రాష్ట్రీయం

ఉరకలెత్తుతున్న గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11 : ఖమ్మం, గోదావరి జిల్లాల్లో గోదావరి నది ప్రమాదస్థాయిలో ప్రవహిస్తుండగా, ఆదిలాబాద్ జిల్లాల్లో గోదావరి ఉపనదులైన ప్రాణహిత, పెన్‌గంగా పొంగిపొర్లుతున్నాయి. భద్రాచలం దిగువ ప్రవాహం ఉధృతంగా ఉండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాటన్ బ్యారేజీకి ఉన్న 175 గేట్లను ఎత్తివేసి 5,16,538 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలివేస్తున్నారు. భద్రాచలంలో సెక్కోరియల్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా అధికారుల సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. గోదావరి జిల్లాలో టూరిజం బోట్ల రాకపోకలను సోమవారం నిలిపివేశారు. గోదావరి దిగువభాగంలో కరీంనగర్ జిల్లా కాళేశ్వరం నుండి వరద ఉధృతి భారీగా ఉంది తప్ప ఎగువ భాగమైన నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పి) లోకి పెద్దగా నీరు చేరడం లేదు. సోమవారం సాయంత్రానికి ఎస్‌ఆర్‌ఎస్‌పిలోకి కేవలం తొమ్మిది వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం మాత్రమే ఉంది. ఎస్‌ఆర్‌ఎస్‌పిలో నీటినిలువ పూర్తి సామర్థ్యం 91 టిఎంసిలు కాగా ప్రస్తుతం కేవలం 6.42 టిఎంసిల నీరు మాత్రమే ఉంది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు కేవలం 1.80 టిఎంసిల నీరు మాత్రమే చేరింది.
మహారాష్ట్ర నుండి భారీ వరద ఆదిలాబాద్ జిల్లాలోకి రావడంతో పాటు, ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో ఈ జిల్లా వరదలతో అతలాకుతలమవుతోంది. ఈ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టుపూర్తి స్థాయిలో నిండిపోవడంతో గడ్డెన్న వాగుద్వారా ఎస్‌ఆర్‌ఎస్‌పిలోకి మంగళవారం ఉదయానికి 18 వేల క్యూసెక్కుల నీరు చేరే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత, పెన్‌గంగా నదులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాణహిత పొంగిపొర్లుతుండటంతో నాటుపడవల రాకపోకలను నిషేధించారు. జిల్లాలోని చెరువులు, కుంటలు నీటితో నిండిపోయాయి. కొమురంభీం ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతుండటంతో ఐదుగేట్లు ఎత్తివేసి 25,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. కడెం ప్రాజెక్టులోకి సోమవారం 70 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో 14 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలివేస్తున్నారు. స్వర్ణ ప్రాజెక్టులోకి మహారాష్ట్ర నుండి భారీగా వరద చేరుతుండటంతో ఈ ప్రాజెక్టు నుండి అదనపు నీటిని కిందకు వదిలివేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఐదు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
కరీంనగర్ జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రాణహిత తదితర ఉపనదులద్వారా భారీగా వరద గోదావరిలోకి వస్తోంది. కాళేశ్వరవద్ద పుష్కరఘాట్ మునిగిపోయింది. లోతట్టులోని 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
భద్రాచలం వద్ద గోదావరి ఉరకలెత్తుతోంది. గోదావరి ఉరకలకు ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. రెవెన్యూ తదితర శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం సాయంత్రం గోదావరిలో 20 అడుగుల వరకు ఉన్న వరదనీటి మట్టం, సోమవారం రాత్రికి 53 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద గోదావరిలో స్నానఘట్టాలు నీటిలో మునిగిపోయాయి. ఈ ప్రాంతంలో ఐదు మండలాలకు వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. భద్రాచలం పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీలోకి నీరు చేరడంతో 50 కుటుంబాలకు సమీంపలో పునరావాసం కల్పించారు. ముందుజాగ్రత్త చర్యగా అధికారులు మరపడవలు తెప్పించి ఉంచడంతో పాటు గజఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు.
ధవళేశ్వరం వద్ద ఉగ్రరూపం
ధవళేశ్వరం వద్ద గోదావరిపోటెత్తింది. ఈ బ్యారేజ్ వద్ద సోమవారం సాయంత్రానికి నీటిమట్టం 7.3 అడుగులకు చేరింది. కాటన్ బ్యారేజీ నుండి 175 గేట్ల ద్వారా 5,16,538 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద మంగళవారం మొదటి ప్రమాద హెచ్చచరిక జారీ చేసే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఖమ్మం నుండి విలీనమైన మండలాల్లో రోడ్లపై వరదనీరు చేరుతోంది. ఇప్పటికే 20 గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. ఏజన్సీ ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

చిత్రాలు..భద్రాచలంలోని అశోక్‌నగర్ కొత్త కాలనీలో వరద నీట మునిగిన ఇళ్లు
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుండి దిగువకు వెడుతున్న వరద నీరు