రాష్ట్రీయం

సంస్కరణలకు ఏపి ప్రభుత్వం శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 13: రాష్ట్రాన్ని అత్యధిక ఆర్థిక ఆదాయం అర్జించే శక్తిగా తీర్చిదిద్దటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టనుంది. ప్రైవేటు రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ విద్యారంగంలో గుణాత్మక సంస్కరణలు చేపట్టడానికి ఈ నెల 15న మలేసియా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోబోతోంది. ఆంధ్రప్రదేశ్‌ను సమ్మిళిత, స్థిరమైన ఆర్థికశక్తిగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం నిశ్చయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం (ఎపి ఎస్‌డిపిఎస్), మలేసియా ప్రధాన మంత్రి అజమాయిషీలో ఉండే పెమాండు మధ్య ఈ ఒప్పందం జరగనుంది. విజయవాడలో మంగళవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పెమాండు ముఖ్య కార్య నిర్వహణాధికారి, మలేసియా ప్రధాని ప్రత్యేక సలహాదారు డాక్టర్ ఇద్రిస్ జలా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తారు. గత నెల 24న కౌలాలంపూర్‌లో నీతి ఆయోగ్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్న తరువాత జరుగుతున్న భేటి ఇది. ప్రభుత్వరంగ సంస్థలు మరింత సమర్థంగా పని చేయటానికి కేంద్రం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా పెమాండుతో కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ కార్యక్రమాలు, వ్యూహాత్మక అభివృద్ధి ప్రణాళికల పర్యవేక్షణ, అమలుకు పెమాండుతో కలిసి పని చేస్తు న్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావటం ప్రస్తావనార్హం. రాష్ట్ర ఆదాయం పెంచి అభివృద్ధి సూచికలకు అనుగుణంగా పని చేసేందుకు మలేసియా తరహా పెమాండు నమూనాను అమలు చేయటానికి ఫోకస్ అప్రోచ్‌ను అనుసరించాలని నిర్ణయించారు. వివిధ ప్రాజెక్టుల అమలు, రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు పెమాండు మార్గదర్శకం చేస్తుంది. 2029 నాటికి ఏపిని దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. అలాగే 2050 నాటికి రాష్ట్రాన్ని ప్రపంచంలో పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి మార్గదర్శనం చేస్తూ, లక్ష్యాలను సాధించేందుకు పెమాండు దోహదపడుతుంది. విస్తృతంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించటం, సంప్రదింపులు జరపటం లాంటి అంశాలపై పెమాండు దృష్టి పెడుతుంది. మలేసియా తరహా ల్యాబ్ విధానాన్ని పెమాండు ఇక్కడ ప్రోత్సహిస్తుంది. శ్రీఘ్రగతిన ఫలితాలు సాధించేందుకు అవసరమైన మెథడాలజీని పెమండు అందిస్తుంది. సిబ్బందికి ఇందుకు అవసరమైన శిక్షణ, నైపుణ్యాలను సమకూరుస్తుంది. ప్రతి మంత్రిత్వ శాఖలో జరిగే అభివృద్ధిని ఒక డ్యాష్ బోర్డుకు అనుసంధానిస్తూ సమాచారాన్ని అందులో పొందుపరుస్తుంది. వారం వారం అభివృద్ధిని పర్యవేక్షిస్తూ స్కోర్ కార్డులను వెల్లడిస్తుంది. పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మెరుగుపర్చుకోవటానికి ఈ చర్యలు ఉపయోగపడతాయి. పరిపాలన, పనితీరులో గుణాత్మక మార్పులు తీసుకురావటానికి కేవలం 100 మందితో కూడిన బృందం పెమాండులో ఉంటుంది. మొత్తం 12 సెక్టార్లు, 7 నివేదిక సమర్పణ బృందాలు, 6 విధాన రూపకల్పన బృందాలు ఇందులో ఉంటాయి. 169 ప్రభుత్వ రంగ సంస్థలు, 23 మంత్రిత్వ శాఖలకు ఈ బృందం సహాయపడుతుంది. ప్రభుత్వ పాలనా సంస్కరణలు, ఆర్థిక సంస్కరణల ప్రగతిని పెమాండు పర్యవేక్షిస్తుంది. ప్రధాన మంత్రికి, ఇతర మంత్రులకు ప్రణాళికాపరమైన సూచనలు చేస్తుంది. వారు స్వతంత్రంగా వ్యవహరించేందుకు తోడ్పడుతుంది. ప్రస్తుతం పెమాండుకు సీఈఓగా ఉన్న డా ఇడ్రిస్ జలా మలేసియా ప్రధాన మంత్రివర్గంలో ఏ పోర్ట్ఫులియో లేకుండా నేరుగా మంత్రి హోదాను కలిగి ఉన్నారు. 2005లో మలేసియా ప్రభుత్వం మలేసియన్ ఎయిర్‌లైన్స్ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో కీలక భూమికి పోషించారు. మలేసియా ఎయిర్‌లైన్స్ 400 మిలియన్ డాలర్ల నష్టాల నుంచి 260 మిలియన్ డాలర్ల లాభాలకు చేర్చటంలో ముఖ్యపాత్ర వహించారు. 2009లో ఆయన్ని మలేసియా ప్రభుత్వం పెమాండు సీఈఓగా నియమించింది.

