జాతీయ వార్తలు

‘విన్’రైజర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 29: తొమ్మిదో ఐపిఎల్ ఫైనల్‌లో పటిష్టమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన తుది పోరులో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని బెంగళూరును ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన సన్‌రైజర్స్ తొలిసారి టైటిల్‌ను సాధించింది. కాగా, హైదరాబాద్ ఐపిఎల్‌లో విజేతగా నిలవడం ఇది రెండోసారి. 2009లో డక్కన్ చార్జర్స్ జట్టు ఆరు వికెట్ల తేడాతో బెంగళూరుపైనే గెలిచి, టైటిల్ అందుకుంది. 2009లో మొదటిసారి, తిరిగి 2011లో ఫైనల్ చేరిన బెంగళూరు ముచ్చటగా మూడోసారి తుది పోరాటంలో విఫలమై, రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకుంది. ఒకానొక దశలో వికెట్ నష్టం లేకుండా 114 పరుగులు చేసిన బెంగళూరు, అదే స్కోరు వద్ద క్రిస్ గేల్ వికెట్‌ను కోల్పోయి, ఆతర్వాత కోలుకోలేకపోయింది. సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 208 పరుగులు సాధించగా, ఆ లక్ష్యాన్ని ఛేదించే దిశగా వేగంగా ముందుకు దూసుకెళ్లిన బెంగళూరు గమ్యానికి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయింది. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ క్రీజ్‌లో ఉన్నంత సేపు బలహీనంగా కనిపించిన సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగం వారు పెవిలియన్ చేరిన తర్వాత పుంజుకుంది. పట్టు బిగించి, చివరి వరకూ అదే ఆధిపత్యాన్ని కనబరచింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌కు కెప్టెన్ డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ శుభారంభాన్నిచ్చారు. మొదటి వికెట్‌కు 62 పరుగులు జోడించిన తర్వాత యజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో క్రిస్ జోర్డాన్ క్యాచ్ పట్టగా ధావన్ వెనుదిరిగాడు. 25 బంతులు ఎదుర్కొన్న అతను మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 28 పరుగులు చేశాడు. హార్డ్ హిట్టర్ మోజెస్ హెన్రిక్స్ కేవలం ఐదు బంతులు మాత్రమే ఆడగలిగాడు. నాలుగు పరుగులు చేసిన అతనిని యజువేంద్ర చాహల్ క్యాచ్ పట్టగా క్రిస్ జోర్డార్ పెవిలియన్‌కు పంపాడు. సెకండ్ డౌన్‌లో వచ్చిన యువరాజ్ సింగ్‌తో కలిసి జట్టు స్కోరు 100 పరుగుల మైలురాయిని దాటించిన వార్నర్ వేగంగా పరుగులు రాబడుతూ బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపాడు. అయితే, ఇక్బాల్ అబ్దుల్లా క్యాచ్ పట్టడంతో శ్రీనాథ్ అరవింద్ బౌలింగ్‌లో వార్నర్ అవుట్‌కావడంతో కోహ్లీ సేన ఊపిరి పీల్చుకుంది. వార్నర్ 38 బంతుల్లోనే 69 పరుగులు సాధించాడు. అతని స్కోరులో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. దీపక్ హూడా మూడు పరుగులకే అవుటయ్యాడు. కోహ్లీ చక్కటి క్యాచ్ పట్టగా, శ్రీనాథ్ అరవింద్ బౌలింగ్‌లో అతను వెనుదిరిగాడు. బెన్ కట్టింగ్ రన్‌రేట్‌ను పెంచుతూ, బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడగా, వేగంగా పరుగులు సాధించే ప్రయత్నంలో నమన్ ఓఝా (7) రనౌటయ్యాడు. బిపుల్ శర్మ ఐదు పరుగులకే క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో యజువేంద్ర చాహల్‌కు చిక్కాడు. కట్టింగ్ 15 బంతుల్లో 39 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. అతని స్కోరులో మూడు ఫోర్లతోపాటు నాలుగు భారీ సిక్సర్లు ఉన్నాయి. సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 208 పరుగులు సాధించగా, అప్పటికి కట్టింగ్‌తోపాటు భువనేశ్వర్ కుమార్ (1) క్రీజ్లో ఉన్నాడు.
ఆదిలో దూకుడు..
