రాష్ట్రీయం

నేడు రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 11: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన విజయవాడ నగరంలో శనివారం దక్షిణాది రాష్ట్రాల 26వ కౌన్సిల్ సమావేశం జరుగబోతున్నది. విజయవాడ నగరంలో ఇలాంటి సమావేశం జరగటం ఇదే ప్రప్రథమం కావటంతో అధికార యంత్రాంగం హాజరుకానున్న ప్రతినిధుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరిచిన, అమలుపరుస్తున్న, అమలుపర్చాల్సిన వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పనితీరు, ప్రణాళికలపై చర్చ జరుగనున్నది. ఈ కౌన్సిల్‌లో భాగస్వామ్య రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, పాండిచ్చేరి రాష్ట్రాలు పాల్గొననున్నాయి. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా వారి ప్రతినిధులు, కేంద్ర, రాష్టస్థ్రాయి ఉన్నతాధికారులు, సమన్వయ శాఖలకు చెందినవారు హాజరుకానున్నారు. 1956 స్టేట్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ సందర్భంలో జోనల్ కౌన్సిల్ ఏర్పాటుకు సలహా సంఘం సూచనలు చేయటం జరిగింది. ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలుచేసే పథకాలకు సంబంధించి వౌలిక సదుపాయాలు, ఆరోగ్య భద్రతకు సంబంధించిన సాధరాణ అంశాలు, సామాజిక అంశాలు, మైనార్టీ వర్గాలకు కల్పించే సదుపాయాలు, సరిహద్దు వివాదాలు వంటి వాటిపై తీసుకుంటున్న చర్యల పనితీరును సమీక్షిస్తారు.

శేషాచల అడవుల పరిరక్షణకు కేంద్రం సహకారం
తిరుపతి,: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైవున్న ఏడుకొండల్లో ఉన్న శేషాచల అడవులను పరిరక్షించడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. శ్రీవారి దర్శనార్థం శుక్రవారం తిరుమలకు వచ్చిన కేంద్రమంత్రికి తిరుమల్లోని పద్మావతి అతిథిగృహం వద్ద టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు భానుప్రకాష్‌రెడ్డితోపాటు పలువురు టిటిడి అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. శేషాచల కొండల్లో విలువైన ఎర్రచందనంతోపాటు అరుదైన, అమూల్యమైన వృక్షజాతులు ఉన్నాయని భానుప్రకాష్‌రెడ్డి రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై రాజ్‌నాథ్ సింగ్ సానుకూలంగా స్పందిస్తూ శేషాచలం అడవుల రక్షణకు కేంద్రం రాష్ట్రానికి సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

సమష్టిగా పనిచేస్తేనే సమస్యలు పరిష్కారం

కుప్పం, డిసెంబర్ 11: నేతలు కలసి కట్టుగా పనిచేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని సి ఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పం ఆర్ అండ్ బి అతిథిగృహం వద్ద వివిధ పార్టీలకు చెందిన పలువురు సిఎం సమక్షంలో టిడిపిలో చేరారు. ఈసందర్భంగా సి ఎం మాట్లాడుతూ సమస్యలను గ్రామాల్లోనే చర్చించి వాటి పరిష్కార మార్గాలు కనుక్కోవాలన్నారు. అభివృద్ధికి ప్రజల నుంచి కూడా సహకారం అందాలన్నారు. ఈసందర్భంగా గుడ్లనాయనిపల్లె సర్పంచ్ గాయత్రిదేవరాజు, మల్లానూరు గుణశేఖర్, గుడుపల్లె మండలం గుండ్లసాగరం పంచాయతీకి చెందిన వారు పలువురు సి ఎం సమక్షంలో టీడిపిలో చేరారు. ఈ సందర్బంగా సీ ఎం ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్, జెసి నారాయణభరత్‌గుప్తా సహాపలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీ ఎం ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం హెలికాప్టర్‌లో బెంగళూరు వెళ్లారు.

ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్న సిఎం చంద్రబాబు

ఇద్దరు మావోయిస్టుల అరెస్టు
భద్రాచలం, డిసెంబర్ 11: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా సుర్నా అటవీప్రాంతంలో పోలీసులు శుక్రవారం ఇద్దరు మావోయిస్టులను అరెస్టు చేశారు. పశ్చిమబస్తర్‌లోని సఫ్లాయి ప్లాటూన్ డెప్యూటీ కమాండర్ అప్కా రాజు, డుమామ్ ఎల్‌వోఎస్ దళ సభ్యుడు మడివి మంగడులను ఎస్టీఎఫ్, డీఆర్‌జీ బలగాలు పట్టుకున్నాయి. కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో వీరు తారసపడగా అనుమానంతో విచారించి వారిని అరెస్టు చేసినట్లు బస్తర్ ఐజీ కల్లూరి తెలిపారు.

