రాష్ట్రీయం

కృష్ణా డెల్టా పంట పండింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 5 : ఎన్నో సీజన్లుగా సరైన పంటకు నోచుకోని కృష్ణా డెల్టా రైతాంగంలో ఆశల హరివిల్లు విరుస్తోంది. దేశంలోనే మొట్టమొదటి సారిగా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుండి మరోసారి కృష్ణాడెల్టాకు సాగునీరు అందిం చే ప్రక్రియ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పధకాన్ని సంవత్సరంలోగా పూర్తి చేసి సాగునీరు అందిస్తామని ప్రారంభ సమయంలోనే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. దానికి తగ్గట్టుగానే ఈ ప్రాజెక్టు పనులను శరవేగంగా ముందుకు తీసుకువెళ్లింది. ప్రస్తుతం వున్న పరిస్థితి చూస్తే ఈ పథకానికి సంబంధించి మొత్తం అన్ని పంపులు నీటి తరలింపునకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాయి. అలాగే ఈ నీరు ప్రవహించాల్సిన పోలవరం కుడికాలువకు సంబంధించి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయనే చెప్పాలి. వాస్తవానికి ఈ కాలువపై పలు చోట్ల కట్టడాలు నిర్మించాల్సివున్నా, ప్రత్యేకమైన ఏర్పాట్లద్వారా నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా చేశారు. ప్రస్తుతం కృష్ణాలో వున్న పరిస్థితి చూస్తుంటే ఈసారికి కృష్ణాజలాలు వచ్చే అవకాశాలు దాదాపుగా లేనే లేవని చెప్పాలి. ఇదే అంశం స్వయంగా అమాత్యులు కూడా ఇంతకుముందు స్పష్టంచేశారు. దానికి తగ్గట్టుగానే ఎగువ భాగంలో పరిస్థితులు కూడా ఉన్నాయి. దీనితో ఈసారి కృష్ణా డెల్టాలో వ్యవసాయ పనులు మూలనపడ్డట్లేనని భావించారు. ఇదే సమయంలో గోదావరిలో పరిస్థితి చూస్తే ఇటీవల కురిసిన భారీ వర్షాలు కారణంగా పెద్ద ఎత్తున వరదనీరు గోదావరిలోకి చేరుకుంది. ఇదంతా నేరుగా ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు చేరుకుంటున్నా అక్కడ నిల్వ సామర్ధ్యం లేకపోవడంతో లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. గత కొద్దిరోజుల నుంచి చూసుకున్నా దాదాపు మూడు లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోయాయని అంచనా. ఇక ఈ వర్షాలు కారణంగా గోదావరిలో వచ్చి చేరిన జలాల్లో ఏడు లక్షల క్యూసెక్కులకు పైగా నీరు సముద్రంలో కలిసి పోయినట్లు అంచనా వేస్తున్నారు. ఈ విధంగా సముద్రంలో వృధాగా కలిసి పోతున్న నీటిని ఒడిసిపట్టి పట్టిసీమ ద్వారా పోలవరం కుడికాలువకు మళ్లించి ఆ నీటిని కృష్ణాడెల్టాకు తీసుకువెళ్లే బృహత్తర ప్రయత్నం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రయత్నం అనుకున్న రీతిలో ముందుకు సాగితే ఈ సీజన్‌కు కృష్ణా డెల్టాలో వ్యవసాయ పనులు మళ్లీ ఎన్నో సీజన్ల తరువాత కనిపించే పరిస్థితి లేకపోలేదు. గత ఏడాది కూడా ఇదే విధంగా పట్టిసీమ నుంచి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించడం ద్వారా వందల కోట్ల రూపాయల విలువైన పంటను కాపాడగలిగారు. ఈసారి ముందుగానే ఈ జలాలను అనుకున్న స్థాయిలో తరలించగలిగితే కృష్ణా డెల్టా పచ్చని పంటలతో అలరారే అవకాశాలు భారీగా మెరుగుపడ్డట్లేనని భావించవచ్చు.
బుధవారం నాటి కార్యక్రమాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉదయం 9.30 గంటలకు పట్టిసీమ ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. అక్కడ గోదావరి జలాలను విడుదల చేస్తారు. ఆ తరువాత ఇటుకల కోట సమీపంలోని డెలివరీ పాయింట్‌కు చేరుకుని అక్కడ ప్రవాహ తీరును గమనిస్తారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును కూడా ఆయన పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్షించి పోలవరం కుడి, ఎడమ కాలువల నిర్మాణ పనితీరును పరిశీలిస్తారు.

చిత్రం.. పట్టిసం ఎత్తిపోతల వద్ద ఏర్పాట్లు పరిశీలిస్తున్న మంత్రులు దేవినేని, పీతల