రాష్ట్రీయం

కార్పొరేషన్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, డిసెంబర్ 13: బ్రాహ్మణుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేషన్ సిఎండి చెంగవల్లి వెంకట్ పిలుపునిచ్చారు. అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో సింహాచలం స్వామి కల్యాణ మండపం ప్రాంగణంలో ఆదివారం బ్రాహ్మణ సదస్సు జరిగింది. సమాఖ్య అఖిల భారత కార్యదర్శి ఎంఎల్‌ఎన్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్పొరేషన్ సిఎండి చెంగవల్లి వెంకట్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు ఉద్దేశ్యాన్ని, లక్ష్యాలను సభకు వివరించారు. బాల్యం నుండి చివరి దశ వరకు బ్రాహ్మణులకి ఎన్ని విధాలుగా సహకారం అందించాలో కార్పొరేషన్‌లో నిర్దేశించిన అంశాలను ఆయన వివరించారు. ఇంతవరకు కార్పొరేషన్ ఏర్పాటు చేశాక 31 సమావేశాలు నిర్వహించినట్లు, సింహాచలంలో జరుగుతున్న సభ 32వదిగా చెప్పిన ఆయన ఈ ఆరు నెలల కాలంలో కార్పొరేషన్ సేవలను ఏవిధంగా ఉపయోగించుకోవాలన్న విషయమై బ్రాహ్మణులను జాగృతం చేయడానికే ఎక్కువ సమయం పట్టిందన్నారు. విద్య, ఉపాధి, వైద్యం వంటి సేవలు కల్పించేందుకు కార్పొరేషన్ ముందుంటుందన్నారు. ఇటీవలే క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీని 20 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశామని, ఈ సొసైటీ ద్వారా స్వయం ఉపాధి కోసం రుణాలు కూడా మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 12వేల 700 దరఖాస్తులు అందాయని, వీటిలో సుమారు 7వేల మంది అర్హులైన బ్రాహ్మణులకు వివిధ రూపాల్లో ఆర్థిక సాయం అందించామన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా పారదర్శకంగా బ్రాహ్మణులకు సేవ చేసేందుకు కార్పొరేషన్ చిత్తశుద్ధితో పని చేస్తుందని, బ్రాహ్మణులు కూడా నిజాయితీగా కార్పొరేషన్ సేవలను వినియోగించుకోవాలన్నారు. అనేక బ్రాహ్మణ సంఘాలు తమ ద్వారా సేవలు అందించమని ముందుకొచ్చాయని చెప్పిన ఆయన సంఘ నిర్వాహకులపై సభాముఖంగా సెటైర్లువేస్తూ తనదైన శైలిలో భవిష్యత్‌లో తమపై ఒత్తిళ్లు రానివ్వకుండా జాగ్రత్తపడ్డారు. సిఎండి ఆద్యంతం తన ప్రసంగంలో కార్పొరేషన్ సేవలను వినియోగించుకోవడంలో బ్రాహ్మణులు తగినంత శ్రద్ధ చూపడం లేదన్నారు. అనంతరం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి సభ కృతజ్ఞతలు తెలియజేసింది. సభలో అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య ముఖ్య సలహాదారు కోట శంకరశర్మ మాట్లాడుతూ బ్రాహ్మణులు సమాజంలో శక్తిగా ఎదగాలని, అందుకు అంతా ఐకమత్యంతో ఉండాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి కె సతీష్ శర్మ, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు ఎన్ కామేష్, రాష్ట్ర ప్రభుత్వ వైదిక సలహా మండలి సభ్యుడు మోర్త సీతారామాచార్యులు, పండితుడు యద్దనపూడి అయ్యన్నపంతులు పాల్గొన్నారు.

సభలో మాట్లాడుతున్న కార్పొరేషన్ సిఎండి చెంగవల్లి వెంకట్