రాష్ట్రీయం

కేబినెట్‌లో మార్పులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూరె్తైన తరువాతే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం దృష్టి సారించనున్నట్టు తెలిసింది. తెలంగాణ ఆవిర్భావం, తెరాస ప్రభుత్వ ఏర్పాటు జరిగి రెండేళ్లవుతోంది. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని చాలారోజులుగా ఊహాగానాలు సాగుతున్నా, ముఖ్యమంత్రి మాత్రం ఆ దిశగా ఎలాంటి ఆలోచన చేయలేదు. ఉప ముఖ్యమంత్రి రాజయ్యను తొలగించి కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిని చేయడం వినా, కేబినెట్‌లో ఎలాంటి మార్పులు చేర్పులూ జరగలేదు. శాఖల్లో మార్పులు చేర్పులు చేసినా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కెసిఆర్ దృష్టి సారించలేదు. రాష్ట్రంలో దసరానాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అప్పటికి ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు అవుతుంది. అంటే, సగం పాలన పూరె్తైనట్టన్నమాట. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత కొన్ని జిల్లాలకు ఇద్దరేసి మంత్రులుంటే, కొన్ని జిల్లాలకు అసలు మంత్రులే ఉండని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి పనితీరు, కులాల సమీకరణ, వివిధ కారణాలతో కేబినెట్‌లో కొంత మార్పులు చేర్పులు చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రసమయి బాలకిషన్‌ను కేబినెట్‌లోకి తీసుకోనున్నట్టు ముఖ్యమంత్రి గతంలోనే బహిరంగంగానే ప్రకటించారు. కొప్పుల ఈశ్వర్‌ను తొలుత స్పీకర్ పదవి చేపట్టాలని సిఎం కోరారు. కొప్పుల ఈశ్వర్ తనకు మంత్రి పదవిపైనే ఆసక్తి ఉందని చెప్పడంతో సిరికొండ మధుసూధనాచారిని స్పీకర్‌గా నియమించారు. కొప్పుల ఈశ్వర్‌ను చీఫ్ విప్‌గా ప్రకటించినా ఆయన తొలుత ఆసక్తి చూపలేదు. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసే సమయంలో తప్పకుండా అవకాశం కల్పిస్తానని హామీ ఇవ్వడంతో చీఫ్ విప్‌గా బాధ్యతలు చేపట్టారు. మంత్రివర్గంలో స్థానం కోసం కొప్పుల ఈశ్వర్ ఎదురు చూస్తున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలను కేబినెట్ ర్యాంకుతో పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించారు. కోర్టు కేసు కారణంగా వారిని పదవినుంచి తొలగించాల్సి వచ్చింది. ఈ ఐదుగురూ కూడా మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని ఆశిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించలేదు. తరుచుగా ఈ అంశంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఒక మహిళా మంత్రి తప్పనిసరి అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణ ఎన్నికల్లో తెరాసకు 63 స్థానాలు లభించాయి. ఇప్పుడు మరో 21మంది జత కలిశారు. కాంగ్రెస్, తెదేపాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేల్లో కొందరు మంత్రివర్గంలో స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి తెరాసలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. గుత్తా తెరాసలో చేరి రాజీనామా చేస్తే మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం మంత్రుల సంఖ్య 18కే పరిమితం కావాలి. అయితే కొత్తవాళ్లకు అవకాశం కల్పించాలంటే, మంత్రుల సంఖ్య పెరగకున్నా కొంతమందిని కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత మార్చే అవకాశం ఉందని పార్టీలో బలంగా వినిపిస్తోంది.