ఎపికి ఎన్నికల
సంఘాన్ని నియమించండి
బాబును కోరిన అఖిల భారత పంచాయత్ పరిషత్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 13: ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నియమించాలని అఖిల భారత పంచాయత్ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడును కోరారు. ఎన్నికల సంఘాన్ని నియమించిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిఎంకు లేఖను రాసినట్లు జాస్తి తెలిపారు. 2014 డిసెంబర్ 31న రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఉన్న రమాకాంత్‌రెడ్డి రిటైరైన తర్వాత మళ్లీ ఆ పదవిలో ఎవరినీ నియమించలేదని సిఎం దృష్టికి తెచ్చారు. గ్రామ స్వరాజ్యం కోసం 29 విశేషాధికారాలను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు బదిలీ చేసిందని తెలిపారు. ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే ఎన్నికల సంఘాన్ని నియమించాలని, అనంతరం ఖాళీగా ఉన్న వాటికి ఎన్నికలు జరపాలని కోరారు.
అణు ఒప్పందం
వచ్చే ఏడాది అమలు
* అమెరికా రాయబారి
రిచర్డ్ వర్మ విశ్వాసం
వాషింగ్టన్, డిసెంబర్ 13: దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఇండో-అమెరికా పౌర అణు ఒప్పందం వచ్చే సంవత్సరం అమలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందం అమలుకు కావలసిన దాదాపు అన్ని చర్యలు ఇదివరకే తీసుకోవడం జరిగిందని, ఇంకా మిగిలినవి ఏవైనా కొన్ని ఉంటే అవి త్వరలోనే పూర్తవుతాయని భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ చెప్పారు. ‘2016లో ఈ చారిత్రాత్మక పౌర అణు ఒప్పందం అమలు దిశగా మేము వేగంగా ముందుకు సాగుతామన్న విశ్వాసం నాకు ఉంది’ అని వర్మ ఇక్కడ భారతీయ జర్నలిస్టుల బృందంతో అన్నారు. 2016 తొలి అర్ధ సంవత్సరంలో పౌర అణు ఒప్పందం విషయంలో చాలా పురోగతి ఉంటుందని కూడా ఆయన చెప్పారు.
నకిలీ లీజు డాక్యుమెంట్లతో
రూ.6.5కోట్ల రుణం!
* 12మందిపై ఆంధ్రా బ్యాంక్
ఏజిఎం ఫిర్యాదు
గుడివాడ, డిసెంబర్ 13: నకిలీ లీజు డాక్యుమెంట్లతో ఆంధ్రా బ్యాంక్ గుడివాడ బ్రాంచి నుండి రూ.6.5కోట్ల రుణం పొందిన 12మందిపై ఆ బ్యాంక్ ఏజిఎం చలపతి ఆదివారం రాత్రి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం రిజిస్ట్రేషన్ లీజు డాక్యుమెంట్లు కాకుండా నకిలీ అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లతో కొలెట్రల్ సెక్యూరిటీని పదింతలుగా పెంచి 2010, 2011, 2012 సంవత్సరాల్లో రుణాలు పొందారు. దీన్ని గుర్తించిన బ్యాంక్ అధికారులు దర్యాప్తు జరిపి 12మంది బ్యాంక్‌ను మోసగించినట్టుగా భావించి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ వ్యవహారంలో పలువురు బ్యాంక్ అధికారులు కూడా అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.