రాష్ట్రీయం

తొక్కిసలాటకు బాధ్యులను తేల్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 21: గోదావరి మహా పుష్కరాల తొలి రోజున రాజమహేంద్రవరంలోని పుష్కరాల రేవులో జరిగిన తొక్కిసలాటకు ఎవరు బాధ్యులన్న విషయాన్ని తేల్చాలని పలువురు కోరారు. రానున్న కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా జస్టిస్ సోమయాజులు కమిషన్ ప్రభుత్వాలకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. తొక్కిసలాటపై జస్టిస్ సోమయాజులు స్థానిక ఆర్‌అండ్‌బి అతిధిగృహంలో మంగళవారం విచారణ నిర్వహించారు. మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్, బార్‌కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు తదితరులు తమ వద్ద ఉన్న వీడియో, ఫొటో ఆధారాలను కమిషన్ ముందుంచారు. ఈసందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ అంతా తానై వ్యవహరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుష్కరాలరేవులో ఉండగానే తొక్కిసలాట జరిగిందన్నారు. దుర్ఘటనకు తానే ప్రత్యక్ష సాక్షినని ఆయనే చెప్పుకున్నారన్నారు. పుష్కరాల తరువాత విచారణ నిర్వహిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి యంత్రాంగాన్ని అవార్డులతో సత్కరించారని ఎద్దేవా చేశారు.
భారీగా జనసమీకరణ జరిగే ఉత్సవాలకు ప్రముఖులు హాజరుకారాదన్నారు. వైపరీత్యాల నివారణ మార్గదర్శకాల్లోనే ఈఅంశం స్పష్టంగా ఉందన్నారు. మంచినీరు, ఆక్సిజన్ అందకే 29 మరణించారన్నారు. ముఖ్యమంత్రి భద్రతపై దృష్టిసారించిన యంత్రాంగం సామాన్య భక్తుల భద్రత గురించి పట్టించుకోలేదన్నారు. పుష్కరాలరేవులో భారీగా భక్తులు వేచి ఉన్న సమయంలోనే ముఖ్యమంత్రిని అక్కడి నుంచి పంపించేందుకు ఒక్కసారిగా బారికేడ్లు ఎత్తివేయడం వల్లే తోపులాట, తొక్కిసలాట జరిగాయని ఉండవల్లి పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ప్రచారం కోసం పాకులాడే క్రమంలోనే ఈదుర్ఘటన జరిగిందన్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ ద్వారా పుష్కరాలను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారని ఆయన చెప్పారు. పుష్కరాల ఏర్పాట్లు తదితర అంశాలను పర్యవేక్షించిన మంత్రివర్గ ఉప సంఘాన్ని, ముఖ్యమంత్రిని విచారిస్తేనే అసలు వాస్తవాలు బయటపడతాయన్నారు.
న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ తొక్కిసలాట అనంతరం భక్తులను పట్టించుకున్న నాధుడే లేడన్నారు. ప్రభుత్వం తన ప్రచారం కోసం భక్తులందర్నీ పుష్కరాలరేవుకే తరలించిందన్నారు. సిపిఎం అర్బన్‌జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సమర్పించిన అఫిడవిట్‌లో తొక్కిసలాట జరిగిన సమయం, ప్రదేశాన్ని పేర్కొనలేదని, అలాగే ముఖ్యమంత్రి ఎంతసేపు రేవులో గడిపారన్నది కూడా తెలియజేయలేదన్నారు. వైసిపి కేంద్రకమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ రూ.10 కోట్లతో విఐపి ఘాట్‌ను ఎందుకు నిర్మించారని ఆమె ప్రశ్నించారు. ప్రముఖ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు కమిషన్‌కు సహకరించారు.
ప్రభుత్వం తరుపున సిహెచ్ ప్రభాకరరావు వాదనలు వినిపించారు. అనంతరం విచారణను ఈనెల 23వ తేదీకి వాయిదా వేసినట్టు జస్టిస్ సోమయాజులు ప్రకటించారు. ఆ రోజు నాటికి సంఘటనకు, ఏర్పాట్లు, ఇతర అంశాలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని అధికార్లను ఆదేశించారు.

చిత్రం జస్టిస్ సోమయాజులు కమిషన్ ఎదుట వాదనలు వినిపిస్తున్న ఉండవల్లి, ముప్పాళ్ల