రాష్ట్రీయం

పేరు ఏదైనా దోపిడీ అదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 15: విజయవాడలో కాల్ మనీ పేరుతో వడ్డీ వ్యాపారులు సాగిస్తున్న వేధింపులు వెలుగులోకి రావడంతో రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం ఉలిక్కిపడింది. ఇటువంటి వ్యాపారం కేవలం విజయవాడలోనే కాదు, రాష్ట్రం నలుమూలలా జరుగుతోంది. విశాఖ నగరంలో చాలా కాలం కిందటే ఈ వ్యాపారం మొదలైంది. విజయవాడలో వడ్డీ వ్యాపారులు వసూలు చేస్తున్న స్థాయిలోనే ఇక్కడి వ్యాపారులు కూడా వడ్డీలు వసూలు చేస్తున్నారు. అయితే ఈ వ్యాపారుల బారిన పడినవారు ఇప్పటి వరకూ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకపోవడంతో ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. విశాఖ నగరంతోపాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో డైలీ ఫైనాన్స్ పేరుతో పెద్ద ఎత్తున వడ్డీ వ్యాపారం జరుగుతోంది. ముఖ్యంగా తోపుడుబళ్ల వ్యాపారులకు, రైతు బజారులో వ్యాపారం చేసుకునే వారికి వీరు డైలీ ఫైనాన్స్ ఇస్తుంటారు. రోజుకు వెయ్యి నుంచి ఐదు వేల రూపాయల వరకూ ఇస్తుంటారు. వెయ్యికి 100 రూపాయలు ముందుగానే మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని వ్యాపారులకు ఉదయం ఇచ్చి, సాయంత్రం వెయ్యి రూపాయలు తీసుకుంటారు. ఇలా కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతోంది. అలాగే నగరంలోని బ్రాందీ దుకాణాలు, బార్లకు, ఇతర వ్యాపారాలు చేసుకునేవారికి లక్షల్లో మొత్తాన్ని ఇస్తుంటారు. వీరి వద్ద నుంచి ఐదు నుంచి 15 రూపాయల వడ్డీ వసూలు చేస్తున్నట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. వీరి ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు వడ్డీ వ్యాపారులు ముందుగానే చేజిక్కించుకుంటున్నారు. మరికొంతమంది ఒక అడుగు ముందుకు వేసి, భారీ ఎత్తున వడ్డీ గుంజుతున్నారు. అత్యవసరంగా ఒకటి, లేదా రెండు రోజుల అవసరానికి లక్ష రూపాయలు కావల్సి వస్తే, వడ్డీ వ్యాపారి 10 వేల రూపాయలు గుంజుతున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. విశాఖలో చాలా కాలంగా ఈ వ్యాపారం నడుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వడ్డీ వ్యాపారులు నగరంలో స్థిరపడి, ఈ వ్యాపారాన్ని నడుపుతూ కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నారు. విజయవాడ ఘటనను దృష్టిలో పెట్టుకుని నగరంలోని టాస్క్ఫోర్స్ పోలీసులు గడచిన రెండు రోజుల నుంచి వడ్డీ వ్యాపారులపై దృష్టి కేంద్రీకరించారు.
తొలి కాల్‌మనీ కేసు
విశాఖలో తొలి కాల్ మనీ కేసు మంగళవారం నమోదైంది. దీనికి సంబంధించి ఆరిలోవ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగర శివారులోని ఆరిలోవ ప్రాంతానికి చెందిన ఒక మహిళ తన స్నేహితురాలి కోసం తన బంగారాన్ని ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో తాకట్టుపెట్టింది. అయితే, ఆమె స్నేహితురాలు డబ్బులు చెల్లించకుండానే వెళ్లిపోయింది. దీంతో ఫైనాన్స్ కంపెనీ నుంచి ఆమెకు నోటీసులు అందుతున్నాయి. బంగారాన్ని వేలం వేస్తారన్న భయంతో ఆ మహిళ తన బంగారాన్ని విడిపించుకోడానికి రామకృష్ణ అనే వ్యక్తిని ఆశ్రయించింది. అతడు ఆమె వద్దనున్న బంగారాన్ని తాకట్టు పెట్టుకుని లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఆ మొత్తానికి చాలా పెద్ద మొత్తంలోనే వడ్డీ చెల్లించింది. రామకృష్ణ తన వద్దనున్న బంగారాన్ని తిరిగి ఇవ్వకపోగా, ఆమెను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటువంటి బాధితులు కొంతమంది మంగళవారం బయటకు వచ్చి, తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నారు.

