రాష్ట్రీయం

ఆరు అంచెల్లో తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12:సచివాలయం తరలింపునకు రంగం సిద్ధమైంది. ఫైళ్లు, ఫర్నిచర్, ఇతర సామగ్రి తరలింపునకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఆరంచెల విధానాన్ని ఖరారు చేసింది. మరోవైపు సచివాలయంలో ఏపి ఉద్యోగులను ఎవర్ని కదిలించినా, రేపో మాపో తరలిపోక తప్పదనేట్టే మాట్లాడుతున్నారు. హైదరాబాద్‌కు వీడ్కోలు పలుకుతున్నామనే భావన వారి మాటల్లో కనిపిస్తోంది. మరో పదిహేను రోజుల్లో దాదాపు 122 శాఖల్లో పనిచేస్తున్న 13,300 మంది ఉద్యోగులు, లక్ష ఫైళ్లతో అమరావతికి తరలివెళ్లనున్నారు. పనిలోపనిగా 11 వేలకు పైగా కుర్చీలు, టేబుళ్లు, కంప్యూటర్లు కూడా తరలిపోనున్నాయి. సచివాలయంలో 32 శాఖల్లో 2304 మంది
ఉద్యోగులు, మరో 90 శాఖల్లో 11,020 మంది ఉద్యోగులు 340 కి.మీ దూరంలో ఉన్న అమరావతి రాజధానికి వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ముందుగా ఎవరెవరు వెళ్లాలో ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక తయారుచేస్తోంది. పోలీసు శాఖ అధీనంలో ఉన్న లక్షకు పైగా ఆయుధాలను మంగళగిరిలోని పోలీస్ బెటాలియన్‌లోని స్ట్రాంగ్ రూంలలో భద్రపరచనున్నారు. దాదాపు 500 ట్రక్కుల్లో మంగళగిరి పోలీసు బెటాలియన్, గ్రేహౌండ్స్ పోలీసు బలగాల భద్రత మధ్య అమరావతి రాజధాని ప్రాంతానికి అన్ని శాఖల ఫైళ్ల తరలింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.
అన్ని శాఖల అధిపతులు, డైరెక్టరేట్లు, కమిషనరేట్ల ఉన్నతాధికారులు, సచివాలయం ఉద్యోగులు జూన్ 27వ తేదీన అమరావతి రాజధాని ప్రాంతంలో తమకు నిర్దేశించిన కార్యాలయాల్లో రిపోర్టు చేయాల్సిందేనని, ఇందులో ఎటువంటి మినహాయింపులు ఉండవని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తేల్చి చెప్పడంతో ఏపి సచివాలయం తరలింపు పనులు వేగవంతమయ్యాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఠక్కర్, సీనియర్ ఐఎఎస్ అధికారి ఎల్‌వి సుబ్రహ్మణ్యం 13వ తేదీ సోమవారం సచివాలయంలో సమావేశమై ఆరు అంచెల విధానాన్ని ఖరారు చేస్తారు. సచివాలయం తరలింపుబాధ్యతను అప్పగించిన సీనియర్ ఐఎఎస్ అధికారి లింగరాజ్ పాణిగ్రాహి అనారోగ్యంతో ఉండడంతో ఆయన స్ధానంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యంను నియమించారు. వెలగపూడిలో 45 ఎకరాల స్ధలంలో 27 ఎకరాల విస్తీర్ణంలో శరవేగంగా నిర్మిస్తున్న సచివాలయం బ్లాక్‌ల్లో ఏ శాఖకు ఏది కేటాయించాలో సోమవారం నుంచి ఖరారు చేస్తారు. రాష్ట్రప్రభుత్వం విడుదల చేయనున్న మార్గదర్శక సూత్రాల ప్రకారం ఏ శాఖ ఫైళ్లు, ఫర్నీచర్ ఆ శాఖ సిబ్బందిదే. గత రెండేళ్లుగా ఒక లక్ష ఫైళ్లను డిజిటలైజ్ చేశారు. ఈ ఫైళ్లు 70 లక్షల పేజీలు ఉంటాయని అంచనా. వీటిని స్కాన్ చేశారు. కాని కొన్ని శాఖల్లో ఫైళ్లు ఇంకా మ్యానువల్‌గానే ఉన్నాయి. హోం, రెవెన్యూ శాఖల్లో ఇంకా ఫైళ్ల డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చెన్నై నుంచి కర్నూలుకు, కర్నూలు నుంచి హైదరాబాద్‌కు తరలించిన కొన్ని పాత ఫైళ్లలో కీలకమైనవి ఉన్నాయి. వీటిని డిజిటలైజ్ చేశారు. కొన్ని ముట్టుకుంటే చినిగిపోయేవిధంగా ఉన్నాయి. వీటిని భద్రపరిచేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటోంది.
ఒక శాఖ ఫైళ్లు, ఫర్నిచర్ బదలాయింపు ఒక రోజులో పూర్తి కావాలి. ఇక్కడి నుంచి బయలుదేరిన ఆరు గంటల్లో వెలగపూడి లేదా కేటాయించిన కార్యాలయానికి చేరాలి. అదే రోజు ఆరు గంటల్లో అన్‌లోడ్ చేసి నిర్దేశిత చాంబర్‌లో అమర్చాలి. ఈ నెలాఖరుకు హైదరాబాద్‌లో ఉన్న ఏపికి చెందిన ఐదు వందల మంది పోలీసు అధికారులు కూడా తరలనున్నారు.
వెలగపూడికి తరలివెళ్లే విషయమై సాధారణ పరిపాలన శాఖ రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేస్తుంది.
ప్రతి శాఖాధికారి ఉద్యోగులతో సమావేశమై హైదరాబాద్ నుంచి వెంటనే ఎంతమంది తరలివెళ్లాలి, తర్వాతి దశలో ఎవరు వెళ్లాలి అనే అంశాల్ని నిర్ణయించాలి.
తాత్కాలిక సచివాలయం లేదా ఇతర నిర్దేశిత కార్యాలయాల్లో ఏ శాఖకు ఎక్కడ ఏ చాంబర్‌ను కేటాయించారనే విషయాన్ని ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. సచివాలయంలోని ఆయా శాఖల ఉద్యోగులు తమ ఫైళ్లకు తామే బాధ్యత వహించాలి.
ఫైళ్లు, ఫర్నిచర్, ఇతర మెటీరియల్‌ను దగ్గరుండి ప్యాక్ చేయించే బాధ్యతను సిబ్బందికే అప్పగిస్తారు.
అమరావతికి వెళ్లే ఉద్యోగులకు ఏడు రోజుల క్యాజువల్ సెలవు ఇస్తారు.
డిజిటలైజ్డ్ ఫైళ్లు, మ్యానువల్ ఫైళ్లను అమరావతికి ట్రక్కుల్లో భద్రత మధ్య తరలిస్తారు.
మొత్తం శాఖలు 122
సచివాలయంలో శాఖలు 32
సచివాలయంలో సిబ్బంది 2,304
డైరెక్టరేట్లు, కమిషనరేట్లు 90
వాటిలో సిబ్బంది 11,020
ఫైళ్లు లక్ష (సుమారు)
కుర్చీలు, బల్లలు, కంప్యూటర్లు 11,000
పోలీస్ ఆయుధ సామగ్రి లక్ష (సుమారు)