సన్‌రైజర్స్ విసిరిన భారీ సవాలును స్వీకరించిన బెంగళూరు ఓపెనర్లు ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. క్రిస్ గేల్ సన్‌రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడితే, విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడాడు. ఇరువురు 9 ఓవర్లలో వికెట్ నష్టం లేకుండా స్కోరును వంద పరుగుల మైలురాయికి చేర్చారు. జట్టు స్కోరు 114 పరుగుల వద్ద బెన్ కట్టింగ్ బౌలింగ్‌లో బిపుల్ శర్మ క్యాచ్ పట్టగా గేల్ అవుట్‌కావడంతో బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. 38 బంతులు ఎదుర్కొన్న గేల్ 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 76 పరుగులు సాధించాడు. కోహ్లి 35 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేసి, బరీందర్ శరణ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అర్ధ శతకం సాధించే క్రమంలో అతను ఈ ఐపిఎల్‌లో 1,000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. కొద్ది సేపటికే విధ్వంసకర బ్యాట్స్‌మన్ డివిలియర్స్ వికెట్ కూడా కూలింది. అతను ఐదు పరుగులు చేసి, బరీందర్ శరణ్ బౌలింగ్‌లోనే మోజెస్ హెన్రిక్స్ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. వేగంగా పరుగులు రాబట్టే సత్తావున్న ముగ్గురు వీరులు పెవిలియన్ చేరడంతో బెంగళూరు సాధించాల్సిన రన్‌రేట్ పెరిగే ప్రమాదం ఎదురైంది. 11 పరుగులు చేసిన లోకేష్ రాహుల్‌ను బెన్ కట్టింగ్ క్లీన్ బౌలింగ్ చేసి బెంగళూరు కష్టాలను మరింత పెంచాడు. షేన్ వాట్సన్ కూడా 11 పరుగులే చేసి ముస్త్ఫాజుర్ రహ్మాన్ బౌలింగ్‌లో మోజెస్ హెన్రిక్స్ క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. కాగా, ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మార్చిన స్టువర్ట్ బిన్నీ బెంగళూరుకు విజయంపై ఆశలు పెంచాడు. ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ కేవలం ఏడు పరుగులే ఇవ్వడంతో, చివరి రెండు ఓవర్లలో బెంగళూరు విజయానికి 30 పరుగుల దూరంలో నిలిచింది. 19 ఓవర్ తొలి బంతికే స్టువర్ట్ బిన్నీ (9) రనౌటయ్యాడు. ఆ ఓవర్‌లో బెంగళూరుకు 12 పరుగులు లభించాయి. చివరి ఓవర్‌లో ఆ జట్టుకు 18 పరుగులు అవసరంకాగా, ఆ కీలక ఓవర్‌ను వేసే బాధ్యతను భువనేశ్వర్‌కు వార్నర్ అప్పచెప్పాడు. మొదటి రెండు బంతుల్లో మూడు పరుగులు లభించగా, మూడో బంతికి క్రిస్ జోర్డాన్ (3) రనౌటయ్యాడు. చివరి మూడు బంతుల్లో ఆరు పరుగులు లభించగా, బెంగళూరు 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. అప్పటికి సచిన్ బేబీ 18, ఇక్బాల్ అబ్దుల్లా 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఎనిమిది పరుగుల తేడాతో సన్‌రైజర్స్ సంచలన విజయాన్ని నమోదు చేసింది.

* రాయల్ చాలెజర్స్ 9 ఓవర్లలో వంద పరుగుల మైలురాయిని చేరింది. అప్పటికి క్రిస్ గేల్ 74 పరుగులతో ఆడుతుంటే, కోహ్లీ 20 పరుగులు చేశాడు. ఆతర్వాత కోహ్లీ అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. గత 28 టి-20 ఇన్నింగ్స్‌లో అతను 50 లేదా అంతకుపైగా పరుగులు సాధించడం ఇది 18వసారి. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక అర్ధ శతకాలను చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో అతను అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. 2012లో క్రిస్ గేల్ 38 ఇన్నింగ్స్‌లో 16 హాఫ్ సెంచరీలతో నెలకొల్పిన రికార్డును కోహ్లీ బద్దలు చేశాడు.
* డేవిడ్ వార్నర్ 24 బంతుల్లోనే అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. ఐపిఎల్ ఫైనల్‌లో అత్యంత వేగవంతమైన అర్ధ శతకాల జాబితాలో అతను సురేష్ రైనాతో కలిసి మొదటి స్థానంలో నిలిచాడు. 2010 ఐపిఎల్ ఫైనల్‌లో రైనా కూడా 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.
* షేన్ వాట్సన్ ఐదో ఓవర్‌లో 19 పరుగులు సమర్పించుకున్నాడు. ఐపిఎల్ ఫైనల్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులిచ్చి బౌలర్ల జాబితాలో అతను రెండో స్థానంలో ఉన్నారు. 2012లో అల్బీ మోర్కెల్ ఒక ఓవర్‌లో 20 పరుగులిచ్చి మొదటి స్థానాన్ని ఆక్రమించాడు.

