రాష్ట్రీయం

వెంటాడిన మృత్యువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు/మేదరమెట్ల, జూన్ 30: ప్రకాశం జిల్లా మేదరమెట్ల జాతీయ రహదారిపై గురువారం వేకువ జామున రెండున్నర గంటల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు చిన్నారులు, డ్రైవర్ దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడి గుంటూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు ఇలా ఉన్నాయి. పాత గుంటూరులోని మారుతీనగర్‌కు చెందిన మాచర్ల వీరాస్వామి 11మంది కుటుంబ సభ్యులతో టవేరా వాహనంలో తిరుపతి వెళ్లి మొక్కు తీర్చుకుని బుధవారం రాత్రి ఏడున్నరకు తిరుగు ప్రయాణమయ్యారు. మద్దిపాడు మండలం గుళ్లాపల్లి సెంటర్లో డ్రైవర్ నాగరాజు కొంతసేపు నిద్రపోయిన అనంతరం మళ్లీ ప్రయాణం మొదలు పెట్టారు. నిద్రమత్తులోనే డ్రైవర్ వాహనాన్ని నడిపాడు. గురువారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో మేదరమెట్ల దక్షిణ బైపాస్ వద్ద గుర్తుతెలియని ఓ వాహనాన్ని ఢీకొట్టాడు. ఆ సంఘటనలో వీరాస్వామి స్వల్పంగా గాయపడ్డారు. మిగిలిన వారికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే వీరి టవేరా స్టార్ట్ కాకపోవడంతో వీరాస్వామి కుమారులు గోపీకృష్ణ, మురళీకృష్ణ, అల్లుడు కోటేశ్వరరావు కిందకి దిగి వాహనాన్ని తోసుకుంటూ ముందుకు వెళుతున్న సమయంలో అతివేగంగా టిప్పర్ రావడాన్ని గమనించిన ముగ్గురు పక్కకు తప్పుకున్నారు. కానీ ఆ టిప్పర్ వీరి కారును ఢీకొని రోడ్డు మార్జిన్‌లోకి తోసుకుంటూ వెళ్లి దానిపై ఎక్కి ఆగింది. దాంతో ఆ కారు చిన్నాభిన్నం కావడంతో అందులో ఉన్న డ్రైవర్ నాగరాజు, చిన్నారులు శ్రీకృష్జ (3) చిన్ని కృష్ణవాసవి (4), నిత్య (9 నెలలు), చిన్నికృష్ణ మనోహర్ (5) అక్కడికక్కడే మరణించాడు. ఆ సమయంలో వాహనంలోనే ఉన్న రామస్వామి, ఆయన భార్య,కోడలు,కూతురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద సమాచారం తెలుసుకున్న మేదరమెట్ల ఎస్‌ఐ వై పాండురంగారావు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మూడు క్రేన్‌లు రప్పించి టవేరాపై ఉన్న టిప్పర్‌ను కిందకు దించారు. గ్యాస్ కట్టర్‌ను తెప్పించి టవేరా వాహనం తలుపులు కత్తిరించి మృతదేహాలను, బాధితులను బయటకు తీయించారు. గాయపడ్డ వారిని ఒంగోలులోని రిమ్స్‌కు తరలించారు. రామస్వామి భార్య గంగమ్మ ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. కాగా టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్‌పి త్రివిక్రమవర్మ, ఎఎస్‌పి బి రామానాయక్, దర్శి డిఎస్‌పి వి శ్రీరాంబాబు, అద్దంకి సిఐ బేతపూడి ప్రసాద్ పరిశీలించారు. మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా ప్రకాశం జిల్లా రేణంగివరం వద్ద అర్ధరాత్రి జరిగిన వేరొక రోడ్డుప్రమాదంలో వేముల సరోజిని మృతిచెందగా మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆగి ఉన్న టిప్పర్‌ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితులను ఒంగోలులోని రిమ్స్‌కు తరలించారు.
కాగా రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు పరామర్శించారు. ప్రమాదంలో గాయపడిన బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆయన రిమ్స్ వైద్యులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి విలేఖర్లతో మాట్లాడుతూ జాతీయ రహదారుల మీద రోడ్డుప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అయినప్పటికీ డ్రైవర్లు మితిమీరిన వేగం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేపడతామన్నారు.

చిత్రం.. మేదరమెట్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారుపై ఎక్కేసిన టిప్పర్. కారులో నుజ్జునుజ్జయన దేహాలు