అభినవ ఘంటసాల సూరిశెట్టి మృతి

విశాఖపట్నం, డిసెంబర్ 11: అపర ఘంటసాలగా కీర్తినందుకున్న సూరిశెట్టి రామారావు విశాఖ నగర శివారు పెందుర్తిలోని ఆయన స్వగృహంలో గురువారం రాత్రి కన్నుమూశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో 1943లో జన్మించిన సూరిశెట్టి అక్కడే బికాం విద్యను పూర్తి చేశారు. విశాఖపట్నం పోర్టుట్రస్టులో ఉద్యోగిగా ఉంటూనే సూరిశెట్టి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. తన సంగీత సేవకు సమయం కేటాయించే క్రమంలో ఆయన 1993లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి పూర్తిగా గానామృతానికి పరిమితమయ్యారు. చిన్నతనం నుంచి ఘంటసాల పాటలను ప్రాణంగా భావించే సూరిశెట్టి తాను కూడా ఘంటసాల మాదిరి గానం చేయాలనే ప్రయత్నం చేసేవారు. ఆయనకు అభినవ ఘంటసాల పేరును సార్ధకం చేసింది. ఘంటసాల భగవద్గీత గీతాలాపన స్ఫూర్తితో సూరిశెట్టి భగవద్గీతలోని 701 శ్లోకాలను గానం చేశారు. చిన్ననాటి నుంచి పాటలు పాడటం సాధన చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, పశ్చిమబంగ, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లోనే కాకుండా సింగపూర్, మలేషియా తదితర దేశాల్లో తన గానామృతాన్ని ప్రేక్షకులకు పంచారు. పెందుర్తి హిందూ శ్మశానవాటికలో ఆయన మృతదేహానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు.

20న ప.గో. జిల్లాకు రాష్టప్రతి

ఏలూరు, డిసెంబర్ 11: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 20న పశ్చిమ గోదావరి జిల్లాకు రానున్నారు. ఆకివీడు మండలం అయిభీమవరంలో టిటిడి ఆధ్వర్యంలో నిర్మించిన వేద పాఠశాలను రాష్టప్రతి ప్రారంభిస్తారు. రాష్టప్రతి పర్యటన వివరాలిలా ఉన్నాయి. 20వ తేదీ ఉదయం 10.55 గంటలకు రాష్టప్రతి విజయవాడ చేరుకుంటారు. అక్కడ నుంచి 11.05 గంటలకు బయలుదేరి 11.25 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా అయిభీమవరం చేరుకుంటారు. 11.45 గంటలకు వేదపాఠశాల ప్రాంగణానికి చేరుకుంటారు. 11.45 నుంచి 12.45 గంటల వరకు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 12.45గంటలకు అక్కడ నుంచి బయలుదేరి అయిభీమవరం చేరుకుని, అక్కడ నుంచి విమానంలో విజయవాడ వెళతారు.

పాడేరు ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు

అరకులోయ/ జి. మాడుగుల, డిసెంబర్ 11: బాక్సైట్ జోలికొస్తే గిరిజన ఆయుధాలతో ముఖ్యమంత్రి తల నరుకుతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై చర్యలు తీసుకోవాలని టిడిపి నేతలు, కార్యకర్తలు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసారు. చింతపల్లిలో గురువారం వైకాపా నిర్వహించిన బాక్సైట్ వ్యతిరేక సభలో ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించిన ఎమ్మెల్యేపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ముఖ్యమంత్రికి ప్రాణహాని ఉందని తామంతా భావిస్తున్నామని, రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ఏం జరిగినా ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ, పార్టీ నేతలు శెట్టి బాబూరావు, కె.సుబ్బారావు, కె.అప్పారావు, బాకా బాబూరావు, వనాది, లైచోన్, దొన్ను, సొన్ను, బస్కీ, పద్మాపురం పంచాయతీ సర్పంచ్‌లు కామేష్, మహదేవ్, ఎంపిటిసి సభ్యులు ఉన్నారు. ముఖ్యమంత్రి తలను నరుకుతాం, ఆయుధాయులతో వేటాడి, వెంటాడి చంపుతామంటూ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడడం ఆమె అవివేకానికి నిదర్శనమని మాజీ మంత్రి మణికుమారి ధ్వజమెత్తారు. ఈశ్వరి బహిరంగంగా ప్రకటించి ప్రశాంత మన్యంలో ఆందోళన రేకెత్తిస్తున్నారని ఆరోపించారు.

