ఆంధ్రప్రదేశ్‌

అనుసంధానమే మంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 6 : రాష్ట్రంలో నదుల అనుసంధానం ఇక మహా మంత్రంగా మారనుంది. ఆయకట్టు స్థిరీకరణలు, ఇబ్బంది ఉన్న చోటికి అదనపు జలాలను తరలించే బృహత్తర ప్రక్రియకు పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో తొలి అడుగు పడింది. రానున్న రోజుల్లో వంశధార, నాగావళి నదులను కూడా అనుసంధానించి రైతులకు మరింత అండగా నిలబడటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. బుధవారం చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లాలో పట్టిసీమ ఎత్తిపోతల పధకం ద్వారా గోదావరి జలాలను విడుదల చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఈ పథకంలో మొత్తం 24 పంపుల ఏర్పాటు పూర్తయ్యింది. వీటి ద్వారా నీటిని విడుదల చేసి పోలవరం కుడికాలువ ద్వారా కృష్ణాడెల్టాకు మళ్లించే ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం ఇటుకలకోట డెలివరీ పాయింట్ వద్ద నీటి ప్రవాహం తీరును పరిశీలించి, అక్కడ గోదావరిలో పూలవర్షం కురిపించారు.
ఈ సందర్భంగా విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఈ సీజన్‌లో మొత్తం 85 టిఎంసిల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించాలని నిర్ణయించామన్నారు. దీనివలన ఉభయగోదావరి జిల్లాల రైతాంగానికి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మరోసారి స్పష్టంచేశారు. ఇది రాష్ట్రం గర్వించే రోజుగా చెప్పుకోవాలని, కృష్ణాడెల్టాకు గోదావరి జలాలను అనుసంధానించి శ్రీశైలంలో అందుబాటులో ఉండే జలాలను కరువుప్రాంతమైన రాయలసీమకు అందిస్తామన్నారు. గత సీజన్‌లో పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి కాకపోయినా ఇక్కడనుంచి తొమ్మిది టిఎంసిల నీటిని తీసుకెళ్లడం ద్వారా రూ.2400 కోట్ల విలువైన పంటను కాపాడగలిగామన్నారు.గోదావరి, కృష్ణా నదులకు ఒకేసారి వరదలు వస్తాయని, ఈప్రాజెక్టు వల్ల ఉపయోగం లేదని గతంలో దుష్ప్రచారం చేశారని, ఇప్పుడు కృష్ణా ప్రాజెక్టుల్లో ఎక్కడా నీరు లేదని, గోదావరికి మాత్రమే వరద వచ్చిందన్న అంశాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం 30శాతం మేర పట్టిసీమ ద్వారా నీటిని విడుదల చేస్తున్నామని, పరిస్థితులు ఎప్పటికప్పుడు అంచనావేస్తూ పూర్తిస్థాయికి తీసుకువెళతామన్నారు. నాలుగైదు రోజుల్లో కృష్ణా డెల్టాకు నీరు చేరుకుంటుందని, తాను రష్యా పర్యటన ముగించుకుని వచ్చేసరికి పూర్తిస్థాయిలో గోదావరి జలాలు కృష్ణాడెల్టాకు అందుబాటులోకి వస్తాయన్నారు.
అనంతరం పోలవరం ప్రాజెక్టు పనుల తీరును ముఖ్యమంత్రి పరిశీలించారు. అక్కడి ప్రాజెక్టు కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లతో ప్రాజెక్టు పనుల తీరుపై సమీక్షించారు. ఇకనుంచి రెట్టింపు వేగంతో పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణ అంచనా 40 వేల కోట్ల రూపాయలు కాగా ఇంతవరకు పది వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతున్న ప్రాజెక్టు పనుల విషయంలో ఎక్కడైనా భూసేకరణ సమస్యలుంటే తక్షణం పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇకనుంచి ప్రతీ వారం పనుల తీరును సమీక్షిస్తానని చెప్పారు. పోలవరం ఎడమ కాలువ పనులను ఏడాదిలో పూర్తిచేసి అక్కడ కూడా ఎత్తిపోతలను ఏర్పాటుచేసి, ఆ నీటిని సోమశిలకు తరలించాలని యోచిస్తున్నామన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు ద్వారా 50 వేల ఎకరాలకు ఈ ఏడాది సాగునీరు అందిస్తున్నామని చెప్పారు. పశ్చిమలో చింతలపూడి ఎత్తిపోతల పధకాన్ని పూర్తిచేసి మెట్ట రైతాంగానికి సాగునీరు అందించడంతోపాటు నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు ఇచ్చే అవకాశముందన్నారు.
పట్టిసీమ పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయడంలో మెగా కన్‌స్ట్రక్షన్స్ మంచి పనితీరును చూపిందని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఇఎన్‌సి వెంకటేశ్వరరావు, సిఇ రమేష్‌బాబు, ఎస్‌ఇ శ్రీనివాసయాదవ్, సిపిడివో గిరిధర్‌రెడ్డిని ఆయన అభినందించారు. అలాగే సకాలంలో పట్టిసీమ పథకాన్ని పూర్తి చేసిన ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందికి ఒక ఇంక్రిమెంట్ ఇస్తున్నట్లుప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, కొల్లు రవీంద్ర, ఎంపిలు మాగంటి బాబు, తోట సీతారామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... డెలివరీ పాయింటు వద్ద 12 పంపుల నుండి కుడి కాలువలో కలుస్తున్న గోదావరి జలాలు