రాష్ట్రీయం

శాపంగా మారిన ‘అండమాన్’ ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 23: విధి నిర్వహణతో పాటు ప్రకృతి ఒడిలో ఉండే అండమాన్ అందాలను ఆస్వాదించాలన్న ఆసక్తి కొంతమంది ఎన్‌ఎడి ఉద్యోగుల పాలిట శాపమైందనవచ్చు. కొద్ది రోజులు అక్కడ పని చేసి తిరిగి వస్తారని భావిస్తున్న కుటుంబ సభ్యులకు వారు గల్లంతైనట్లు వస్తున్న సమాచారం ఆందోళనకు గురి చేస్తోంది. ప్రకృతి ఒడిలో ఉండే అండమాన్ వైమానిక స్థావరం వద్ద పని చేసేందుకు విశాఖలోని నేవల్ ఆర్మమెంట్ డిపో (ఎన్‌ఎడి) ఉద్యోగులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. విధి నిర్వహణతో పాటు అండమాన్ అందాలను తిలకించే అవకాశం లభిస్తుండటంతో అక్కడికి వెళ్లేందుకు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తుంటారు. వాయుసేనకు చెందిన ఎఎన్-32 విమానం అదృశ్యమైన ఘటనలో 29 మందిలో 8 మంది ఎన్‌ఎడికి చెందిన ఉద్యోగులు ఉండటం తెలిసిందే. అండమాన్ నికోబార్ కమాండ్ పరిధిలోని వివిధ నౌకల్లోని గన్స్, ఇతర పరికరాల నిర్వహణకు ఎన్‌ఎడికి చెందిన ఎఫ్లోట్ విభాగం సివిలియన్ ఉద్యోగులు నిపుణులు. దీంతో తరచూ ఎన్‌ఎడి ఉద్యోగులను అండమాన్‌కు నౌకాదళం అధికారులు తీసుకువెళ్తుంటారు. కొద్ది రోజుల పాటు అండమాన్‌లో ఉండి అందాలు తిలకించే అవకాశం కూడా లభిస్తుండటంతో చాలా మంది కార్మికులు ఉత్సాహం కనబరుస్తుంటారు. దీనికి తోడు అండమాన్‌లో ఎన్‌ఎడి ఒక స్టోర్‌ను కలిగి ఉంది. అక్కడ పని చేసేందుకు ప్రతి రెండు నెలలకు నలుగురు కార్మికులను రోటేషన్ పద్ధతిలో పంపుతుంటారు. సాధారణంగా ఆ విభాగ ఇన్‌చార్జి అండమాన్ పంపే వారిని ఎంపిక చేస్తారు. దీంతో ఉద్యోగుల మధ్య పోటీ ఉంటుంది. దీనిని అధిగమించేందుకు ఇన్‌చార్జిని, సహచర ఉద్యోగులను ఒప్పించి వెళ్తుంటామని కార్మికవర్గాలు తెలిపాయి.
విమానంలో కానీ, నౌకలో కానీ ఉద్యోగులు వెళ్లి, అందుకు అయిన ఖర్చుల బిల్లులు పెట్టాకే అధికారులు చెల్లింపులు చేస్తారు. ఇందుకు కొంత సమయం పడుతుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులను వాయుసేన విమానంలో తీసుకువెళ్తుంటారు. నౌకలో వెళితే ముందుగా చార్జీలను కార్మికులే భరించాల్సి ఉంటుంది. అండమాన్‌లోని వాయుసేన స్థావరంలో సిఆర్‌ఎన్-91 రకం గన్‌ల మరమ్మతు, ఇతర పనుల నిమిత్తం 13 మంది ఉద్యోగులను ఎన్‌ఎడి అధికారులు పంపారు. వీరు రైలులో ఈ నెల 20న చెన్నై బయలుదేరారు. అందులో 8 మందిని విమానం ద్వారా, అయిదుగురిని నౌక ద్వారా పంపేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందులో 8 మందిని ఎఎన్-32 విమానం ద్వారా పంపిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ అయిదుగురిని కూడా వెనక్కి రప్పిస్తున్నట్లు భోగట్టా. వీరు తిరిగి ఆగస్టు 2న విశాఖకు చేరుకోవాల్సి ఉంటుంది. తరచూ ఎన్‌ఎడి ఉద్యోగులు అండమాన్ విధి నిర్వహణ నిమిత్తం వెళ్తుండటం సాధారణమైనప్పటికీ, ఇటువంటి దుర్ఘటన జరగడం మాత్రం తొలిసారని ఉద్యోగవర్గాలు పేర్కొంటున్నాయి.
జలాంతర్గామిపైనే ఆశలు
అదృశ్యమైన ఎఎన్-32 విమానం ఆచూకీని కనుగొనడంలో జలాంతర్గామి సేవలపైనే అధికారులు ఆశలు పెట్టుకున్నారు. జలాంతర్గామి ద్వారానే ఆ విమానంలోని లొకేటర్ బీకన్ నుంచి సంకేతాలు గుర్తించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. గత ఏడాది జూన్‌లో తీర రక్షణ దళానికి చెందిన డార్నియర్ విమానం చెన్నై తీరంలో గల్లంతైనప్పుడు కిలో క్లాస్‌కు చెందిన ఐఎన్‌ఎస్ సింధుధ్వజ్ జలాంతర్గామిని రంగంలోకి దించారు. ముగ్గురు సిబ్బందితో ఉన్న ఆ డార్నియర్.. విమానం అదృశ్యమయ్యాక అందులోని లొకేటర్ నుంచి వెలువడుతున్న సంకేతాలను ఐఎన్‌ఎస్ సంధాయక్ నౌక తొలుత గుర్తించింది. దానిని జలాంతర్గామి సింధుధ్వజ్ ధ్రువపరిచింది. దీంతో ఆ విమాన శిథిలాలను గుర్తించేందుకు సాధ్యమైంది. ఆ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈసారి కూడా జలాంతర్గామి ద్వారానే గల్లంతైన ఎఎన్ 32 విమానంలోని లొకేటర్ సంకేతాలను గుర్తించే వీలు ఉందని భావిస్తున్నారు.