అదే‘మని’ అడిగే ధైర్యం లేదు

రాజమండ్రి, డిసెంబర్ 15: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోను కాల్‌మనీ లాంటి ఆగడాలు కొనసాగుతున్నాయి. రోజువారీ వ్యాపార అవసరాల కోసం చిన్న వ్యాపారులు ప్రయివేటు వడ్డీ వ్యాపారుల వద్ద తీసుంటున్న రుణాలు, వాటిపై చెల్లిస్తున్న వడ్డీలు చూస్తుంటే గుండెలదిరిపోతున్నాయి. రాజమండ్రిలో కోటగుమ్మం సెంటర్, మెయిన్‌రోడ్డు, అండర్ బ్రిడ్జి కింద వ్యాపారాలు చేసుకునే చిన్న వ్యాపారులను ‘ఆంధ్రభూమి ప్రతినిధి’ పలకరించినపుడు వారు చెప్పిన విషయాలు తీవ్ర ఆందోళన కలిగించాయి. పెట్టుబడి పెట్టే ఆర్థిక స్థోమత లేక ప్రయివేటు వడ్డీ వ్యాపారులపైనే చిన్న వ్యాపారులు ఆధారపడుతున్నారు. అప్పు తీసుకున్న వారు హామీగా ఎలాంటి ఆస్తిని చూపించకపోయినాగానీ, వడ్డీ వ్యాపారులు చిన్న వ్యాపారులకు అప్పులు ఇచ్చి, తమ అర్థ, అంగబలాలు ఉపయోగించి అధిక వడ్డీలు వసూలుచేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఇలాంటి అధిక వడ్డీల దందాలకు రాజమండ్రి మొదటి స్థానంలో ఉందని తెలుస్తోంది. రూ.10వేలు అప్పు కావాలంటే వడ్డీ వ్యాపారులు ముందుగానే రూ.1500 కత్తిరించి, రూ.8500 ఇస్తారు. అప్పు తీసుకున్న వారు రోజుకు రూ.100 చొప్పున 100 రోజులు చెల్లించాల్సి ఉంటుంది. కొంత మొత్తం చెల్లించిన తరువాత వ్యాపారానికి అత్యవసరమై, మళ్లీ అప్పు కావాలని కోరితే, అదే తంతు. దీనినే అప్పు తిరగేయటమంటారు. ఇలా తీసుకోవటం వల్ల అప్పు భారం పెరిగిపోతుంది. రూ.100కు నెలకు సుమారు రూ.15 చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి అప్పు ఊబిలో పడితే ఎవరూ బయటపడలేరు. అత్యవసరంగా అప్పటికప్పుడు అప్పు కావాలంటే మరో విధానం ఉంది. రూ.10వేలు అప్పు ఇచ్చి, రోజుకు రూ.100 చొప్పున వసూలుచేస్తారు. ఇలాంటి వడ్డీతో అయితే వంద రోజులకే తీసుకున్న అసలుతో సమానంగా వడ్డీ కూడా పెరుగుతుంది. తోపుడు బళ్లు, ఫుట్‌పాత్‌లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి వద్ద రోజువారీ వాయిదాలు చెల్లించే అప్పుల పుస్తకాలు మూడు నుండి నాలుగు వరకు ఉంటాయని, ఒకరి వద్ద తీసుకున్న అప్పును గడువులోగా చెల్లించటానికి మరొకరి దగ్గర అప్పు చేయటం, ఆ అప్పును చెల్లించేందుకు ఇంకొకరి వద్ద అప్పు చేయటం వంటి అప్పుల ఊబిలో రోజు రోజుకూ చిన్న వ్యాపారులు కూరుకుపోతున్నారని చిన్న వ్యాపారుల సంఘం అధ్యక్షుడు అడపా రాజు చెప్పారు.

గుంటూరులో సోదాలు

గుంటూరు, డిసెంబర్ 15: గుంటూరు నగరంలోని వడ్డీ వ్యాపారులపై అర్బన్ ఎస్‌పి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలతో దాడులు నిర్వహించారు. విజయవాడ కాల్‌మనీ ప్రకంపనలు గుంటూరు నగరాన్ని తాకాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కాల్‌మనీ నిర్వాహకుల నుంచి తీసుకున్న నగదును కట్టవద్దని ఆదేశించడమే కాకుండా ఇటువంటి సంఘటనలపై కఠినచర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించటంతో మంగళవారం దాడులు జరిగాయి.
నగరంలోని లాలాపేట, పాతగుంటూరు, పట్ట్భాపురం, అరండల్‌పేట పోలీసు స్టేషన్ల పరిధిలో దాడులు కొనసాగాయి. ఆయా స్టేషన్ల పోలీసు అధికారుల పర్యవేక్షణలో దాడులు చేసి నలుగురు వడ్డీవ్యాపారులను అరెస్టు చేశారు. లాలాపేటకు చెందిన గుడివాడ వెంకటేశ్వరరావు, ఆర్‌టిసి కాలనీలోని ఉడుముల వెంకటేశ్వరరెడ్డి, బ్రాడీపేట నివాసి దిద్దుకూరి రమేష్, శారదాకాలనీ వ్యక్తి ఎస్ శ్రీనివాసరావులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ప్రామిసరీ నోట్లు, చెక్కులు, స్థలాల డాక్యుమెంట్లు, ఇళ్లకు సంబంధించిన దస్తావేజులు, రూ. 2,85,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అధిక వడ్డీలకు నగదు ఇచ్చి చెల్లింపుల నిమిత్తం వేధిస్తుంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని అర్బన్ ఎస్‌పి కోరారు. నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న వారి వద్ద నుంచి నగదు తీసుకుని మోసపోవద్దని సూచించారు. ప్రమాణాలు పాటించకుండా పత్రాలు, చెక్కులపై సంతాకాలు చేయించుకునే వారిని నమ్మవద్దన్నారు. ఖాళీ చెక్కులను, ప్రామిసరీ నోట్లను పెద్దఎత్తున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గుంటూరులో వడ్డీవ్యాపారి ఇంట్లో సోదాలు చేస్తున్న పోలీసులు