రాష్ట్రీయం

అందరికీ ఆదర్శం ఆ కార్పొరేటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్ అంటే మంత్రికి తక్కువ, ఎమ్మెల్యేకు ఎక్కువ అన్నమాట.. కొండొకచో ఎమ్మెల్యే అయినా కాస్త తగ్గుతారేమో తప్ప హైదరాబాద్ కార్పొరేటర్ సీనే వేరు. ఓ మినీ మినిస్టర్ అన్నమాట.. బుగ్గకారు ఉన్నా లేకున్నా.. కారు నెంబర్ ప్లేట్‌పై రెడ్ స్టిక్కర్‌తో ‘జిహెచ్‌ఎంసి కార్పొరేటర్’ అని ఉంటే చాలు, ఆ డాబూ దర్పం తీరు చెప్పనక్కరలేదు. మడతలు లేని తెలతెల్లని ఖాదీ వస్త్రాలు.. మెడలో బంగారు గొలుసులు.. చేతికి బ్రాస్‌లెట్‌లు.. ఖరీదైన సెల్‌ఫోన్ చేతబట్టుకుని ఖరీదైన కారులో నుంచి దిగకపోతే ఆ పదవికే అవమానం అన్న వాతావరణం. కానీ ఇలాంటి ‘రాజ’్ధనిలో ఈ ఆర్భాటాలేవీ లేకుండా, హంగులకు దూరంగా, నిరాడంబరంగా గడిపే కార్పొరేటర్ కూడా ఉంటాడంటే కొంత విస్మయంగానే ఉంటుంది మరి. ప్రజలచే ఎన్నుకోబడి, ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తూ ఇతర కార్పొరేటర్లకు ఆదర్శమయ్యాడు హయత్‌నగర్ కార్పొరేటర్ సామ తిరుమల్‌రెడ్డి. కార్పొరేటర్ అంటే బడాబాబేం కాదని, ప్రజలతో మమేకం కావల్సిన కామన్‌మాన్ అని నిరూపించిన ఈ కార్పొరేటర్ ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికుడు ధరించే డ్రెస్ వేసుకుని తన డివిజన్‌లోని అన్ని ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను నేరుగా అడిగి తెల్సుకుని పరిష్కరిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకుంటున్నాడు. ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకే తన డివిజన్‌లోని వీధివీధి వాడవాడ తిరుగుతూ ఎక్కడైనా బహిరంగంగా చెత్త వేసినట్లు కన్పిస్తే, దాన్ని స్వయంగా తొలగించి, చెత్తవేసేవారికి సర్ది చెప్పటం ఇతని దిన చర్య. స్థానిక పారిశుద్ధ్య కార్మికులతో కలిసి అవసరమైతే నాలాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు, చెత్తాచెదారాన్ని సైతం తొలగిస్తూ తన నిరాడంబరతను చాటుకుంటున్నాడు. ఇప్పటికే జిహెచ్‌ఎంసి నగరంలోని అన్ని ఇళ్లకు అందజేసిన ఆకుపచ్చ, నీలం రంగు డబ్బాల్లోనే తడి, పొడి చెత్తలను వేర్వేరుగా వేయాలని ఇంటింటికి తిరుగుతూ చెబుతుంటాడు. హయత్‌నగర్ డివిజన్‌ను గ్రేటర్ పరిధిలో సమస్య రహితమైన ప్రాంతంగా, ఆదర్శవంతమైన డివిజన్‌గా తీర్చిదిద్దటమే ధ్యేయంగా పనిచేస్తూ ఇతర కార్పొరేటర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. వీటితో పాటు డివిజన్‌లో అమలవుతున్న ఇతర అన్ని రకాల కార్యక్రమాలను సైతం దగ్గరుండి స్వయంగా పరిశీలిస్తూ, జిహెచ్‌ఎంసి అధికారులకు, సిబ్బందికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంటాడు. ఈ రకంగా ఓ కార్పొరేటర్ ఓ సామాన్యుడిగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెల్సుకుని పరిష్కరిస్తూ ప్రజాసేవలో నిమగ్నం కావటం నేటి రాజకీయాల్లో ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ.. ప్రజాసేవను నిజంగా చేసి చూపించటం అంటే ఏమిటో తిరుమలరెడ్డిని చూసి నేర్చుకోవలసిందే.

చిత్రం జిహెచ్‌ఎంసి పారిశుద్ధ్య కార్మికుడి డ్రెస్‌లో ఇతర కార్మికులతో కార్పొరేటర్ తిరుమల్‌రెడ్డి