తెలంగాణ

భారం తప్పదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలపై పెనుభారం మోపకుండా విద్యుత్, ఆర్టీసీ చార్జీలను స్వల్పంగా పెంచాడానికి సిఎం కెసిఆర్ అధికారులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. విద్యుత్, ఆర్టీసీవంటి ప్రభుత్వరంగ సంస్థలను నష్టాల ఊబినుంచి గట్టెక్కించాలంటే ప్రజలు కూడా కొంతభారం మోయక తప్పదని సిఎం స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం విద్యుత్, ఆర్టీసీ సంస్థల ఆర్థిక స్థితిగతులను సిఎం సమీక్షించారు. సిఎం కెసిఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంవల్ల విద్యుత్ సంస్థలు కునారిల్లిపోయాయన్నారు. ఆర్టీసీ పరిస్థితి మరీ దారుణంగా ఉందని, అది ఎప్పుడు మూతపడుతుందోనన్న ఆందోళన నెలకొందని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవలంభిస్తున్న విధానాల వల్ల విద్యుత్, ఆర్టీసీ సంస్థలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా, ఇంకా నష్టాల్లోనే ఉన్నాయన్నారు. వీటిని గట్టెక్కించేందుకు ప్రభుత్వానికి ప్రజలు, ఉద్యోగులు సహకరించాలని, ప్రజలు కొంతభారాన్ని మోయక తప్పదని సిఎం అన్నారు. సామాన్య ప్రజలపై ఏమాత్రం అదనపు భారం పడకుండా విద్యుత్ చార్జీలు పెంచాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వంద యూనిట్లలోపు గృహ విద్యుత్ వినియోగించే వారిని చార్జీల పెంపుదల నుంచి మినహాయించాలని సూచించారు. అయితే వంద యూనిట్లకంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే వారికి స్వల్పంగా పెంచుకోవచ్చని సిఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో 86 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లుంటే అందులో 60 లక్షల మంది 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారని సిఎం అన్నారు. గృహ విద్యుత్ వినియోగదారులపైనే కాకుండా పరిశ్రమల సరఫరా చేసే విద్యుత్ చార్జీలనూ స్వల్పంగా పెంచాలని ఆదేశించారు. పరిశ్రమలకు సరఫరా చేసే విద్యుత్ యూనిట్‌పై 10 శాతం పెంపునకు అధికారులు ప్రతిపాదించగా, 7శాతం పెంచితే సరిపోతుందని సిఎం సూచించారు.
తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు పరిశ్రమలకు అనుకూలమైన విధానం అవలంభించడంతో ఐటీ కంపెనీలు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. దీనివల్ల విద్యుత్ సంస్థలపై భారీగా భారం పడిందన్నారు. ఈ భారాన్ని కొంతమేరకు పంచుకోవాలని పారిశ్రామికవేత్తల దృష్టికి అధికారులు తీసుకెళ్లగా, 10శాతం పెంపునకు సమ్మతించారని సిఎం గుర్తు చేశారు. అయినప్పటికీ ఏడు శాతాన్ని మాత్రమే పెంచితే సరిపోతుందని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కోతలులేని విద్యుత్ సరఫరాకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు సిఎం పేర్కొన్నారు. అలాగే రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం సంకల్పించిందని, దీనికోసం మరో రూ.2400 కోట్లు ఖర్చవుతుందన్నారు. విద్యుత్ ఉద్యోగులకు వేతనాలు పెంపువల్ల కూడా సంస్థలపై భారం పడిందన్నారు. ఈ కారణాల వల్ల ఆర్థిక భారాన్ని కొంతలో కొంతైనా తగ్గించి గట్టెక్కించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని సిఎం అన్నారు.
ఆర్టీసీ చార్జీల పెంపుదల ఇలా...
సామాన్య ప్రజలు, పేదలు ఎక్కువగా ప్రయాణించే పల్లె వెలుగు బస్సుల్లో 30 కి.మీ వరకు రూపాయి, ఆపై కిలోమీటరుకు రూ.2 మాత్రమే పెంచాలని సిఎం ఆదేశించారు. పల్లె వెలుగు కాకుండా ఇతర బస్సులకు మాత్రం పదిశాతానికి మించకుండా చార్జీలు పెంచాలన్నారు. ఆర్టీసీలో ప్రయాణించే వారిలో సగంమంది పల్లె బస్సుల్లో వెళ్లేవారేనని, పేదలకు రవాణా సౌకర్యం కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని సిఎం వ్యాఖ్యానించారు. ఆర్టీసీ పరిరక్షణకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని, ప్రతి నెలా రూ.75 కోట్ల చొప్పున ప్రభుత్వం ఆర్టీసీకి సాయం అందిస్తోందని సిఎం గుర్తుచేశారు. ఆర్టీసీలో ప్రస్తుతమున్న 11 వందల బస్సులు పూర్తిగా పాడయ్యాయని, వీటిస్థానంలో కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం రూ.300 కోట్లు ఆర్థిక సాయం చేయనుందని సిఎం ప్రకటించారు.

చిత్రం... ఆర్టీసీ, విద్యుత్ పరిస్థితిపై అధికారులతో సమీక్ష జరుపుతున్న సిఎం కెసిఆర్