ఆంధ్రప్రదేశ్‌

ఏడాదికే శిథిలం?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 10: ఆది పుష్కరాల పనులకే ఠికాణా లేదు.. ఇక అంత్య పుష్కరాల పనుల మాటేమిటన్నట్టుగా తయారైంది నగరంలో పుష్కర అభివృద్ధి పనుల పరిస్థితి. గోదావరి మహా పుష్కరాలకు కేటాయించిన రూ.240 కోట్ల నిధులకు సంబంధించి కేవలం రూ.120 కోట్ల నిధులు మాత్రమే విడుదలయ్యాయి. మిగిలిన నిధులకు అతీగతీ లేదు. ఆది పుష్కరాల్లో మొదలై అంత్య పుష్కరాల వరకు కొనసాగుతూనే ఉన్నాయి. గోదావరి మహా పుష్కరాల సందర్భంగా చేపట్టిన బ్యూటిఫికేషన్ పనులు, అభివృద్ధి పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. మరోవైపు స్నానఘట్టాల నిర్వహణ లేక శిథిలమయ్యే స్థితికి చేరుకున్నాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన గోదావరి మహా పుష్కరాలకు రూ.240 కోట్లు కేటాయించారు. ఇందులో సగం నిధులు అంటే రూ.120 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులతో ప్రాధాన్యతా క్రమంలో నగరపాలక సంస్థ అభివృద్ధి పనులు చేపట్టింది. స్నానఘట్టాల వద్ద వౌలిక సదుపాయాలు, జంక్షన్ల విస్తరణ, రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం, మంచినీటి సరఫరా పనులు చేపట్టింది. ఇందులో కొన్ని పనులు అంత్య పుష్కరాలు వచ్చినా పూర్తికాని వైనం దాపురించింది. ప్రధానంగా సుందరీకరణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఏడాదిగా ఈ పనులు జరగడం విడ్డూరంగా ఉంది. పుష్కరాలకు ప్రధానంగా నగరపాలక సంస్థ సదుపాయాల కల్పన పెద్దఎత్తున నిధులు వెచ్చించింది. రోడ్లపై రోడ్లు వేయడం, బాగున్న డ్రెయిన్లను కావాలనే శిథిలం చేసి మళ్లీ వాటిపై డ్రెయిన్లు నిర్మించడం తప్ప దీర్ఘకాలంగా పుష్కరాలను ఆలంబనగా చేసుకుని పది కాలాల పాటు నిలిచిపోయే పనులు మాత్రం జరగలేదనేది కచ్చితంగా చెప్పవచ్చు. దాదాపు రూ.120 కోట్ల నిధులతో చేసినా చెప్పుకోదగిన పనులు కన్పించడం లేదు. ప్రస్తుతం నగరంలో జరుగుతోన్న డ్రెయిన్ల విస్తరణ, లోతు చేసే అభివృద్ధి పనులు 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులకు సంబంధించి విడుదలైన రూ. 7 కోట్లతో జరుగుతున్నాయి. మిగిలిన సగం నిధులు వస్తాయో, రావో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. నగరమంతా పచ్చదనంగా తీర్చిదిద్దాలని వేమగిరి నుంచి లాలాచెరువు, కోరుకొండ రోడ్డు నుంచి ధవళేశ్వరం వరకు సుందరీకరణ పనులు చేపట్టారు. ఈ పనులు కొన్ని రోడ్లలో అరకొరగా జరిగాయి. సెంట్రల్ జైలు వద్ద దాదాపు రూ. కోటి నిధులతో చేపట్టిన సుందరీకరణ పార్కు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అదేవిధంగా కోటిలింగాల ఘాట్ వద్ద వాటర్ వర్క్స్ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. గోదావరి నదిలో గట్టుకు సమీపంలో ఇన్‌టేక్ వెల్ నిర్మాణాన్ని మధ్యలో నిలుపుదల చేశారు. ఏడాది కాలంగా ఈ పనులకు మోక్షం లభించలేదు. జల వనరుల శాఖ పెద్ద ఎత్తున స్నాన ఘట్టాలను నిర్మించింది. ఈ స్నాన ఘట్టాలు పర్యాటక శోభను సంతరించుకున్నాయి. గోదావరి నదిలో నీరు తక్కువగా ఉన్నపుడు రేవులన్నీ బురదమయంగా మారుతున్నా, నిర్వహణకు సంబంధించి నగరపాలక సంస్థ కనీసం పట్టించుకున్న దాఖలాలు కన్పించడం లేదు. దేశంలోనే అతి పెద్ద ఘాట్‌గా నిర్మించిన కోటిలింగాల ఘాట్‌ను కూడా పట్టించుకోవడం లేదు. అపరిశుభ్ర వాతావరణం అలుముకుంటున్నా, స్నానఘట్టాలు మురికికూపాలుగా మారుతున్నా పట్టించుకోడంలేదు. దీంతో ఏడాది తిరగకుండానే స్నానఘట్టాలు శిథిలస్థితికి చేరుకున్నాయి. ఇరిగేషన్ శాఖ నిర్మించినా నిర్వహణ మాత్రం స్థానిక నగరపాలక సంస్థ పర్యవేక్షించాల్సి ఉంది. స్నానఘట్టాల పట్ల నగరపాలక సంస్థ తీవ్ర నిర్లక్ష్యంతో ఏడాదికే శిథిలమయ్యే పరిస్థితి దాపురించింది.

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద ఇంకా జరుగుతున్న
పుష్కర సుందరీకరణ పనులు... అర్ధంతరంగా నిలిచిపోయిన
ఇన్‌టేక్ వెల్ పనులు.. వై జంక్షన్ వద్ద ఇంకా జరుగుతున్న
పుష్కర నిధులతో చేపట్టిన డ్రెయినేజీ పనులు