జాతీయ వార్తలు

‘కాశ్మీరం’ ఇంకా కల్లోలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూలై 12: వరుసగా నాలుగో రోజు కూడా కాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. శ్రీనగర్ పట్టణంలోని కొన్ని ప్రాంతాలు, పుల్వామా జిల్లా సహా కాశ్మీర్ లోయ ప్రాంతంలో మంగళవారం కూడా కర్ఫూ కొనసాగడంతో జన జీవనం స్తంభించింది. లష్కరే తోయిబా కమాండర్ బూర్హన్ వణి కాల్చివేతకు నిరసనగా మరింత తీవ్ర స్థాయిలో నిరసనలు జరిగేందుకు ఆస్కారం ఉందన్న సంకేతాలు అందడంతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆందోళనకారులు, జవాన్లకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 24కు పెరిగింది. సోమవారం గాయపడ్డ అదిల్ అహ్మద్ మట్టూ అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అలాగే ఘర్షణల్లో 115మంది పోలీసులు సహా మొత్తం 350మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కర్ఫ్యూ కారణంగా ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బుధవారం నుంచి రేషన్ దుకాణాలను తెరుస్తామని వెల్లడించారు. తదుపరి నిరసనలకు ఆస్కారం లేకుండా చేసేందుకు అన్ని కీలక ప్రాంతాల్లో భద్రతా దళాలను మరింతగా మోహరించామన్నారు. అలాగే ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగకుండా నిషేధాజ్ఞలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామన్నారు. దక్షిణ కాశ్మీర్‌లోని నాలుగు జిల్లాల్లో మొబైల్ ఫోన్ సర్వీసులను పాక్షికంగా అనుమతించినప్పటికీ ఇంటర్‌నెట్, రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి.వేర్పాటు వాదుల సమ్మె కారణంగా జనజీవనానికి మరింత ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పరీక్షలను పలు యూనివర్శిటీలు, విద్యా సంస్థలు వాయిదా వేశాయి. సయ్యద్ అలీషా గిలానీ, మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్ సహా అనేక మంది వేర్పాటువాద నాయకుల కస్టడీ లేదా గృహ నిర్బంధం మంగళవారమూ కొనసాగింది.

నాలుగోరోజూ కర్ఫ్యూ కొనసాగుతుండటంతో భద్రతా దళాల పహరాతో నిర్మానుష్యమైన శ్రీనగర్‌లోని ఓ వీధి