ఆంధ్రప్రదేశ్‌

తెలుగు యాత్రికుల నిలువుదోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 25: కేదారనాథ్ యాత్రలో తెలుగోళ్లు అడుగడుగునా అగచాట్లకు గురవుతున్నారు. గత కొద్దిరోజుల క్రితం బగ్గీల నిర్వాహకుల దాడితో బెంబేలెత్తిన సంఘటన మరువక ముందే ప్రైవేటు ట్రావెల్స్ సంస్థ నిర్వాకంతో తెలుగు యాత్రికులు నిలువుదోపిడీతో అవస్థలు పడుతున్నారు. భాషా భేదంతో పోలీసులు దళారులకు కొమ్ముకాయటంతో కొండలు, గుట్టల్లో ప్రాణాలరచేత పట్టుకుని బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు.. ఈ విషయమై బాధితులు ఆంధ్రభూమికి అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. ఈ నెల 16వ తేదీన గుంటూరు, విజయవాడ, తెలంగాణ ప్రాంతానికి చెందిన 54 మంది యాత్రికులు ట్రావెల్స్ బస్సులో చెన్నైకి బయల్దేరారు. అక్కడి నుంచి జికె ట్రావెల్స్ బస్సులో డెహ్రాడూన్ మీదుగా హరిద్వార్ చేరుకున్నారు. యమునోత్రి, గంగోత్రిని సందర్శించిన అనంతరం కేదారనాథ్ బయల్దేరి వెళ్లేందుకు ఫటా పోలీసుస్టేషన్ పరిధిలోని హెలీపాడ్ వద్దకు చేరుకున్నారు.. అక్కడే తాము మోసపోయినట్లు గ్రహించారు. యాత్రా ప్రదేశాలను చుట్టివచ్చేందుకు మొత్తం ట్రావెల్స్ యాజమాన్యానికి రూ. 22వేల 500, కేదారనాథ్‌కు హెలీకాప్టర్‌లో వెళ్లేందుకు మరో రూ. 7వేల 500 మొత్తం రూ. 30వేల చొప్పున ఒక్కొక్కరు చెల్లించారు. వీరిలో దాదాపు అంతా కుటుంబ సభ్యులతో యాత్రకు బయల్దేరిన వారే అధికంగా ఉన్నారు. హెలికాప్టర్‌లో ప్రయాణించేందుకు ముందుగానే రిజర్వు చేసుకున్న వీరికి టిక్కెట్ నెంబర్లతో సహా మెసేజ్‌లు అందాయి. యమునోత్రి, గంగోత్రిని సందర్శించిన అనంతరం హెలీపాడ్‌కు చేరుకున్న బాధితులకు అక్కడ శ్రీనివాసన్ అనే ఏజెంట్ ‘ప్రస్తుతం హెలికాప్టర్ టికెట్టు ధరలు పెరిగాయి. కనుక మనిషికి మరో రూ. 800 చొప్పున చెల్లించాలని’డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం శ్రీనివాసన్‌కు రూ. 800 చొప్పున చెల్లించారు. అయితే రాత్రి గడిచినా అతని ఆచూకీ తెలియకపోవడంతో ఫటా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యాత్రికులలో ఉన్న తెనాలికి చెందిన ఓ కానిస్టేబుల్ చొరవ చూపి పోలీసులను సంప్రదించారు. పోలీసులు శ్రీనివాసన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని లేదా సొమ్ము వాపసు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఇంతలో పోలీసులు శ్రీనివాసన్‌తో కుమ్మక్కయి అతన్ని తమ అదుపులో నుంచి విడుదల చేయటంతో పాటు తెలుగులో, ఇంగ్లీషులో లిఖితపూర్వక ఫిర్యాదులు స్వీకరించేదిలేదని, హిందీలో రాసిస్తేనే కంప్లైంట్‌ను స్వీకరించి అతన్ని అరెస్టు చేస్తామని దాటవేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ తమ పరిస్ధితిని ఏపి సీఎం పేషీకి వివరించేందుకు ప్రయత్నించారు. బుధవారం రాత్రి వరకూ పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని బాధితులు వాపోయారు. కొండలు, గుట్టల మధ్య ఉన్న చిన్నచిన్న హోటళ్లలో కాలం వెళ్లదీస్తున్నట్లు తెలిపారు. యాత్రికులలో మొత్తం 25 మంది మహిళలు కూడా ఉన్నారు. రాత్రి పొద్దుపోయినా అటు పోలీసులు, ఇటు ట్రావెల్స్ సంస్థలు పట్టించుకోలేదు. దీంతో యాత్రికులు అటు కేదారనాథ్ వెళ్లలేక కొండల్లో ఉండలేక నరకయాతన అనుభవిస్తున్నారు. దీనిపై ఏపి, టిఎస్ ప్రభుత్వాలు స్పందించాల్సి ఉంది. కాగా యాత్రికులలో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామ సర్పంచ్ చిట్టిబొమ్మ వెంకటేశ్వరరావు, పిట్టలవానిపాలెం జెడ్పీటీసీ సిహెచ నారపరెడ్డి, గుంటూరుకు చెందిన రాంబాబు తదితరులు ఉన్నారు. ఆంధ్రభూమితో తమ అనుభవాలను వీరు పంచుకున్నారు.

