రాష్ట్రీయం

మూడేళ్ల ముందే ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: అమరావతిలో రాజధానిని వ్యతిరేకించిన వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ ఇకపై అక్కడి నుంచే రాజకీయ కార్యకలాపాలు ముమ్మరం చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో మూడేళ్ల ముందుగానే ఎన్నికల ప్రచారానికి తెరలేపనున్నారు. అందులో భాగంగానే గడప గడపకూ వైఎస్సార్‌కాంగ్రెస్ నినాదాన్ని అందుకుంటున్నారు. సచివాలయ ఉద్యోగులు కూడా విజయవాడకు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతున్నందున ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ కూడా అందుకు అనుగుణంగా తన వ్యూహం మార్చుకుంటోంది. ఇప్పటివరకూ వైసీపీ కార్యకలాపాలు, ముఖ్యుల సమావేశాలు, నిర్ణయాలన్నీ హైదరాబాద్ నుంచే వెలువడేవి. అయితే, విజయవాడ కేంద్రంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయంగా పట్టుబిగిస్తుండటం, ఉద్యోగుల తరలింపులో కూడా పైచేయి సాధించడం, అమరావతి పరిసర ప్రాంతాల్లో భూ కుంభకోణాలు, కుల రాజకీయాలు పెరుగుతున్న పరిణామాలను గమనించిన జగన్, హైదరాబాద్‌లో ఉండటం కంటే విజయవాడ కేంద్రంగానే రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం మేలన్న నిర్ణయానికి వచ్చారు.
మరోవైపు పార్టీ నేతలను అధికార టిడిపి ప్రలోభపెడుతున్న క్రమంలో నియోజకవర్గ స్థాయిలో కొంత స్తబ్దత నెలకొంది. దీనితో ఎవరు ఉంటారో, ఎవరు వెళతారో తెలియని గందరగోళ పరిస్థితి. ఈ గందరగోళానికి తెరదింపి, పార్టీ నేతలు, శ్రేణులను నిరంతరం జనంలోనే ఉండేలా జగన్ కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగా వైఎస్ జయంతి సందర్భంగా జులై 8 నుంచి గడప గడపకూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయవాడ బందరు రోడ్డులోని ఏ-1 కనె్వన్షన్ సెంటర్‌లో విస్తృత స్థాయి సమావేశం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏకబిగిన నిర్వహించనున్నారు.
పైకి ఇది సాధారణంగా రాజకీయ పార్టీ నిర్వహించే కార్యకర్తల చైతన్య కార్యక్రమంగా కనిపిస్తున్నప్పటికీ, దాని వెనుక సుదీర్ఘ రాజకీయ లక్ష్యం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారి మాటలను బట్టి, ఈ కార్యక్రమం ఎన్నికలకు మూడేళ్ల ముందస్తు ప్రచారంగానే స్పష్టమవుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ఎమ్మెల్యే, ఇంచార్జి, నగర, పట్టణ, గ్రామ కోఆర్డినేటర్లు తన నియోజకవర్గ పరిధిలోని పట్టణ, మండల, గ్రామాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి, బాబు అవినీతి పాలనలో జరిగిన లక్షా44 వేల కోట్ల అవినీతికి సంబంధించి ముద్రించిన కరపత్రాన్ని స్వయంగా అందచేయాలి. వారితో మాట్లాడాలి.
దీనికి కాలపరిమితి అంటూ లేదు. ఒక నాయకుడు తన నియోజకవర్గంలో ప్రతి ఇంటి తలుపు తట్టాల్సి ఉంటుంది. ఆ సందర్భంగా వచ్చే ఫిర్యాదులను నమోదు చేసుకుంటారు. సదరు నాయకుడు ఇంటింటికీ వెళుతున్నారా లేదా అన్న అంశంపై సొంత మీడియా ప్రతినిధులతోపాటు, ప్రైవేటు సర్వే సంస్థల ప్రతినిధుల పర్యవేక్షణ ఉంటుంది.
ఒక నాయకుడు నియోజకవర్గంలోని ప్రతి తలుపు తట్టాలంటే కనీసం రెండు, మూడు నెలలు పడుతుంది. ఎన్నికల సమయంలో అయితే సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోనే ప్రచారం చేయవలసి ఉంటుంది. కానీ ఇలా అయితే, ఎక్కువ వెసులుబాటు లభిస్తుందని పార్టీ యోచన.
బాబు అవినీతి పాలనపై తాము ముద్రించిన కరపత్రం చదవితే, అందులో 40 శాతం తటస్థుల్లో మార్పు వచ్చినా అనుకున్న లక్ష్యం సాధిస్తామన్న అంచనా ఈ కార్యక్రమ రూపకల్పనలో కనిపిస్తోంది. జగన్ లక్ష్యం కూడా అదేనని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఒకరకంగా ఇది మూడేళ్లకు ముందునుంచే ఎన్నికల ప్రచారంలా భావించవచ్చని విశే్లషిస్తున్నారు.