రాష్ట్రీయం

బడుగులకు మొండిచేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30:పార్టీకి బడుగు బలహీన వర్గాలే ప్రాణమని మహానాడు వేదికగా ప్రకటించి 24 గంటలు కూడా గడవకముందే టిడిపి నాయకత్వం తన విధానం మార్చుకుంది. రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో బడుగువర్గాలకు స్థానం లేకుండా, ఇద్దరు ఆగ్రకులాల వారికి స్థానం కల్పించడంపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేంద్రమంత్రి సుజనా చౌదరి (కమ్మ), టిజి వెంకటేష్ (వైశ్య)ను రాజ్యసభ అభ్యర్ధులుగా పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు సోమవారం రాత్రి ప్రకటించారు. అంతా అనుకూలిస్తే నాలుగవ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఖరారు అయ్యే అవకాశాలున్నాయి.
చివరిసారిగా ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్ల ఎంపికలో అందరినీ మెప్పించిన టిడిపి నాయకత్వం రాజ్యసభ సభ్యుల ఎంపికలో మాత్రం అసంతృప్తి మిగిల్చింది. బీసీ, ఎస్సీలకు స్థానం లేకుండా ఇద్దరు అగ్రకులాలకే అవకాశం కల్పించడం, దానికితోడు ఇద్దరూ వ్యాపారస్తులే కావడంతో వారి ఎంపికపై నేతలు పెదవి విరిచారు. అసలే పార్టీలో వ్యాపారవేత్తలు ఎక్కువవుతున్నారన్న విమర్శల నేపథ్యంలో, ఈసారి సామాన్య కార్యకర్తలకు అవకాశం ఇచ్చి నాయకత్వం ఆ ముద్ర చెరిపివేసుకుంటుందని చాలామంది భావించారు.
నిజానికి సుజనా చౌదరి ఎంపికపై చివరి వరకూ తర్జనభర్జన జరిగింది. ఆయనపై కేసు కొనసాగుతున్న నేపథ్యంలో మళ్లీ కొనసాగిస్తారా? అన్న చర్చ జరిగింది. అయితే, చివరకు బాబు, లోకేష్ ఆయన వైపే మొగ్గు చూపారు. ఆ మేరకు సీనియర్లయిన యనమల, కెఇ వంటి నాయకులను ఒప్పించారు. ఇక వెంకటేష్ పేరు గత కొద్దికాలం నుంచీ వినిపిస్తోంది. గత ఎన్నికల ముందు పార్టీలో చేరిన ఆయనకు, టికెట్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమతోంది. బీసీలకు ఇస్తే నెల్లూరు జిల్లాకు చెందిన యాదవ నేత బీద మస్తాన్‌రావు, కర్నూలుకు చెందిన బోయ నేత బిటి నాయుడులో ఒకరికి ఇస్తారన్న సంకేతాలు వచ్చాయి. ఎస్సీలకు ఇచ్చేట్టయితే మాల వర్గానికి చెందిన గుంటూరు జిల్లా నేత, మాజీ మంత్రి జెఆర్ పుష్పరాజ్, చిత్తూరు జిల్లాకు చెందిన మాదిగ వర్గ నేత హేమలతలో ఒకరికి అవకాశం దక్కవచ్చని భావించారు. ఇటీవలి కాలంలో జూపూడి, కారెం శివాజీ వంటి మాల నేతలకు ప్రాధాన్యం ఇచ్చినందున, ఈసారి మాదిగ వర్గానికి చెందిన హేమలతకు అవకాశం దక్కవచ్చని సీనియర్లు కూడా అంచనా వేశారు.
కానీ, అటు బీసీ, ఇటు దళితులలో ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడం ఆ వర్గాలను అసంతృప్తికి గురిచేసింది. మహానాడులో బడుగులే పార్టీ ప్రాణమని చెప్పి, చివరకు ఆచరణలో తమకు మొండిచేయి చూపించడాన్ని ఆ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. బాబును కలసి బయటకు వచ్చిన పుష్పరాజ్, తన అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తానని బాబు హామీ ఇచ్చారని, అందుకు కృతజ్ఞతలు చెప్పారు. కానీ ఎంపిక తర్వాత ఆయన ఆశ ఆవిరయింది. తెలంగాణలో టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తనకు ఉన్న రెండు సీట్లలో ఒకటి బీసీ, మరొకటి ఓసీకి ఇచ్చి సామాజిక సమతుల్యం పాటిస్తే, తమ నాయకత్వం మాత్రం, ఉన్న రెండు సీట్లు ఓసీలకు ఇచ్చిందన్న వ్యాఖ్యలు సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి.

నాలుగో సీటుకు సై?

కాగా, నాలుగవ సీటునూ చేజిక్కించుకునేందుకు టిడిపి నాయకత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ వైసీపీ నుంచి 17 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరగా, నాలుగవ అభ్యర్ధి విజయం సాధించాలంటే మరో 19 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. ఒక రాజ్యసభ అభ్యర్ధి గెలవాలంటే 36 మంది ఎమ్మెల్యేల బలం కావలసి ఉంది. నేడు మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరనున్నారు. అప్పుడు 17 మంది మాత్రమే అవసరం ఉంటుంది. దీనిపై ఇప్పటికే గత వారం నుంచి కసరత్తు చేస్తున్న నాయకత్వం తాజాగా తమ పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలను రంగంలోకి దించింది. అధినేత చంద్రబాబు వారితో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పోటీపై చర్చించారు. దానికి వారంతా ఆమోదముద్ర వేశారు. దానికి స్పందించిన బాబు, అయితే ఆ బాధ్యతను మీరే తీసుకోవాలని ఆదేశించారు. ఆ ప్రకారం జలీల్‌ఖాన్, సుజయకృష్ణ రంగారావు, గొట్టిపాటి తదితరులకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. తమ పాత సహచరులతో ఓట్లు వేయించే బాధ్యత మీరే తీసుకోవాలని బాబు వారికి సూచించారు. ఆ ప్రకారంగా నెల్లూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త వేమిరెడ్డిప్రభాకర్‌రెడ్డిని నాలుగవ అభ్యర్థిగా బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆయనను పోటీకి సిద్ధంగా ఉండాలని సంకేతాలు కూడా పంపించారు. వేమిరెడ్డి ప్రస్తుతం అధినేతకు అందుబాటులోనే ఉన్నారు. అయితే, నాలుగవ అభ్యర్ధిపై అర్థరాత్రికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొంతమంది సీనియర్లు మాత్రం అది నైతికంగా మంచిదికాదని, గత ఏడాది తెలంగాణ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల్లో బలం లేకపోయినా 5వ అభ్యర్ధిని ఎలా దింపారని తమ పార్టీ ప్రశ్నించి, ఇప్పుడు తామూ అదే పనిచేస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోతాయని వాదిస్తున్నారు. నాయకత్వం మరోసారి వైసీపీ పాత ఎమ్మెల్యేలతో మాట్లాడి, అభ్యర్ధిని నేడు ఖరారు చేస్తారని ఒక సీనియర్ నేత వెల్లడించారు.
chitram...
సుజన, టిజి వెంకటేష్‌లతో కలసి విలేఖర్లతో మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు