తెలంగాణ

నైజీరియన్‌పై దాడి ఘటనపై కెసిఆర్‌కు సుష్మ ఫోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: హైదరాబాద్‌లో నైజీరియన్ విద్యార్థిపై జరిగిన దాడి అంశంపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ శుక్రవారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు ఫోన్ చేసి ఆరా తీసింది. నైజీరియన్‌పై జరిగిన దాడి జాత్యాంకహార చర్య కాదని, బైక్‌ను పార్క్ చేసే విషయంలో జరిగిన గొడవే కారణమని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్టు ముఖ్యమంత్రి వివరించినట్టు సమాచారం. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోనున్నట్టు సుష్మా స్వరాజ్‌కు ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు తెలిసింది.

నీట్-2 నోటిఫికేషన్ జారీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 27: మెడికల్, డెంటల్ కాలేజీల్లో జాతీయ కోటా భర్తీకి నీట్ -2 నోటిఫికేషన్‌ను ఆల్ ఇండియా ప్రీ మెడికల్ అండ్ ప్రీ డెంటల్ టెస్టు (ఎఐపిఎంటి) బోర్డు విడుదల చేసింది. జూన్ 21 వరకూ ఆన్‌లైన్‌లోనూ, 25వ తేదీ వరకూ ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు వీలు కల్పించింది. పరీక్ష అడ్మిట్ కార్డులను జూలై 8వ తేదీ నుండి జారీ చేయనుంది. నీట్-2ను జూలై 24న నిర్వహిస్తారు. ఇందుకోసం జనరల్ అభ్యర్ధులు 1400 రూపాయిలు, ఎస్సీ/ఎస్టీలు 750 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఆంధ్రాలో విజయవాడ, విశాఖపట్టణం, తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒఎంఆర్ జవాబు పత్రాల షీట్లను ఆగస్టు 4వ తేదీన నెట్‌లో ఉంచుతారు. జవాబుల తుది కీని ఆగస్టు 7న ప్రకటిస్తారు. జూలై 24న జరిగే పరీక్షకు అభ్యర్ధులు ఉదయం 7.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవల్సి ఉంటుంది. ఆగస్టు రెండో వారంలో అడ్మిషన్లకు కౌనె్సలింగ్ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 1 నుండి తరగతులను ప్రారంభిస్తారు.

ఐ సెట్‌లో విశాఖకు 2, 9 ర్యాంకులు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 27: ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశానికి ఎపి ప్రభుత్వం నిర్వహించిన ఐ-సెట్ 2016లో విశాఖ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. టాప్ 10లో రెండు ర్యాంకులు దక్కించుకుని సత్తా చూపారు. విశాఖ నగరానికి చెందిన జె వెంకట సాయికిరణ్ 146 మార్కులతో రెండో ర్యాంకు సాధించాడు. మరో విద్యార్థిని ఎస్‌కె తకియన్ జెసుధరాజ్ 130 మార్కులతో తొమ్మిదవ ర్యాంకు దక్కించుకుంది. ఈ సందర్భంగా రెండవ ర్యాంకర్ సాయి కిరణ్ మాట్లాడుతూ తాను ఎంబిఎ చదవాలని నిర్ణయించుకున్నప్పటి నుంచి పట్టుదలతో ఐసెట్‌కు సమాయత్తమయ్యానని చెప్పారు. ఎంబిఎలో ఆర్థిక విభాగంలో తగిన ప్రావీణ్యాన్ని సంపాదించాలన్న తన తల్లిదండ్రుల ఆలోచన, ప్రోత్సాహం ఈ అద్భుత విజయానికి కారణమన్నారు. ఎంబిఎ చదువుతూనే పోటీ పరీక్షలకు హాజరవుతానని, ఆర్థిక విభాగంలో గుర్తింపు సాధించాలన్నదే తన లక్ష్యంగా పేర్కొన్నారు.

