రాష్ట్రీయం

నీటి ప్రవాహాలపై నిర్మాణాలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 13: నీటి ప్రవాహాలు ఉండే ప్రదేశంలో భవన నిర్మాణాలకు అధికారులు ఎంత ఒత్తిడితెచ్చినా అనుమతులు ఇవ్వొద్దని, వారికి అవసరమైన పక్షంలో అండగా నిలబడతానని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పురపాలక శాఖ శతాబ్ది ఉత్సవాలకు ఆదివారం హాజరైన గవర్నర్ నరసింహన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. భవన నిర్మాణాలకు నీటి వనరులున్న ప్రదేశంలో అనుమతులిస్తే అనుకోని వర్షాలు వచ్చిన సమయంలో ఏర్పడే ఆపద నుంచి బయటపడటం ఎంతకష్టమో గుర్తించాలన్నారు. అందువల్ల భవన నిర్మాణాల అనుమతులిచ్చే అధికారులు ఒత్తిడిని అధికమించి విధులు నిర్వర్తించాలన్నారు. అధికారులను ఒత్తిడికి గురిచేయకుండా ప్రజలు కూడా సహకరించాలని కోరారు. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాదిలోపు కచ్చితంగా విద్యార్థినీ విద్యార్థులకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించాలని అదే వేదికపైవున్న జిల్లా కలెక్టర్ కాంతీలాల్‌దండే, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావును ఆదేశించారు. నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో పర్యటించిన సమయంలో ఆడపిల్లలు పాఠశాలలకు వెళ్ళేందుకు ఆసక్తి చూపడం లేదని వారితో మాట్లాడినప్పుడు అర్థమైందన్నారు. కారణాలను అనే్వషించగా మరుగుదొడ్లు ప్రత్యేకంగా లేని కారణంగా ఆడపిల్లల చదువు కొనసాగడం లేదని గుర్తించానన్నారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకోసం చేపట్టిందన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్‌ను కాంక్షిస్తూ ఉచిత విద్యను అందిస్తున్నప్పటికీ హాజరు శాతం తక్కువగా ఉండటం మంచిది కాదన్నారు. ఇది పెద్ద ప్రాజెక్టు కాదని, ప్రతి స్కూల్లో మరుగుదొడ్లు నిర్మించడం చాలా చిన్న విషయమని, అందువల్ల ఏడాదిలోపు మరుగుదొడ్లు నిర్మించాలని ఆదేశించారు. ఏడాది తరువాత జిల్లాలో పర్యటించి పరిశీలించడం జరుగుతుందన్నారు. వైద్య సదుపాయాల కోసం హైదరాబాద్, విజయవాడ ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి రాకుండా ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలను ఆధునీకరించాలన్నారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటన పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో వైద్యం ప్రతివారికి అందుబాటులో ఉండే విధంగా మెరుగుపరచాలన్నారు. అమరావతి రాజధాని గుంటూరు జిల్లా ప్రజలకు అతి సమీపంలో ఉన్నందున అన్ని సౌకర్యాలు భవిష్యత్‌లో అందుబాటులోకి వస్తాయన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రమే చేస్తుందనే ధృక్పథం విడనాడి ప్రజలు కూడా అభివృద్ధికి సహకరించాలన్నారు. స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని అందరూ అమలు చేసేందుకు కృషి చేయాలన్నారు. స్వచ్ఛత కారణంగా పర్యావరణంలో మంచి మార్పులు చోటు చేసుకుని ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవనాన్ని ఇస్తుందన్నారు. అందువల్ల ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా కేటాయించిన స్థలాల్లోనే ఉంచాలన్నారు. ప్రభుత్వం స్వచ్ఛత విషయంలో సామదాన దండోపాయాలను ఉపయోగించాలన్నారు. ప్రభుత్వం ఏమి చేసిందనే విమర్శలకు పోకుండా ప్రజలు స్వయం అభివృద్ధి చెందుతూనే రాష్ట్భ్రావృద్ధికి తమవంతు సహకారాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పాల్గొనగా, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి శిద్దారాఘవరావు, ఎంపీ రాయపాటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, గజల్ శ్రీనివాస్, కొండవీటి జ్యోతిర్మయి, శైలజాకిరణ్‌లను గవర్నర్ నరసింహన్ సన్మానించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు.

చిత్రం.. జ్యోతిప్రజ్వలన చేస్తున్న గవర్నర్ నరసింహన్