రాష్ట్రీయం

ఫలించని రాయబారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 7: హైకోర్టు తక్షణ విభజనపై ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చేసిన రాయబారం ఫలించలేదు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ ఆదేశాలతో కేంద్రదూతగా ప్రొటోకాల్ కూడా పక్కకు పెట్టి, ప్రైవేటు హోటల్‌లో బస చేసిన గవర్నర్, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. హైకోర్టు విభజనపై బాబు చాలా స్పష్టమైన వైఖరి ప్రదర్శించడమే దానికి కారణం. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీకి రావాలన్న గవర్నర్ సూచనలపై మాత్రం బాబు సానుకూలంగా స్పందించారు.
అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. హైకోర్టు విభజనపై గత కొద్దికాలం నుంచి ఢిల్లీ వేదికగా జరుగుతున్న పోరాటం, రాయబారాలు, వినతిపత్రాలపై కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పందించారు. ఉమ్మడి రాష్ట్ర వ్యవహారాలు వివాదంగా పరిణమించాయని, దానిపై రెండు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి తనకు నివేదిక ఇవ్వాలని గవర్నర్‌ను ఆదేశించారు.
దానితో ముందు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పిలిపించి మాట్లాడిన గవర్నర్, హైకోర్టు విభజనపై సంయమనం పాటించాలని సూచించారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత కూడా హైకోర్టు విభజన జరగకపోవడంతో న్యాయవాదులు, ప్రజలు ఆవేదనకు గురవుతున్నారని, బాబు అడ్డుకోవడం వల్లే ఇది ఆలస్యమవుతోందని కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఏపి హైకోర్టుకు స్థలం, లేదా భవనం కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని గవర్నర్‌కు చెప్పారు.
ఆ తరువాత గవర్నర్.. ఏపి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు ప్రయత్నించారు. తనకు రాష్ట్రంలో అనేక కార్యక్రమాలున్నాయని ప్రస్తుతం రాలేనని చెప్పారు. ఇదే విషయాన్ని గవర్నర్ హోంమంత్రికి దృష్టికి తీసుకువెళ్లడంతో, అయితే మీరే అక్కడికి వెళ్లి చర్చలు జరపండని ఆదేశించిన ఫలితంగా గవర్నరే విజయవాడకు వెళ్లారు.
ఏ ముఖ్యమంత్రి అయినా గవర్నరును కలవాల్సిందే తప్ప, గవర్నర్ నేరుగా సీఎంను కలిసే సంప్రదాయం లేదు. అయితే, ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ ఆ ప్రొటోకాల్‌ను పక్కకుపెట్టి, తానే సీఎంను కలిసేందుకు వెళ్లడం బట్టి, హైకోర్టు విభజన అంశం కేంద్రాన్ని ఏ స్థాయిలో కలవరపరుస్తుందో స్పష్టమవుతోంది. గేట్‌వే హోటల్, తర్వాత తన నివాసంలో గవర్నర్‌తో జరిపిన చర్చల్లో బాబు సున్నితంగానయినా, తమ వాదనను నిర్మొహమాటంగా వినిపించారు. హైకోర్టు విభజనపై తెలంగాణ ప్రభుత్వం తనకు అభ్యర్థనలు పంపిందని, కేంద్రం కూడా ఈ విషయంపై ఆందోళనతో ఉన్నందున, రెండు రాష్ట్రాలు సర్దుబాటు ధోరణి ప్రదర్శించాలని గవర్నర్ బాబుకు సూచించారు. అయితే, దానిపై స్పందించిన బాబు హైకోర్టు కంటే తమకు ప్రాధాన్యాంశాలు చాలా ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే అమరావతిలో హైకోర్టు నిర్మించేంతవరకూ హైదరాబాద్‌లో స్థలం గానీ, భవనం గానీ ఇస్తామన్న కేసీఆర్ ప్రతిపాదనను బాబు ముందు ఉంచారు.
అయితే, ఒక రాజధానిలో రెండు హైకోర్టులు ఉండటం సరైనది కాదని, అదీకాక ఏపిలో హైకోర్టు నిర్మాణానికి సరైన వౌలిక సదుపాయాలు లేవన్న విషయాన్ని తాము స్వయంగా పరిశీలించి వచ్చాం కాబట్టి, అక్కడ వౌలిక సదుపాయాలు కల్పించే వరకూ హైకోర్టు ఉమ్మడిగానే కొనసాగించాలన్న నాటి చీఫ్ జస్టిస్ కక్రూ ఒక పిల్ సందర్భంలో తీర్పు ఇచ్చిన విషయాన్ని కూడా బాబు ప్రస్తావించారు. ఐఏఎస్-ఐపిఎస్ అధికారులు కూడా ఇంకా అవస్థలు పడుతున్నారని, ముందు ప్రభుత్వ భవనాలు నిర్మించి, వాటికి వౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు.ఆ తర్వాతనే హైకోర్టు నిర్మిస్తామన్నారు. హైకోర్టు విభజనకు తాము వ్యతిరేకం కాదని, అయితే అంతకంటే కీలకమైన అంశాలు పరిష్కారం కావలసి ఉన్నాయని బాబు తేల్చి చెప్పారు.
ముఖ్యంగా 9,10షెడ్యూల్‌లోని అన్ని అంశాలు పరిష్కారం కావలసి ఉన్నాయని, 1250 మంది విద్యుత్ ఉద్యోగులు, కృష్ణానదీ జలాలు, ఉన్నత విద్యామండలి సమస్యను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి రాష్ట్ర ప్రజల్లో ఉందని గవర్నర్‌కు బాబు స్పష్టం చేశారు.
ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలన్న సూచన మంచిదేనని, నిజానికి తానే మొదటి నుంచి రాష్ట్ర ప్రయోజనాల కోసం సంయమనం పాటిస్తున్నానన్నారు. అయితే, తాము మాత్రమే సర్దుబాటు ధోరణి ప్రదర్శించి, సంయమనం పాటించాలన్నట్లు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించడం మంచిదికాదని బాబు వ్యాఖ్యానించారు. కాగా, ఇద్దరితో సమావేశం ఏర్పాటుచేస్తే సమస్యలు సర్దుకుంటాయని భావిస్తున్నానని గవర్నర్ చెప్పగా, దానిపై బాబు సానుకూలంగా స్పందించారు.

చిత్రం.. ఏపి సిఎం చంద్రబాబుతో సమాలోచన జరుపుతున్న గవర్నర్