తెలంగాణ

రహదారి వ్యవస్థలో దేశానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, మే 27: రహదారి వ్యవస్థలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేల కోట్ల రూపాయలు రోడ్ల అభివృద్ధి కోసం వ్యయం చేస్తూ ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మెదక్ జిల్లాలో సుమారు రూ.25 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఆర్ అండ్ బి అధ్వర్యంలో రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు. శక్రవారం ఆయన మెదక్ జిల్లా పటన్‌చెరు నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. పట్టణ శివారులో సుమారు 4.5 కోట్ల వ్యయంతో చేపట్టిన రెండు భారీ బ్రిడ్జిల పనులను ప్రారంభించిన ఆయన ఇంద్రేశం గ్రామ పంచాయతి పరిధిలోని రామేశ్వరంబండ 3 కోట్లతో చేపట్టిన హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు. అనంతరం జరిగిన విలేఖర్ల సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధికి ఇప్పటి వరకు దాదాపు వంద కోట్లు కేటాయించామన్నారు. 101 కిలోమీటర్ల రోడ్లను బాగు చేయడానికి 22 పనులను మంజూరు చేయడం జరిగిందన్నారు.
గుజరాత్‌ను మించిపోవడం ఖాయం
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అతి త్వరలోనే గుజరాత్‌ను మించిపోవడం ఖాయమని మంత్రి తుమ్మల స్పష్టంచేసారు. రహదారుల అభ్యున్నతితోనే ఆర్థిక స్వాలంబన సాధ్యమని నమ్మిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ దిశగా అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసారన్నారు.
భారతావనిలోని ఇతర రాష్ట్రాల నాయకులను సైతం అమితంగా ఆకర్షిస్తున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలు తెలంగాణ ఖ్యాతిని నలుదిశలా ఇనుమడింప చేస్తున్నాయన్నారు. ఒక ప్రణాళికబద్ధంగా, కేవలం నాణ్యతకు పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు భవిష్యత్ తరాలకు బంగారు భవితను అందించడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలను సైతం భాగస్వాములను చేస్తూ రహదారులను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
తుమ్మల సహకారంతోనే ఆరులైన్ల ఎక్స్‌ప్రెస్ హైవే మంజూరు: మంత్రి హరీష్‌రావు
రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సహాయ సహకారాలతోనే జిల్లాకు ఆరు లైన్ల ఎక్స్‌ప్రెస్ హైవే మంజూరు అయిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. కేంద్ర మంత్రి గడ్గరీతో పలుమార్లు చర్చలు జరిపిన తుమ్మల జిల్లాకు ఓ మంచి వరంలా ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రసాదించారన్నారు. హైద్రాబాద్ నడిబొడ్డున గల రవీంద్రభారతి నుంచి జిల్లా కేంద్రమైన సంగారెడ్డి వరకు ఆధునికమైన హంగులతో రహదారి నిర్మాణం జరుగుతుందన్నారు. అనుక్షణం అధికారులను పరుగులు పెట్టిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు సైతం రోడ్లను నిర్మిస్తున్న ఘనత కేవలం ఆర్ అండ్ బి శాఖకే దక్కుతుందన్నారు. పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినాయకులు చేయలేని అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం కేవలం రెండు సంవత్సరాలలో చేసి చూపిందన్నారు. 60 సంవత్సరాల భారతావని స్వాతంత్ర చరిత్రలో ఇంత అభివృద్ధి జరిగిన దాఖలాలు ఎక్కడా లేవని మంత్రి తన్నీరు హరీష్‌రావు వివరించారు. ప్రజల సహకారం లేనిదే రాష్ట్ర అభ్యున్నతి అసాధ్యమని నొక్కి వక్కాణించిన ఆయన ప్రతి పనిలోను ప్రజలను తప్పనిసరిగా భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. పటన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ కేవలం ఒక్క సంవత్సరములోనే వంద కోట్ల రూపాయలు నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ రహదారిపై గత ఆరు మాసాల క్రితం వరకు టోల్‌గేట్ మూలంగా ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారని, దానిని తొలగించడానికి మంత్రి తుమ్మల ఎంతగానో సహకరించారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి, ఎంపిపిలు శ్రీశైలం, యాదగిరి, కార్పొరేటర్ శంకర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

రామేశ్వరంబండ హైలెవల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేస్తున్న
మంత్రులు తుమ్మల, హరీశ్‌రావు