున్నారా?

‘పోలవరం’ పరిహారంపై ఎస్టీ కమిషన్ అసంతృప్తి

ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, మే 24: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం, నష్టపరిహారం కల్పనపై జాతీయ ఎస్టీ కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. జాతీయా ఎస్టీ కమిషన్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కేంద్ర జల సంఘం అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ రామేశ్వర్ ఓరాన్ మాట్లాడుతూ పునరావాసం కల్పనపై అధికారులు చట్టం ప్రకారం వ్యవహరిస్తున్నారా లేదా అన్న అంశంపై త్వరలో పోలవరం ప్రభావిత ప్రాంతాలలో పర్యటించనున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు మూలంగా ఒడిశాలో ఒక గిరిజన తెగ, ఛతీస్‌గఢ్‌లో రెండు గిరిజన తెగలు అంతరించిపోతాయని ఇది చాలా తీవ్రమైన విషయమని ఆయన పేర్కొన్నారు. ఈ గిరిజన తెగలను ఏలా రక్షించాలన్న దానిపై అధికారులు దృష్టి సారించాలని చైర్మన్ అభిప్రాయపడ్డారు.

సడలని ఉద్రిక్తత

ఆర్డీఎస్‌పై
కొనసాగుతున్న ఆందోళన

ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, మే 24: మూడు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్‌డిఎస్) వద్ద ఉద్రిక్తత ఏ మాత్రం సడలలేదు. న్యాయం జరిగేవరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరిస్తూ రైతులు మంగళవారం రాత్రి కూడా అక్కడే బైఠాయించారు. కాగా కర్నాటక ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న ఎత్తు పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందేనని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య అన్నారు. ఆర్డీఎస్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా కర్నూలు జిల్లా బిజెపి నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. కర్నాటక స్వప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం కారణంగా దిగువ ప్రాంత రైతులు నష్టపోతారన్న విషయాన్ని ఆ ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు. ఎత్తు పెంపు కారణంగా జిల్లాలోని 400 ఎకరాలు ముంపునకు గురవుతుందని మరో వైపు దిగువకు తాగడానికి కూడా నీరు లభించని దుర్భర పరిస్థితులు నెలకొంటాయని వారన్నారు. కర్నాటక ఏం ఆశించి ఎత్తు పెంచుకోవాలని భావిస్తుందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాల్సిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి కర్నాటక ప్రభుత్వంతో చర్చించి రైతుల సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. ఆర్డీ ఎస్ వద్ద రైతులు చేపట్టిన ఆందోళనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు పహరాను కొనసాగిస్తున్నారు. ఎప్పటికపుడు అక్కడి పరిస్థితులను అధికారుల నుంచి తెలుసుకుంటూ కలెక్టర్ విజయ మోహన్, ఎస్పీ రవికృష్ణ సమీక్షిస్తున్నారు. రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.