రాష్ట్రీయం

‘జోన్’ మర్చిపోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 4: ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్ పరిశీలనలో ఉందని రైల్వే మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. ఎపి నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన ప్రభు శనివారం విజయవాడకు చేరుకుని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. ఎపి నుంచి టిక్కెట్ ఇచ్చి గెలిపించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తరువాత రైల్వే అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సురేష్ ప్రభు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మంత్రులు కామినేని శ్రీనివాస్, పుల్లారావు, ఎంపీ నాని తదితరులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్ట్‌ల పురోగతిపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశం సుమారు మూడు గంటలపాటు కొనసాగింది. ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు, రైల్వే మంత్రి సురేష్ ప్రభు సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజన తరువాత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని సురేష్ ప్రభు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీని అనేకసార్లు కలిసి, రాష్ట్ర సమస్యలను వివరించారని అన్నారు. రైల్వేపరంగా రాష్ట్రానికి అన్ని విధాలా సహకారాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైల్వే ప్రాజెక్ట్‌లను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేస్తామని ప్రభు చెప్పారు. రైల్వే శాఖలో కొత్తగా ప్రవేశపెట్టనున్న ప్రాజెక్ట్‌లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్‌గా చేపడతామని, నెల రోజుల్లో దీనికి తుది రూపం ఇస్తామని ఆయన చెప్పారు. ఎపిలో పోర్టులు, ఎయిర్‌పోర్టులను కలుపుతూ రైల్వే లైన్లను ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలియచేశారు. అలాగే కోల్‌కతా-చెన్నై, అమరావతి-బెంగళూరుల మధ్య హైస్పీడ్ రైళ్లను నడపనున్నట్టు ప్రభు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఒక లాజిస్టిక్ హబ్‌గా మారుతుందని, ఎగుమతుల, దిగుమతులకు కేంద్ర బిందువు కాబోతోందని ప్రభు చెప్పారు. రైల్వే అధికారులు ముఖ్యమంత్రితో తరచు సమావేశమవుతూ పురోగతిని వివరిస్తున్నారని అన్నారు. కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని 50కోట్ల రూపాయలతో రైల్వే ప్లాట్‌ఫారాలను తీర్చిదిద్దనున్నామని అన్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడుపుతామని హామీ ఇచ్చారు. రైలు-నీరు ప్రాజెక్ట్‌ను ఎపిలో ఏర్పాటు చేస్తామని, దీనివలన చాలామందికి ఉపాధి లభిస్తుందని అన్నారు.
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్ట్‌లు, కొత్త రైళ్ళకు సంబంధించిన అనేక అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు వినతిపత్రం అందచేశారు. రాజధాని అమరావతిని ప్రధాన రైలు మార్గాలతో కలపాలని కోరినట్టు సిఎం చెప్పారు. అమరావతి నుంచి బెంగళూరుకు సూపర్ ఫాస్ట్ రైలును నడపాలని విజ్ఞప్తి చేసినట్టు సిఎం చెప్పారు. ఎపిలో రైల్వే జోన్ ఏర్పాటు విభజన చట్టంలో ఉందని, దానిని అమలు చేయాలని కోరామని తెలిపారు. కృష్ణా పుష్కరాలకు సుమారు రెండు లక్షల 57 వేల మంది వస్తారని, సెలవు రోజుల్లో, ప్రత్యేక రోజుల్లో పుష్కరాలకు ఐదు లక్షల మంది వరకూ వచ్చే అవకాశం ఉందని సిఎం తెలియచేశారు. ఇందుకు తగినట్టుగా రైల్వే శాఖ ఏర్పాట్లు చేయాలని సిఎం ఇచ్చిన వినతిపత్రంలో కోరారు.

చిత్రం విజయవాడలో శనివారం విలేఖరులతో మాట్లాడుతున్న రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు.
చిత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్