రాష్ట్రీయం

తెలుగు రైతులు బిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20 : సోమవారం ఏరువాక పున్నమి కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైతులు తమ భూములను సాగు చేయడం ప్రారంభించారు. గత ఇరవై ఐదుల రోజుల నుండి అడపాదడపా కురిసిన వర్షానికి భూమి చదును చేసుకున్నారు. తెలుగు సాంప్రదాయం ప్రకారం జైష్టమాసంలో వచ్చే పున్నమిని ఏరువాక పున్నమి అంటారు. సోమవారం ఏరువాకపున్నమి కావడంతో విత్తనాలను వేయడం ప్రారంభించారు. ఏరువాక పున్నమిరోజు విత్తనాలు వేస్తే పంటలు పుష్కలంగా పండుతాయని, తెగుళ్లబాధ, చీడపీడల బాధ ఉండదని నమ్ముతారు. అందువల్లనే లాంఛనంగా ఈరోజు రెండు రాష్ట్రాల్లోనూ రైతులు తమపొలాల్లో విత్తనాలు వేయడం ప్రారంభించారు. ప్రస్తుతం వర్షాధార పంటలైన జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగులు, ఆముదం, కందులు, పెసలు, సెనగలు, మినుములు తదితర పంటలు వేయడం ప్రారంభించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఖరీఫ్ సీజన్‌లో దాదాపు 12 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంచింది. రెండు రాష్ట్రాల్లోనూ వ్యవసాయ అధికారులు రైతులతో ఇప్పటికే చర్చలు జరిపి వారి అవసరాల మేరకు విత్తనాలను సిద్ధంగా ఉంచారు. బావుల కింద చాలా చోట్ల వరినారుమళ్లు వేస్తున్నారు. చెరువులు, కుంటలు, మధ్యతరహా, భారీ నీటి ప్రాజెక్టుల కింద దాదాపు 75 లక్షల ఎకరాల్లో వరివేస్తారు. నీటివనరుల్లో నీరు లేకపోవడం వల్ల వీటికింద కింద ఇప్పటికిప్పుడు వరినారుమళ్లు వేయడం ప్రారంభించలేదు. ఎక్కడైతే భూమి బాగా నానేలా వర్షాలు కురిశాయో అక్కడ మాత్రమే విత్తనాలు వేస్తున్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు (ఎఇఓ), వ్యవసాయ అధికారులు (ఎఓ) తాము పనిచేసే కేంద్రాల్లో ఉండాలని, రైతులకు అందుబాటులో ఉండాలని రెండు ప్రభుత్వాలు కూడా అధికారిక ఆదేశాలు జారీ చేశాయి.