స్కోరుబోర్డు
సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ సి ఇక్బాల్ అబ్దుల్లా బి శ్రీనాథ్ అరవింద్ 69, శిఖర్ ధావన్ సి క్రిస్ జోర్డాన్ బి యజువేంద్ర చాహల్ 28, మోజెస్ హెన్రిక్స్ సి యజువేంద్ర చాహల్ బి క్రిస్ జోర్డాన్ 4, యువరాజ్ సింగ్ సి షేన్ వాట్సన్ బి క్రిస్ జోర్డాన్ 38, దీపక్ హూడా సి విరాట్ కోహ్లీ బి శ్రీనాథ్ అరవింద్ 3, బెన్ కట్టింగ్ నాటౌట్ 39, నమన్ ఓఝా రనౌట్ 7, భువనేశ్వర్ కుమార్ నాటౌట్ 1, బిపుల్ శర్మ సి యజువేంద్ర చాహల్ బి క్రిస్ జోర్డాన్ 5, ఎక్‌స్ట్రాలు 14, మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 208.
వికెట్ల పతనం: 1-63, 2-97, 3-125, 4-147, 5-148, 6-158, 7-174.
బౌలింగ్: శ్రీనాథ్ అరవింద్ 4-0-30-2, క్రిస్ గేల్ 3-0-24-0, షేన్ వాట్సన్ 4-0-61-0, యజువేంద్ర చాహల్ 4-0-35-1, ఇక్బాల్ అబ్దుల్లా 1-0-10-0, క్రిస్ జోర్డాన్ 4-0-45-3.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ బి బరీందర్ శరణ్ 54, క్రిస్ గేల్ సి బిపుల్ శర్మ బి బెన్ కట్టింగ్ 76, ఎబి డివిలియర్స్ బి మోజెస్ హెన్రిక్స్ బి బిపుల్ శర్మ 5, లోకేష్ రాహుల్ బి బెన్ కట్టింగ్ 11, షేన్ వాట్సన్ సి మోజెస్ హెన్రిక్స్ బి ముస్త్ఫాజుర్ రహ్మాన్ 11, స్టువర్ట్ బిన్నీ రనౌట్ 9, క్రిస్ జోర్డాన్ రనౌట్ 3, సచిన్ బేబీ 18 నాటౌట్, ఇక్బాల్ అబ్దుల్లా 4 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 9, మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 200.
వికెట్ల పతనం: 1-114, 2-140, 3-148, 4-160, 5-164, 6-180, 7-194.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 4-0-25-0, బరీందర్ శరణ్ 3-0-41-1, బెన్ కట్టింగ్ 4-0-35-2, ముస్త్ఫాజుర్ రహ్మాన్ 4-0-37-1, మోజెస్ హెన్రిక్స్ 3-0-40-0, బిపుల్ శర్మ 2-0-17-1.

* సన్‌రైజర్స్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఉంటే, ఈ ఫీట్‌ను సాధించిన జట్ల జాబితాలో మరోసారి చేరి ఉండేది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై 2010 మార్చి 16న 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, ఎనిమిది వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. ఈసారి ఛేజింగ్‌లో విఫలమై, ఎనిమిది పరుగుల తేడాతో ఓడింది.
కాగా, ఐపిఎల్‌లో 200 లేదా అంతకు పైగా పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన జట్ల వివరాలు
1. రాజస్తాన్ రాయల్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 217 (డక్కన్ చార్జర్స్‌పై/ 2008 ఏప్రిల్ 24న హైదరాబాద్‌లో), 2. చెన్నై సూపర్ కింగ్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 211 (రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై/ 2014 మే 14న హైదరాబాద్‌లో), 3. చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 208 (రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై/ 2012 ఏప్రిల్ 12న చెన్నైలో), 4. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 206 (చెన్నై సూపర్ కింగ్స్‌పై, 2014 ఏప్రిల్ 18న అబదబీలో), 5. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18.5 ఓవర్లలో రెండు వికెట్లకు 204 (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై/ 2010 మార్చి 16న బెంగళూరులో), 6. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 204 (కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 2010 ఏప్రిల్ 4న కోల్‌కతాలో).
* ఈసారి ఐపిఎల్‌లో భాగంగా బెంగళూరులో ఫైనల్‌సహా మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు జరిగాయి. ఎనిమిది మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్‌ను ఎంచుకుంది. మొట్టమొదటిసారి సన్‌రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది.
* సన్‌రైజర్స్ 9వ ఓవర్ ముగిసే సమయానికి కేవలం ఒక వికెట్ నష్టపోయి 88 పరుగులు చేసింది. అయితే, ఆతర్వాత తొమ్మిది ఓవర్లలో 80 పరుగులు చేసి, ఐదు వికెట్లు కోల్పోయింది.