ఆంధ్రప్రదేశ్‌

చెప్పులతో కాదు.. చీపుళ్లతో కొట్టాలి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 5 : అనంతపురం జిల్లాలో వైకాపా అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర ఐదవ రోజైన ఆదివారం కూడా ఉద్రిక్తతల మధ్య సాగింది. గత నాలుగు రోజుల పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తీవ్రతను మరింత పెంచారు. రెండేళ్లలో పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి, ఎన్నికల హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసిన చంద్రబాబును చెప్పులతో కొట్టాలని, చెప్పులు చూపించాలంటూ స్వరాన్ని పెంచారు. ఇకపై చెప్పులతో పాటు చీపుర్లు చూపించి వాటితో కొట్టిన తర్వాతైనా ఆ పెద్దమనిషికి బుద్ధొచ్చి ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారేమో’నని అన్నారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆదివారం జిల్లాలోని నంబులపూల కుంట, ఓబులదేవరచెరువు, నల్లమాడ, ముదిగుబ్బ, బత్తలపల్లి, అనంతపురం రూరల్ మండలాల మీదుగా జిల్లా కేంద్రం అనంతపురం వరకూ జగన్ రోడ్ షోలు నిర్వహించారు. అలాగే ఓడి చెరువు రోడ్ షో, అనంతపురంలో జెడ్పీ కార్యాలయం ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రెండు చోట్లా ఆయన ‘చీపుర్ల’ ప్రస్తావన చేశారు. అనంతపురం బహిరంగ సభలో మాట్లాడుతూ ఎన్నికల హామీలు నెరవేర్చకుండా సిఎం చంద్రబాబు చెప్పిన అబద్ధాలనే పదే పదే చెబుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రెండేళ్లలో పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ధ్వజమెత్తారు. మోసం చేసే వారిని రాయలసీమలో చెప్పులతో కొట్టండని అంటారు. ఆ కోవకు చెందిన చంద్రబాబును చెప్పులతో పాటు చీపుర్లతో కొట్టండి అన్నారు. సినిమాలో క్లైమాక్స్‌లో విలన్ జైలుకెళ్లినట్లుగానే ఆయన పరిస్థితి తయారవుతుందని వ్యాఖ్యానించారు. జిల్లాలో 80 మంది రైతులు, 14 మంది చేనేత కార్మికుల బలవన్మరణాలకు చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించారు. అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు పాలన ఎంతో కాలం సాగదన్నారు. పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జగన్ కోరారు. చంద్రబాబు జీతం ఇవ్వడం లేదు. ప్రజలు ఇస్తున్నారు. మీ టోపీపై ఉన్న మూడు సింహాలు చూడండి.. ఆ టోపీ వెనుక ఉన్న చంద్రబాబును చూడకండి అంటూ సూచించారు. ప్రజస్వామ్య పరిక్షణకు రానున్న రోజుల్లో కచ్చితంగా ధర్నాలు, ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

చిత్రం... అనంతపురంలోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట
బహిరంగ సభలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్, హాజరైన జనం