రాష్ట్రీయం

అమరావతి నుంచే పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 26: వచ్చే నెల 27వ తేదీ నాటికి సెక్రటేరియట్ ఉద్యోగులంతా అమరావతికి రావల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. జూన్ 27 నుంచి అమరావతినుంచే పాలన ప్రారంభిస్తామని చెప్పారు. విజయవాడలో రెండో రోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ, విజయవాడ, గుంటూరులలో ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె ఎక్కువగా వసూలు చేస్తే సహించేది లేదని, అవసరమైతే రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రయోగిస్తామని ఆయన హెచ్చరించారు. జూన్ 27 నాటికి కమిషనరేట్లు, డైరక్టరేట్లు సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విజయవాడ, గుంటూరులకు తరలిస్తామని తెలియజేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎల్‌ఇడి బల్బుల వాడకాన్ని మొదలుపెట్టాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నారు. బకింగ్‌హామ్ కెనాల్ ప్రాజెక్ట్ అభివృద్ధికి సిఇఓ స్థాయి అధికారిని నియమించాలని సిఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ఎట్టి పరిస్థితుల్లోను లక్ష్యాలను చేరుకోవాలని సిఎం ఆదేశించారు. ఇందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించాలని ఆయన సూచించారు.
వేధింపులు లేని పాలన అందించండి
ప్రజలకు వేధింపులు లేని, అవినీతి రహిత పాలనను అందించాలని సిఎం అధికారులకు విజ్ఞప్తి చేశారు. పరిపాలనలో వినూత్న పద్ధతులు, నూతన సాంకేతిక ఆవిష్కారాలను ఉపయోగించుకోవడం ఎంతో అవసరమని ఆయన అన్నారు. కలెక్టర్లకు విశేషమైన అధికారాలు ఉన్నాయని, ప్రజారంజకమైన పాలన అందించడంలో వారు ముఖ్య భూమిక పోషిస్తున్నారని అన్నారు. గ్రామస్థాయి నుంచి అధికార యంత్రాంగంలో పోటీతత్వం పెంచేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో వనరులు పుష్కలంగా ఉన్నాయని, కోస్తాలో పొడవైన సముద్రతీరం ఉన్న జిల్లా అని ఆయన అన్నారు. అభివృద్ధిలో అట్టడుగున ఉన్న శ్రీకాకుళం జిల్లాను ప్రగతి పథంలోకి తీసుకువెళ్ళేందుకు అధికారులు, మంత్రులు కృషి చేయాలని సూచించారు.
రాష్ట్రంలో అంగన్‌వాడీ సెంటర్లను ప్రీ స్కూళ్లుగా మార్చే ఏర్పాట్లు వేగవంతం చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. వాటికి త్వరితగిన సొంత భవనాలు నిర్మించాలని ఆదేశించారు. రాష్ట్రంలో మరో 7000 అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలియచేశారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన ‘మన అంగన్‌వాడీ పిలుస్తోంది’ ప్రచారం పోస్టర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఫిజికల్ లిట్రసీని సమీక్షించిన ముఖ్యమంత్రి గ్రామ స్థాయిలో ఒకర్ని ఫిజికల్ లిట్రసీ ఇన్‌చార్జ్‌గా నియమించాలని సూచించారు.
త్వరలో యూత్ పాలసీ
త్వరలో యువజన విధానాన్ని తీసుకువస్తామని సిఎం చంద్రబాబు చెప్పారు. రక్షణ రంగంలో అడుగుపెట్టేందుకు యువతకు అవసరమైన శిక్షణ ఇస్తామని, ఈ ఏడాది 7,900 మందికి శిక్షణ ఇచ్చామని ఆయన తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్‌లో బెస్ట్ చెయిన్ గ్రూపులను తీసుకురావాలని ఆయన కోరారు. పరిశ్రమల రంగాన్ని సమీక్షిస్తూ ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటులో మనం ఇంకా అభివృద్ధి సాధించాలని అన్నారు. పరిశ్రమల రంగంలో 66 ఎంఓయులు కుదిరాయని, 42 ప్రాజెక్ట్‌లు రూపుదాల్చాయని చెప్పారు. ఇప్పటి వరకూ రాష్ట్రానికి 5993 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో జపాన్‌లో రోడ్‌షోలు నిర్వహిస్తున్నామని ఆయన తెలియచేశారు.
ఐదు హబ్‌లుగా పర్యాటకరంగం
రాష్ట్ర పర్యాటకరంగం ప్రగతిని సమీక్షిస్తూ ఆదాయాన్ని తెచ్చిపెట్టే అత్యంత ప్రధానమైన వనరు పర్యాటకరంగమేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పర్యాటకరంగ ముఖ్య కార్యదర్శి నీరబ్ కుమార్ తన శాఖ ప్రగతిని వివరిస్తూ, పర్యాటక రంగాన్ని ఐదు హబ్‌లుగా తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. వౌలిక సదుపాయాలు, సర్వీస్, ప్రొడక్ట్ ప్రాజెక్ట్‌లుగా టూరిజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పర్యాటక శాఖలో 11,492 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. ఏడు ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మిక టూరిజంను అభివృద్ధి చేయాలని సిఎం ఆదేశించారు. ఇంధన, వౌలికరంగ సదుపాయాలపై ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ నివేదిక సమర్పించారు. శత శాతం విద్యుదీకరణలో భాగంగా 1.56 లక్షల ఇళ్లకు ఈనెలాఖరులోగా విద్యుత్ సౌకర్యం కల్పించనున్నామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జూలైలో ఫైబర్ ఆప్టిక్ ప్రాజెక్ట్ ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని, నేటి వరకూ 14,500 కిలో మీటర్ల ఆప్టికల్ కేబులింగ్ పూర్తయిందని ఆయన చెప్పారు. ‘వనామీ రొయ్యల హెచరీలలో మంచి యాజమాన్య పద్ధతులు, సుస్థిర సముద్ర చేపల వేట’ అనే పుస్తకాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రారంభించారు.

chitram విజయవాడలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబునాయుడు