తెలంగాణ

శ్రావణంలో కెసిఆర్ సుదర్శన యాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: శ్రావణ మాసంలో సుదర్శనయాగం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. తన వ్యవసాయ క్షేత్రం వద్ద ఆయుత చండీయాగం నిర్వహించిన సందర్భంగా ముగింపులో మిషన్ భగీరథ విజయవంతం అయితే సుదర్శన యాగం నిర్వహించాలని ఆలోచిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. మిషన్ భగీరథ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. గజ్వేల్ నియోజక వర్గంలో పలు గ్రామాలకు పైప్‌లైను పనులు పూర్తయ్యాయి. ఆషాఢ మాసం కావడంతో పాటు కొన్ని ఇళ్లకు ఇంకా నల్లాలు ఏర్పాటు చేయడంలో ఆలస్యం అవుతుండడం వల్ల శ్రావణ మాసంలోనే యాగం నిర్వహించాలని నిర్ణయించారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి నల్లా నీళ్లు ఇవ్వడం పూర్తయిన తరువాతనే గజ్వేల్ నియోజక వర్గంలో మిషన్ భగీరథను ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ నిర్ణయంలో భాగంగానే ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లను ఇస్తున్నారు. ఇది పూర్తి కావడానికి కొంత సమయం పడుతుందని, శ్రావణం నాటికి పూర్తవుతుందని అధికారులు తెలిపారు. గజ్వేల్ నియోజక వర్గంలో ఇంటింటికి నల్లా నీటిని అందించడం పూర్తి కాగానే సుదర్శన యాగాన్ని గజ్వేల్‌లోనే నిర్వహిస్తారు. సుదర్శన యాగాన్ని మూడు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. గతంలో తన వ్యవసాయ క్షేత్రంలో లోక కళ్యాణం కోసం ఆయుత చండీయాగం విజయవంతంగా నిర్వహించారు. ఆయుత చండీయాగం తరువాత జరిగిన వరుస ఎన్నికలు అన్నింటిలోనూ టిఆర్‌ఎస్ విజయం సాధించింది. తెలంగాణ ఉద్యమ కాలంలోనూ కెసిఆర్ తెలంగాణ భవన్‌లో పలుమార్లు యాగాలు నిర్వహించారు. యాగాలపై విశ్వాసం ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ మిషన్ భగీరథ విజయవంతం కావాలని కోరుతూ సుదర్శన యాగం నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ముందుగా ప్రకటించిన విధంగా యాగం నిర్వాహణకు గజ్వేల్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. వేద పండితులను సంప్రదించారు.