‘రైల్వేలు ఆదాయాన్ని పెంచుకోవాలి’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 27: రైల్వేలు గరిష్టస్ధాయిలో ఆదాయాన్ని పెంచుకునేందుకు, ప్రజలకు సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికను ఖరారు చేసుకోవాలని రైల్వే బోర్డు మెంబర్ ట్రాఫిక్ మహమ్మద్ జెంషెడ్ అన్నారు. శుక్రవారం రైల్ నిలయంలో వాణిజ్య చీఫ్ జనరల్ మేనేజర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సామాజకపరమైన సేవలకు ప్రాధాన్యత ఇస్తూనే రైల్వే శాఖ తన విభాగాలను ఆర్ధికంగా సుసంపన్నం చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. పనిచేసే వాతావరణంలో మార్పురావాలని, కాలంచెల్లిన విధానాలకు స్వస్తిచెప్పాలన్నారు.
వౌలిక సదుపాయాలకు ప్రాదాన్యత ఇవ్వాలన్నారు. సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులను స్వీకరించి అమలు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు రైల్వే బోర్డు తెస్తున్న మార్పులు, సవరణలను వెంటనే అమలు చేసేందుకు తగిన యంత్రాంగాన్ని ఏర్పాటుచేసుకోవాలన్నారు. పార్సిల్ వ్యాపారం, ప్రకటనల రెవెన్యూపై దృష్టిని సారించాలన్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా మాట్లాడుతూ, వ్యాగన్ల ద్వారా సరుకుల రవాణాను పెంచి ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అనుసరిస్తున్న విధానాలను వెల్లడించారు. పార్శిల్ మేనేజిమెంట్, కేటరింగ్ సర్వీసులను అభివృద్ధి చేస్తామన్నారు.

ఎంసెట్ పాస్.. ఇంటర్ ఫెయిల్!
21,257 మందికి ర్యాంకుల నిరాకరణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 27: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్‌లో ఉత్తీర్ణత సాధించినా, అర్హత పరీక్ష ఇంటర్‌లో ఫెయిల్ కావడంతో 18,143 మందికి ర్యాంకులు రాని పరిస్థితి ఏర్పడింది. మరో 3114 మంది తమ అర్హత పరీక్ష సర్ట్ఫికెట్లను సమర్పించడంలో విఫలమయ్యారు. దాంతో వారికీ ర్యాంకులు ఇవ్వలేదు. ఎంసెట్‌లో పాసైనా వేలాది మంది ఈసారి ఇంటర్ ఫెయిల్ అయ్యారు. దాంతో వారికి ర్యాంకులు ఇవ్వలేదని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ ఎన్‌వి రమణారావు పేర్కొన్నారు.. మొత్తం 18,143 మంది విద్యార్థులకు ర్యాంకులను ప్రకటించలేదని ఆయన చెప్పారు.

కంటోనె్మంట్ రహదారి మూసివేత
నిర్ణయం నవంబర్ వరకు వాయిదా
రక్షణశాఖ నుంచి సిఎంఒకు సమాచారం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 27: సికింద్రాబాద్ కంటోనె్మంట్‌లో ఒక దారిని మూసివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని రక్షణ శాఖ తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. కంటోనె్మంట్‌లో దారి మూయడం వల్ల స్థానికులు ఇబ్బంది పడుతారని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఇదివరకే రక్షణశాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై స్పందించిన రక్షణ శాఖ ఈ మేరకు కంటోనె్మంట్‌లో దారిని మూసివేసే నిర్ణయాన్ని నవంబర్ వరకు వాయిదా వేసినట్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందింది. రక్షణశాఖ మంత్రిని కలిసి ఎంపి వినోద్‌కుమార్ ముఖ్యమంత్రి రాసిన లేఖను ప్రస్తావించడంతో ఈ మేరకు రక్షణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
సాంఘిక సంక్షేమ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు
హైదరాబాద్, మే 27: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 109 సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కాలేజీల్లో అడ్మిషన్లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు గురుకులాల కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. దరఖాస్తు గడువును జూన్ 2వ తేదీ వరకూ పొడిగించినట్టు ఆయన చెప్పారు.
ఆన్‌లైన్‌లో టిఎస్‌డబ్ల్యుఆర్‌ఇఐఎస్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన పేర్కొన్నారు.