రాష్ట్రీయం

ఇంజనీరింగ్ కాలేజీలతో పరేషాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రమాణాలను పెంచేందుకు, కాలేజీ యాజమాన్యాల దోపిడీని నివారించి గాడిలోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఉన్నతాధికారుల మెడకు చుట్టుకున్నాయి. ఒక పక్క విజిలెన్స్ నివేదికలు, మరో పక్క యూనివర్శిటీల తనిఖీల నివేదికలు, ఇంకో పక్క కాలేజీల యాజమాన్యాలు ఎఎఫ్‌ఆర్‌సికి సమర్పించిన నివేదికలు, ఎఐసిటిఇ నివేదికలకు మధ్య ఏ మాత్రం పొంతన లేకపోవడంతో అధికారులు పరేషాన్ అవుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2010లో 657 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా సీట్లు 2,25,905 ఉన్నాయి. రాష్ట్ర పునర్విభజనతో తెలంగాణ పరిధిలోకి 17 ప్రభుత్వ, 337 ప్రైవేటు కాలేజీలు వచ్చాయి. మొత్తం 354 కాలేజీల్లో 96,228 సీట్లు ఉండగా అందులో కూడా 11 వేల సీట్లు మిగిలిపోయాయి. 2015 నాటికి కాలేజీల సంఖ్య 266కు తగ్గినా సీట్లు మాత్రం 1,26,468కి పెరిగాయి, దానికి తోడు కొన్ని కాలేజీలు వివిధ బ్రాంచిలలో సీట్లు పెంచమని, మరికొన్నింటిలో తగ్గించమని కోరాయి. దాంతో సీట్లు 1.50 లక్షలకు పెరిగే అవకాశం వచ్చింది. ఈ దశలో తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ దాడులకు తెరతీయడంతో వ్యవహారం కాస్తా గాడితప్పింది. విజిలెన్స్ దాడులపై కాలేజీలు మారం చేయడం ఒక దశలో ప్రభుత్వం నిర్వహించే పరీక్షలకు సైతం తాము సహకరించేది లేదని నిరాకరణ చేయడంతో మంత్రులు, శాసనసభ్యుల ఒత్తిడితో చివరికి ముఖ్యమంత్రి నేరుగా యాజమాన్యాలతో చర్చలకు ఆహ్వానించారు. యాజమాన్యాలపై తమకు ఎలాంటి కోపం లేదని కాలేజీల్లో ప్రమాణాలను పెంచడం కోసమే చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈఏడాది ఎమ్సెట్‌లో 1,03,923 మంది అర్హత సాధించారు. అందులో కూడా 80వేల మందికి మించి ఇంజనీరింగ్‌లో చేరే అవకాశం ఉండబోదని అధికారుల అంచనా. ఈ క్రమంలో కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు రాకుండా చూడటం ఒక ఎత్తయితే, ఉన్న కాలేజీల్లో ఎంత మేరకు సదుపాయాలున్నాయో ఆ మేరకే సీట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మొత్తం కసరత్తు అధికారులకు పెద్ద తలనొప్పిగా తయారైంది. వరుసగా జరిగిన రెండు సమావేశాల్లో అధికారులు అంతా భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు సమాచారం. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయలేని అధికారులు ఒకరిని ఒకరు పరస్పర నిందారోపణలు చేసుకున్నట్టు తెలిసింది. ఈ తలనొప్పి ఎలా వదులుతుందా అన్న ఆలోచనల్లో అధికారులు పడ్డారు. కాలేజీల్లో సీట్లు తగ్గిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో అర్ధం కావడం లేదు, అలాగే కాలేజీలపై సరైన ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోకపోతే సిఎం నుండి ఎలాంటి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా మరో 166 కాలేజీలకు ఎఎఫ్‌ఆర్‌సి షోకాజ్‌లను ఇచ్చింది. ఈనెల 16 నుండి తమ ముందు హాజరై వాదనలు వినిపించాలని ఆదేశించింది. ఇంకో పక్క 22 నుండి ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యేనా అనే మీమాంసలో అధికారులు ఉన్నారు. తాజా కసరత్తులతో కాలేజీల్లో సీట్ల సంఖ్యను 85వేలకు కుదించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. మరో పక్క ఇంజనీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లకు సైతం ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.