రాష్ట్రీయం

తరలింపుతో పెరిగిన బాబు ప్రతిష్ఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: అదిగో ఇదిగో అంటూ నత్తనడకన సాగిన ఉద్యోగుల తరలింపు ప్రక్రియ విజయవంతం కావడంతో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠ పెరిగినట్టయింది. హైదరాబాద్‌లో తిష్ఠవేసి, వెలగపూడికి వెళ్లకుండా మొరాయించిన ఉద్యోగులను అమరావతికి తీసుకురావడంతో పాటు, రెండు రోజులు ఆలస్యమయినప్పటికీ తాత్కాలిక సచివాలయం ప్రారంభం కావడంతో బాబు పరిపాలనపై ఇప్పటివరకూ ఉన్న విమర్శలు తగ్గినట్టయింది. రాజధాని లేని రాష్ట్రంగా విడిపోయిన ఏపికి, తాత్కాలిక సచివాలయ నిర్మాణానికే రెండేళ్లు పట్టింది. దానికి ప్రభుత్వం అనేక ఒత్తిళ్లు ఎదుర్కోవలసి వచ్చింది. హైదరాబాద్ సచివాలయం నుంచి అప్పుడే కదిలేదిలేదని కొందరు, వెలగపూడిలో సకలసౌకర్యాలు కల్పించిన తర్వాత వస్తామని మరికొందరు, తమ పిల్లల చదువుల సంగతేమిటని ఇంకొందరు వాదనలకు దిగి, తరలింపు వాయిదా కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే, ఈ విషయంలో సీఎం బాబు కఠినంగా వ్యవహరించారు. వారిని రప్పించేందుకు తాత్కాలిక సచివాయ నిర్మాణాన్ని ప్రతష్ఠాత్మకంగా తీసుకున్నారు. దాదాపు ఐదుసార్లు బాబు స్వయంగా నిర్మాణ తీరును పరిశీలించారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఉద్యోగులు, మంత్రుల చాంబర్ల కోసం తాత్కాలికంగా రెండు భవనాలయినా త్వరగా నిర్మిస్తే, వాదనలు, చర్చలకు తెరపడుతుందని భావించారు. అందుకే మునిసిపల్ శాఖ మంత్రి నారాయణను పురమాయించి, వ్యక్తిగత పర్యవేక్షణకు నియమించారు. ఫలితంగా రెండురోజులు ఆలస్యంగానయినా తాత్కాలిక సచివాలయం పని మొదలయింది. దీనితో ఇక హైదరాబాద్ సచివాలయంలో ప్రస్తుతం పనిచేస్తున్న మిగిలిన సిబ్బందికీ తరలివెళ్లటం అనివార్యం చేశారు. ఈ పరిణామాలతో ఇప్పటివరకూ సచివాలయ నిర్మాణమే చేయలేని బాబు, అమరావతి ఏమి నిర్మిస్తారన్న విమర్శలకు తెరపడినట్టయింది. సచివాలయం మొదలయిన క్రమంలో ఉద్యోగులు విజయవాడ, మంగళగిరి, గుంటూరులో అద్దె ఇళ్లలో చేరిపోగా, మహిళా ఉద్యోగినులు వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లలో చేరిపోయారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరుకు బస్సుల్లో వచ్చిన వారిని, స్థానిక ఉద్యోగులకు ఘనస్వాగతం పలికారు. ఈ వైనం మీడియాలో విస్తృత ప్రచారం కావడంతో, ప్రజల్లో కూడా ‘మన రాష్ట్రంలో మన పాలన’ మొదలయిందన్న భావన మొదలయింది. ఉద్యోగులను రాజధానికి తీసుకురావడంతోపాటు, తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో చురుకుగా వ్యవహరించిన బాబు పాలనపై, ఇప్పటివరకూ వివిధ వర్గాల్లో ఉన్న వ్యతిరేకత కూడా చాలావరకూ తొలగినట్టయింది. పనుల కోసం హైదరాబాద్ వరకూ వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందన్న భావన నవ్యాంధ్ర ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఒక్క శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చేవారికి తప్ప, మిగిలిన జిల్లాల వారంతా విజయవాడకు ఉదయం వచ్చి, రాత్రికి జిల్లాలకు చేరుకునే వెసులుబాటు తరలింపుతో కలిగిందన్న సంతోషం వ్యక్తమవుతోంది. ఒక రకంగా ఈ రెండు అంశాల్లో వేగంగా వ్యవహరించి బాబు తనపై ప్రజల్లో నమ్మకం పెంచుకున్నారన్న వాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, అమరావతికి శంకుస్థాపన చేసినప్పుడే తాత్కాలిక సచివాలయ నిర్మాణం, ఆ తర్వాత తరలింపు ప్రక్రియ మొదలుపెడితే ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, హైదరాబాద్‌లో ఉన్న మంత్రులు, ఐఎఎస్, ఐపిఎస్ క్వార్టర్లు ఏమి చేస్తారన్న చర్చ జరుగుతోంది. ఆగస్టుతో సచివాలయ తరలింపు ప్రక్రియ పూర్తవుతుంది. అప్పుడు సచివాలయాన్ని తెలంగాణ సర్కారుకు స్వాధీనం చేయాల్సి ఉంది. మరి అప్పటివరకూ అధికారులు ఉంటున్న క్వార్టర్లు ఖాళీ చేస్తారా? కొనసాగిస్తారా? అన్న దానిపై స్పష్టత లేదు. ఇప్పటికే అధికారుల క్వార్టర్లు ఖాళీ చేయాలని టీ సర్కారు నోటీసులు ఇస్తుండగా, మంత్రులు, అధికారులకు విజయవాడ సమీపంలోని రెయిన్‌ట్రీ విల్లాల్లో క్వార్టర్లు కేటాయించడం తెలిసిందే.