దిక్కుతోచని స్థితిలో ఉన్నాం..
* రాంబాబు (గుంటూరు)

మేం ట్రావెల్స్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కేదారనాథ్ యాత్ర పూర్తిచేసుకుని జూన్ 2వ తేదీ నాటికి స్వస్థలానికి చేరుకోవాలి. అయితే యాత్ర పూర్తవుతుందా.. లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. ఫటా పోలీసుస్టేషన్ నుంచి కేదారనాథ్ ఆలయం వరకు మొత్తం 21 కిలోమీటర్ల దూరం ఉంటుంది. లోయలు, కొండల్లో నడిచివెళ్లటం కష్టతరం.. అయినా మాలో కొంతమంది సిద్ధపడి నడక దారిన వెళ్లాలని అనుకుంటున్నారు. మేం వారిస్తున్నాం.. డబ్బుపోయి..మేం ఇబ్బందులకు గురవ్వాల్సిన దయనీయమైన పరిస్థితి నెలకొంది. ఫటా పోలీసులు న్యాయంచేసేలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.

నరకం చూపిస్తున్నారు..
* జెడ్పీటీసీ నారపరెడ్డి

దైవ దర్శనానికి మేం యాత్రకు వస్తే ట్రావెల్స్ సంస్థలు నరకం చూపిస్తున్నాయని పిట్టలవానిపాలెం జెడ్పీటీసీ సిహెచ్ నారపరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కొండలు, గుట్టల నడుమ సమాచార వ్యవస్థ కూడా సక్రమంగాలేదు.. లైన్లు కలిసినప్పుడే మా వారితో మాట్లాడుతున్నాం.. తరువాత బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉండటంలేదు.. గతంలో ఇలాంటి అనూహ్య పరిణామాలు ఎదురుకాలేదన్నారు.

మహిళలు అవస్థలు పడుతున్నా పోలీసులు కనికరించటంలేదు.. * పెదవడ్లపూడి సర్పంచ్ వెంకటేశ్వర్లు

రెండురోజులుగా పడిగాపులు కాస్తున్నాం.. కొద్దోగొప్పో ఉన్న సొమ్ముతో హోటళ్లలో గడుపుతున్నాం.. మహిళలు కూడా ఉన్నారు. పోలీసులు జోక్యం చేసుకుని తమకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయమంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.. మేం కుటుంబ సభ్యులతో వచ్చాం.. బంధు, మిత్రులు క్షేమ సమాచారం కోసం ప్రయత్నిస్తున్నారు. మాకు డబ్బు ముఖ్యంకాదు.. యాత్ర పూర్తికావాలి.. ఇందుకు ప్రత్యామ్నాయం చూపాలి..

చిత్రం... ఫటా పోలీస్‌స్టేషన్ ఎదుట తెలుగు యాత్రికులు