చట్టపరమైన చర్యలు తప్పవు : మంత్రి సుజాత

నరసాపురం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై విశాఖ జిల్లా పాడేరు సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి, వైసిపి ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమం, భూగర్భ గనుల శాఖ మంత్రి పీతాల సుజాత వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం ఆమె విలేఖర్లతో మాట్లాడారు. విపక్ష నేత తమ పరిధి దాటి మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్రంలో తమ ఆటలు సాగటం లేదని ముఖ్యమంత్రినే బెదిరించే స్థాయికి దిగజారారన్నారు. జగన్ వ్యాఖ్యలు రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు తీసుకొచ్చే విధంగా ఉన్నాయన్నారు. ఇది వారి పతనానికి నాంది అన్నారు. ఈ అంశంపై చట్టపరంగా ముందుకెళ్తామన్నారు. గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలు జరపబోమని స్పష్టంచేశారు.

అనంతలో చిరుత మృతి

మడకశిర, డిసెంబర్ 11: అనంతపురం జిల్లా మడకశిర పట్టణ శివారులో రైతు లక్ష్మీనారాయణ పొలంలో శుక్రవారం చిరుతపులి మృతి చెందింది. ఆరేళ్ల వయసున్న చిరుత ముళ్లపొదల్లో చనిపోయి ఉండడం గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది చిరుతను పరిశీలించారు.

జిఎంసి విద్యార్థికి
అమెరికాలో గుర్తింపు

గుంటూరు, డిసెంబర్ 11: గుంటూరు మెడికల్ కళాశాల విద్యార్థి డాక్టర్ మిక్కినేని కార్తీక్‌కు అమెరికాలో అరుదైన గుర్తింపు లభించింది. కరెంట్ వాస్క్యులర్ సర్జరీ అనే పుస్తకంలో 34వ చాప్టర్ రాసే అవకాశం కార్తీక్‌కు లభించింది. శుక్రవారం అమెరికాలోని చికాగోలో 40వ వార్షిక నార్త్ వెస్ట్రన్ వాస్క్యులర్ సింపోజియంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అమెరికా వైద్యశాస్త్ర నిపుణులకు చెందిన ఈ పుస్తకంలో డాక్టర్ కార్తీక్ ఓ చాప్టర్‌ను రాయడం గొప్ప విశేషంగా వైద్యులు పేర్కొన్నారు.

అప్పుల బాధతో
సింగిల్‌విండో డైరెక్టర్ ఆత్మహత్య

నాగలాపురం, డిసెంబర్ 11 : అప్పుల బాధ తాళలేక నాగలాపురం సింగిల్‌విండో డైరెక్టర్ సురేష్ (44) మృతిచెందిన సంఘటన శుక్రవారం చిత్తూరు జిల్లా నాగలాపురం పంచాయతీలోని వినోభానగర్ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు నాగలాపురం పంచాయతీ వినోభానగర్‌కు చెందిన సురేష్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. 2013 సంవత్సరంలో బంగారు నగలు, ఎకరా పొలాన్ని స్టేట్ బ్యాంకులో కుదవ పెట్టి 58 వేలు రుణం తీసుకున్నాడు. అయితే రుణమాఫీలో మొదటి విడతగా 12వేలు మాత్రమే మాఫీ అయింది. మిగిలిన బాకీలన్నీ రుణమాఫీ ద్వారా తొలగిపోతాయని సురేష్ నమ్మకంతో ఎదురుచూశాడు. కానీ ఈనెల 10న బ్యాంకు అధికారులు సురేష్ ఇంటికి వెళ్లి ఈ నెల 23వ తేదీనాటికి రుణం మొత్తం చెల్లించాలని,లేకుంటే నగలు వేలం వేయడంతోపాటు ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు.ఈ సమయంలో కొంత సమయం కావాలని సురేష్ బ్యాంకు అధికారులను కోరినా ససేమిరా అనడంతోఊరు బయట ఉన్న వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నారు.